రాష్ట్రానికి 4 వేల మెగావాట్లు కొనసాగించాలి : సీఎం భట్టి

రాష్ట్రానికి 4 వేల మెగావాట్లు కొనసాగించాలి :  సీఎం భట్టి
  • వెయ్యి మెగావాట్లకు కుదించి.. రైతులకు అన్యాయం చేయొద్దు
  • కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి డిప్యూటీ సీఎం భట్టి విజ్ఞప్తి
  • 2 లక్షల సోలార్ పంపు సెట్లను కేటాయించాలని రిక్వెస్ట్
  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలోనే స్పందిస్తానని స్పష్టం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణకు గతంలో కేటాయించిన 4 వేల మెగావాట్ల విద్యుత్​ను అలాగే కొనసాగించాలని, దాన్ని వెయ్యి మెగావాట్లకు కుదించి రైతులకు అన్యాయం చేయొద్దని కేంద్ర ప్రభుత్వానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. 2 లక్షల సోలార్ పంపు సెట్లను కూడా కేటాయించాలని కోరారు. రాష్ట్రం వ్యవసాయరంగం బలోపేతానికి సహకారం అందించాలని విన్నవించారు. అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలోనే స్పందిస్తానని స్పష్టం చేశారు.

 మంగళవారం కేంద్ర ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్‌‌‌‌‌‌‌‌ జోషిని ఢిల్లీలోని ఆయన నివాసంలో భట్టి విక్రమార్క కలిశారు. భేటీలో ఎనర్జీ ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ సందీప్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ సుల్తానియాతో పాటుగా కేంద్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి కుసుం స్కీమ్‌‌‌‌‌‌‌‌లో కేటాయింపులపై సుదీర్ఘంగా చర్చించారు.  తెలంగాణకు సహాయ, సహకారాలు అందించాలని కేంద్ర మంత్రిని భట్టి కోరారు. తెలంగాణలో వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్‌‌‌‌‌‌‌‌ సరఫరాతో పాటు-, భవిష్యత్‌‌‌‌‌‌‌‌ అవసరాల దృష్ట్యా పునరుత్పాదక ఇంధన రంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట కార్యాచరణను అమలు చేస్తోందన్నారు. ముందే నిర్ణయించిన విధంగా పీఎం కుసుం కంపోనెంట్‌‌‌‌‌‌‌‌(ఏ) కింద 500 కేవీ నుంచి 2 ఎండబ్ల్యూ సామర్థ్యం కలిగిన మొత్తం 4 వేల మెగావాట్ల సోలార్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్ల స్థాపన కోసం విజ్ఞప్తి చేశారు.

 ఎంఎన్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఈ ఈఓఐ పున:సమీక్ష తర్వాత కేటాయింపులను 4 వేల మెగావాట్ల నుంచి వెయ్యి మెగావాట్లకు తగ్గించి ఇవ్వాలనుకున్నట్టు సమాచారం అందిందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలా తగ్గిస్తే రాష్ట్రం నిర్ధారించుకున్న లక్ష్యాలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. అలాగే పీఎం కుసుం కంపోనెంట్‌‌‌‌‌‌‌‌ (బీ) కింద ఒక లక్ష సోలార్ పంపు సెట్ల కేటాయింపుల కోసం మరో విజ్ఞప్తి చేశారు. 

కేంద్రం సహకరిస్తే మరిన్ని అద్భుతాలు

గిరిజనుల సాగు భూముల్లో విద్యుత్‌‌‌‌‌‌‌‌ లైన్ల స్థాపనకు అటవీ చట్టాలు ఆటంకంగా వున్నందున ఈ దిశగా కేంద్రం సహకరించాలని భట్టి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పీఎం కుసుం కంపోనెంట్‌‌‌‌‌‌‌‌ (సీ) కింద తెలంగాణ రాష్ట్రానికి 2 లక్షల సోలార్ పంపు సెట్లను కేటాయించాలని భట్టి కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌‌‌‌‌‌‌‌ జోషిని కోరారు. ఇప్పటికే రాష్ట్రంలో 28 లక్షల వ్యవసాయ పంపుసెట్లు వినియోగంలో ఉన్నందున సంప్రదాయ విద్యుత్‌‌‌‌‌‌‌‌ రంగంపై భారాన్ని నివారించేందుకు గాను వీటి అవసరాన్ని కేంద్ర మంత్రికి వివరించారు. వ్యవసాయరంగంలో రాష్ట్రం దేశంలోనే అత్యుత్తమ వార్షిక పురోగతి రేటు-ను సాధిస్తున్నదని చెప్పారు. కేంద్ర సహకారం తోడైతే మరిన్ని అద్భుతాలు చేసేందుకు వీలవుతుందని తెలిపారు. తమ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు భట్టి వెల్లడించారు.