మాస్క్ లేకుంటే పోలింగ్ స్టేషన్‌కు రానివ్వొద్దు

మాస్క్ లేకుంటే పోలింగ్ స్టేషన్‌కు రానివ్వొద్దు
  • పోలింగ్ ముగియడానికి 72 గంటల ముందు ప్రచారం బంద్
  • ప్రతి బూత్‌ దగ్గరా హెల్త్ సిబ్బంది ఉండాలె
  • స్టేట్ ఎలక్షన్ కమిషనర్​ సి. పార్థసారథి

హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగియడానికి 72 గంటల ముందుగా మంగళవారం సాయంత్రం 5 గంటలకే ప్రచారాన్ని నిలిపేయాలని స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌‌ సి.పార్థసారథి ఆదేశించారు. ఓటింగ్ రోజుపోలింగ్ బూత్‌ల వద్ద జనం ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా చూడాలని, మాస్క్ లేకుంటే ఎవరినీ బూత్‌ల ఆవరణలోకి రానివ్వొద్దని సూచించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపైసోమవారం కొన్ని గైడ్‌లైన్స్ జారీ చేశారు. కరోనా రూల్స్ అమలయ్యేలా పర్యవేక్షించేందుకు ప్రతి వార్డుకు ఒక నోడల్ ఆఫీసర్‌‌ను నియమించాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రం దగ్గర శానిటైజర్లు, థర్మల్ స్కానర్లు ఉండాలని, హెల్త్ సిబ్బందిని నియమించాలని సూచించారు. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతంలో ఆయా వార్డులకు చెందిన ఓటర్లనే పోలింగ్ ఏజెంట్లుగా క్యాండిడేట్లు నియమించుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
మద్యం అమ్మకాలపై నిఘా
ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో 50 శాతానికి మించిన  మద్యం అమ్మకాలు ఉంటే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని పార్థసారథి ఆదేశించారు. పోలింగ్‌కు 48 గంటల ముందే మద్యం షాపులు బంద్ చేయాలని తెలిపారు. ఆయా మున్సిపాలిటీల్లో గతంలో జరిగిన అమ్మకాలతో, ప్రస్తుత అమ్మకాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఎన్నికలు జరిగే ప్రతి మున్సిపాలిటీలో ఒక్కో నోడల్ ఆఫీసర్ ను ఎక్సైజ్ శాఖ నియమించాలని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఖాళీ అయిన లింగోజిగూడ స్థానానికి ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు.