రాష్ట్రాల ఆదాయ నష్టాన్ని కేంద్రం భరించాలి.. జీఎస్టీ పరిహార సెస్‌‌ లాగానే పూర్తిగా ఇవ్వాలి: భట్టి

రాష్ట్రాల ఆదాయ నష్టాన్ని కేంద్రం భరించాలి.. జీఎస్టీ పరిహార సెస్‌‌ లాగానే పూర్తిగా ఇవ్వాలి: భట్టి
  • రాష్ట్ర రాబడిలో 50 శాతం మేర జీతాలు, పెన్షన్లు, అప్పులకే  
  •     ఆదాయం తగ్గి హెల్త్​, విద్య  సంక్షేమ పథకాలపై ప్రభావం
  •     గతంలో రాష్ట్రాలకున్న ఆర్థిక స్వేచ్ఛ జీఎస్టీతో పోయిందని కామెంట్​
  •     జీఎస్టీ  కౌన్సిల్ సమావేశంలో డిప్యూటీ సీఎం పలు సూచనలు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర రాబడిలో 50 శాతానికి పైగా ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, అప్పుల చెల్లింపులకే ఖర్చవుతున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ విషయంలో రాష్ట్రాలకు ఎలాంటి వెసులుబాటు, స్వేచ్ఛ లేదని పేర్కొన్నారు. జీఎస్టీ రాకముందు, రాష్ట్రాలకు తమ అవసరాలకు తగ్గట్టుగా ఆదాయాన్ని పెంచుకునేందుకు, ప్రణాళికలు వేసుకునేందుకు స్వేచ్ఛ ఉండేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు రాష్ట్రాలకు అలాంటి ఆర్థిక స్వయం ప్రతిపత్తి  లేదని, అయితే ఖర్చులు మాత్రం రాష్ట్రాల  బాధ్యతేనని స్పష్టం చేశారు.   

ఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్‌‌లో కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 56వ వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. రాష్ట్రాల ఆదాయం తగ్గితే హెల్త్​, విద్యలాంటి ముఖ్యమైన సేవలు, సంక్షేమ పథకాలపై నేరుగా ప్రభావం పడుతుందని, ఇది సామాన్య, మధ్యతరగతి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, మౌలిక వసతుల ప్రాజెక్టులకు నిధులు లభించకపోతే రాష్ట్రాల అభివృద్ధి కుంటుపడుతుందని తెలిపారు.  జీఎస్టీ కౌన్సిల్ రాష్ట్రాల ఆదాయాన్ని కాపాడాల్సిన బాధ్యత కలిగి ఉందని పేర్కొన్నారు. 

పటిష్టమైన ఆదాయ రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలి

రేట్ల రేషనలైజేషన్‌‌ను స్వాగతిస్తూనే, రాష్ట్రాల ఆదాయాన్ని కాపాడే చర్యలను సమాంతరంగా అమలు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రతిపాదించారు.  పటిష్టమైన ఆదాయ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. జీఎస్టీ అనేది కేంద్రం, రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం, సహకార సమాఖ్య సూత్రం ఆధారంగా రూపొందించిన ఉమ్మడి ఆర్థిక వ్యవస్థ అని  పేర్కొన్నారు. రేట్ల సరళీకరణ, హేతుబద్ధీకరణ మంచి ఉద్దేశాలు అయినప్పటికీ.. రాష్ట్రాల ఆర్థిక స్థిరత్వానికి నష్టం కలిగించేలా ఉండకూడదని స్పష్టం చేశారు. పరిహారం లేకుండా ప్రస్తుత ప్రతిపాదనలు అమలు చేస్తే రాష్ట్రాల ఆదాయాలకు తీవ్ర నష్టం వాటిల్లి, ఆర్థిక అసమతుల్యాలు పెరుగుతాయని హెచ్చరించారు.  

భట్టి చేసిన సూచనలు

జీఎస్టీ పరిహార సెస్ మాదిరిగానే రాష్ట్రాలకు జరిగే ఆదాయ నష్టాన్ని పూర్తిగా ఇవ్వాలి.
    
ప్రస్తుత పన్ను స్థాయిని కొనసాగించేందుకు సిన్​, లగ్జరీ వస్తువులపై అదనపు సుంకం విధించాలి. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని పూర్తిగా రాష్ట్రాలకు బదిలీ చేయాలి.
    
రేట్ల రేషనలైజేషన్​, అలాగే పరిహార సెస్ గడువు ముగియడం వల్ల రాష్ట్రాలకు జరిగే ఆదాయ నష్టాన్ని భర్తీ చేయడానికి కేంద్రం రుణాలు సేకరించి, ఆ రుణాన్ని గతంలో మాదిరిగా పరిహార సెస్ గడువును ఐదేండ్ల కంటే పొడిగించి తిరిగి చెల్లించాలి.
    
పరిహారం కోసం 2024-–25 ఆర్థిక సంవత్సరాన్ని ప్రామాణిక సంవత్సరంగా పరిగణించాలి. ఈ ఏడాదిలో రాష్ట్రం అందుకున్న జీఎస్టీ ఆదాయం, అలాగే ప్లేస్ ఆఫ్ సప్లై ఆధారంగా రాష్ట్రానికి రావాల్సిన పరిహార సెస్ రెండింటినీ పరిహారంలో చేర్చాలి.
    
ఏడాదికి 14% చొప్పున ఆదాయ రక్షణ కల్పించాలి. ఇది గత మూడు ఆర్థిక సంవత్సరాల సగటు వృద్ధి రేటు కూడా.
    
కనీసం ఐదేండ్ల పాటు పరిహారం హామీ ఇవ్వాలి, ఆ తర్వాత జీఎస్టీ వృద్ధి ఆధారంగా రివ్యూ నిర్వహించాలి.