ధరణిలో స్లాట్ క్యాన్సిల్ చేసుకుంటే డబ్బులు వాపస్ రావట్లే

ధరణిలో స్లాట్ క్యాన్సిల్ చేసుకుంటే డబ్బులు వాపస్ రావట్లే
  • కోట్లాది రూపాయలు ప్రభుత్వ ఖజానాలోనే.. పోర్టల్ మొదలైనప్పటి నుంచి మూడేండ్లుగా ఇదే తీరు
  •  స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలోనూ రీఫండ్​ చేస్తలేరు
  •  లబోదిబోమంటున్న లక్ష మంది బాధితులు
  •  వివరాలు తీసుకుని పంపేస్తున్న ధరణి హెల్ప్ డెస్క్ స్టాఫ్
  •  రీఫండ్ కోసం ఏండ్ల తరబడి ఎదురుచూపులు

కరీంనగర్, వెలుగు: ఏదైనా అనివార్య కారణాలతో స్లాట్ క్యాన్సిల్ చేసుకుంటే.. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, విరాసత్ కోసం కట్టిన డబ్బులను సర్కార్ వాపస్ చేయడం లేదు. దీంతో వేలు, లక్షల్లో డబ్బులు చెల్లించిన సుమారు లక్ష మంది  బాధితులు.. రీఫండ్ కోసం ఏండ్లుగా ఎదురు చూస్తున్నారు. వారు తహసీల్దార్‌‌ ఆఫీసులు, కలెక్టరేట్లలో ఎంక్వైరీ చేసినా ఫలితం ఉండడం లేదు. కలెక్టరేట్లలో ధరణి డెస్క్ ల్లో బాధితుల నుంచి చలానాల వివరాలు తీసుకుని సీసీఎల్ఏకు రిపోర్ట్ చేస్తున్నప్పటికీ.. ఆ డబ్బులు వాపస్ రావడం లేదు. అత్యాధునిక సాఫ్ట్​వేర్​తో రూపొందించిన ధరణి పోర్టల్​లో వివిధ చార్జీల పేరిట డబ్బులు కట్ చేసుకునే వ్యవస్థ మాత్రమే ఉండి, వాపస్ చేసే టెక్నాలజీ  లేకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నాన్ అగ్రికల్చర్ ఆస్తులకు సంబంధించి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్లాట్ బుక్ చేసి క్యాన్సిల్​ చేసుకున్నా ఏడాది వరకు డబ్బులు వెనక్కి రావడం లేదు.

ప్రభుత్వానికి కాసులు కురిపిస్తున్న ధరణి

రాష్ట్ర ప్రభుత్వానికి ధరణి పోర్టల్ కాసులు కురిపిస్తున్నది. ఇందులో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ నుంచి ఏదైనా సమస్య మీద అప్లికేషన్ పెట్టుకునే వరకు అన్నింటికీ చార్జీలు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. స్లాట్ బుక్ చేసుకున్న వ్యక్తి ఏదైనా అనివార్య కారణాల వల్ల రిజిస్ట్రేషన్ లేదా ఇతర లావాదేవీలను రద్దు చేసుకుంటే మాత్రం ఆయా లావాదేవీల కోసం చెల్లించిన డబ్బులు తిరిగి రావడం లేదు. 2020 నవంబర్ 2న ధరణి పోర్టల్​లో సర్వీసులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సమస్యకు సర్కార్ పరిష్కారం చూపలేదు. 2020 నవంబర్ నుంచి 2‌‌మార్చి 31 వరకు 14,105 స్లాట్లు క్యాన్సిల్ కాగా, 2021 ఏప్రిల్ 1 వరకు 2022 మార్చి నెలాఖరు వరకు 45,012 స్లాట్లు, 2022 ఏప్రిల్ నుంచి 2023 మార్చి వరకు 35,598 స్లాట్లు వివిధ కారణాలతో  క్యాన్సిల్ అయ్యాయి. గత మూడు నెలల్లో మరో ఆరు వేల స్లాట్లు రద్దయినట్లు అంచనా. మొత్తంగా లక్షకుపై స్లాట్లు క్యాన్సిల్ కాగా.. వీటికి సంబంధించిన కోట్లాది రూపాయలు సర్కార్ ఖజానాలోనే ఉండిపోయాయి.

డబ్బులు వాపస్ చేయడంలో నిర్లక్ష్యం..

సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్టాంపు డ్యూటీ చెల్లించిన తర్వాత రిజిస్ట్రేషన్​ను రద్దు చేసుకుంటే... స్టాంపు డ్యూటీ ఫీజులో 10శాతాన్ని సర్వీసు చార్జీల కింద కట్ చేసుకుని మిగతా డబ్బులను సుమారు 3 నెలలలోపు ఇచ్చేవారు. రెండేండ్లుగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలోనూ డబ్బులు వాపస్ చేయడానికి ఏడాది పడుతున్నది. ధరణి పోర్టల్ కు వచ్చేసరికి స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజును రీఫండ్ చేసే మెకానిజమే లేకుండా పోయింది. ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పే ధరణి పోర్టల్ లో ఈ తరహా మెకానిజం లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
భువనగిరి జిల్లా పోచంపల్లికి చెందిన కాసారం దామోదర్ రెడ్డి బోడిపల్లి రెవెన్యూ పరిధిలో 25గుంటల భూమి రిజిస్ట్రేషన్ కోసం 2021 జులై 2న మధ్యాహ్నం 12.45  గంటల టైమ్ కు స్లాట్ బుక్ చేసుకున్నాడు. ఇందుకోసం రూ.1,54,533 చెల్లించారు. కానీ కొన్ని అనివార్య కారణాలతో ఒక రోజు ముందే స్లాట్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఈ డబ్బులు తిరిగి తమకు రీఫండ్ చేయాలని కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. కానీ ఇప్పటి వరకు ఆ డబ్బులు జమ కాలేదు. ఈ డబ్బులను బ్యాంకులో జమ చేస్తే బ్యాంకు ఇంట్రెస్టే ఈ రెండేండ్లకు రూ.30 వేలు వచ్చేదని వాపోయారు.

సర్కార్ ఇచ్చినప్పుడు తీసుకోవాలంటున్నరు

ధరణిలో డబ్బులు పోగొట్టుకున్న బాధితులు స్లాట్ క్యాన్సిల్ స్లిప్పులతో తహసీల్దార్, కలెక్టర్ ఆఫీసులు, మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. డబ్బులు వాపస్ చేయడం తమ చేతుల్లో లేదని, పైనుంచే రావాలని అధికారులు చేతులెత్తేస్తున్నారు. కలెక్టరేట్​లో ఏర్పాటు చేసిన ధరణి హెల్ప్ డెస్కుల్లో బాధితుల వివరాలు తీసుకుని పంపించేస్తున్నారు. డబ్బులు ఎప్పుడు వస్తాయని అడిగితే తమకు తెలియదని, ప్రభుత్వం వేసినప్పుడే తీసుకోవాలని చెప్తున్నారు.