ధరణిపై శ్వేతపత్రం రిలీజ్ చేస్తం : మంత్రి పొంగులేటి

ధరణిపై శ్వేతపత్రం రిలీజ్ చేస్తం : మంత్రి పొంగులేటి
  • పోర్టల్​ను ప్రక్షాళన చేస్తున్నాం: మంత్రి పొంగులేటి
  • ఏడాదిలో 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడి
  • బీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడింది: కోదండరాం
  • ఓయూలో ‘తెలంగాణ పునర్ నిర్మాణం’ సదస్సు

సికింద్రాబాద్, వెలుగు:  ధరణిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ధరణి పోర్టల్​ను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. రైతులకు ధరణి పోర్టల్ శాపంగా మారిందని తెలిపారు. సర్కార్ భూములు తమ పేర్ల మీద మార్చుకునేందుకు గత సర్కార్ కుట్ర పూరితంగా దీన్ని తీసుకొచ్చిందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీ డిపార్ట్​మెంట్ ఆధ్వర్యంలో ‘‘తెలంగాణ పునర్ నిర్మాణం: ఎమర్జింగ్ ఇష్యూస్, పాలసీ ఇంటర్వెన్షన్స్ అండ్ డెవలప్​మెంట్ ప్రాస్పెక్ట్”అనే అంశంపై మూడు రోజుల జాతీయ సదస్సు సోమవారం ప్రారంభమైంది. ఈ సెమినార్​కు మంత్రి పొంగులేటి చీఫ్ గెస్ట్​గా హాజరై మాట్లాడారు. ‘‘ధరణికి సంబంధించి గత ప్రభుత్వ పెద్దలు ఎన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా చేశారో.. ఎన్ని లక్షల కోట్ల ప్రజా ధనాన్ని కొల్లగొట్టారో త్వరలో ప్రజల ముందు పెడ్తాం. ధరణికి సంబంధించి గత ప్రభుత్వంలో వచ్చిన 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్​లో ఉన్నాయి. వీటి పరిష్కారానికి మార్చి 1 నుంచి 7 దాకా ఎమ్మార్వో స్థాయిలో సదస్సులు నిర్వహిస్తాం. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ భ్రష్టు పట్టించింది. ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. నిరుద్యోగ యువతి ప్రవళిక సూసైడ్ చేసుకుంటే కేబినెట్ మినిస్టర్ అవహేళనగా మాట్లాడాడు’’అని విమర్శించారు.

కాళేశ్వరం నోరు విప్పాలి

నీళ్ల విషయంలో ఏపీకి అనుకూలమైన నిర్ణయాలు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నదని పొంగులేటి మండిపడ్డారు. ‘‘80వేల పుస్తకాలు చదివిన పెద్ద మనిషి కాళేశ్వరంపై నోరు విప్పాలి. తానే ఇంజనీర్.. తానే తాపీ మేస్ర్తీ.. తానే ఒక డిజైనర్ అని ఫీల్ అయ్యాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్​ను వేగంగా నిర్మించామని ప్రచారం చేసుకున్నడు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నాం’’అని కేసీఆర్ నుఉద్దేశిస్తూ విమర్శించారు. ఏడాది కాలంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఇప్పటికే 23వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. మార్చి 2న 6వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పారు. త్వరలో మెగా డీఎస్సీ ప్రకటిస్తామన్నారు. మరో రెండు గ్యారంటీలు అమలు చేయబోతున్నామని తెలిపారు. 

రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు: కోదండరాం

తొమ్మిదిన్నరేండ్లు పాలించిన బీఆర్ఎస్.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ‘‘బీఆర్ఎస్ లీడర్లు ఎలా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో చెప్పడానికి ఇటీవల రిలీజ్ చేసిన కాగ్ రిపోర్టే నిదర్శనం. అధికారాన్ని వారి స్వప్రయోజనాల కోసమే వాడుకున్నారు’’అని అన్నారు. కాంగ్రెస్ సర్కార్ ప్రజా పాలన అందిస్తున్నదని తెలిపారు. తర్వాత ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ మాట్లాడారు. ఓయూలో నిధుల కొరత ఉందని, పోస్టులు భారీగా ఖాళీగా ఉన్నాయని తెలిపారు. 1,265 పర్మినెంట్ ఫ్యాకల్టీకి ప్రస్తుతం 365 మంది మాత్రమే ఉన్నారని చెప్పారు. విద్య, వైద్య, ఉపాధి రంగాలను కేసీఆర్ విస్మరించారని సీనియర్ జర్నలిస్ట్ రామచంద్ర మూర్తి విమర్శించారు. కాగా, 30 ఏండ్ల తర్వాత కేబినెట్ మంత్రి హోదాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఓయూలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. ముప్పై ఏండ్ల కింద సమాచార శాఖ మంత్రిగా ఉన్న డి.శ్రీనివాస్ ఓయూ ఆర్ట్స్ కాలేజీకి వెళ్లారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఏ మంత్రి కూడా యూనివర్సిటీ అధికారిక కార్యక్రమాలకు రాలేదు.