అవినీతి పాలకులను ప్రశ్నించడానికి వెనుకాడొద్దు

అవినీతి పాలకులను ప్రశ్నించడానికి వెనుకాడొద్దు

ప్రభుత్వ సేవలను పొందే విషయంలో ప్రస్తుతం సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ వ్యవస్థల్లో పెరిగిపోయిన అవినీతి సరైన సేవలను పొందే అవకాశాన్ని వారికి కల్పించడంలేదు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూడటం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. ప్రభుత్వ వ్యవస్థల్లో అవినీతిని రూపుమాపాలంటే మనం ఎన్నుకున్న పాలకులను, సర్కారు ఉద్యోగులను ప్రశ్నించడానికి ప్రజలు వెనుకాడకూడదు. ప్రజల్లో చైతన్యం వస్తేనే దేశంలో మార్పు వస్తుంది. పాలకులు, అధికారుల్లో భయం పెరుగుతుంది. ప్రజా చైతన్యమే దేశానికి, సమాజానికి రక్షగా నిలుస్తుంది.

ఒకరి నాయకత్వంలో స్థాపించిన హాస్పిటల్స్, విద్యా సంస్థలు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. తమకు స్తోమత లేకున్నా ఎక్కువ మంది ప్రజలు ప్రైవేటు సేవలకే మక్కువ చూపుతున్నారు. మన ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఆస్పత్రుల్లో మందులు, వసతులు లేక సర్కారు దవాఖానా అంటేనే ప్రాణం పోయినంత పని అవుతోంది. స్కూళ్లు, కాలేజీల్లో నాణ్యమైన బోధన లేక విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రభుత్వానికి, ప్రైవేటుకు ఎందుకింత తేడా అనేది మనకు అర్థం కాదు. దీనికి బాధ్యత ఎవరిది? మనం ఎన్నుకున్న నాయకులదా? ప్రభుత్వ అధికారులదా? ప్రతి ఏటా వీటి నిర్వహణ, అభివృద్ధి కోసం కోట్లు కేటాయిస్తున్నా ప్రజలకు ఆశించిన ఫలితాలు లభించడంలేదు. దాంతో ప్రభుత్వాలపై నమ్మకం సన్నగిల్లుతోంది. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రతిపక్షాలు ఆందోళనలు, నిరసనలు చేసి.. ప్రజలకు కొత్త వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వస్తున్నాయి. అయినా మళ్లీ అదే తంతు. నాయకులపై అవినీతి ఆరోపణలు, అధికారుల అలసత్వం, మార్పు కనబడని ఆస్పత్రులు, స్కూళ్లు మన కళ్లెదుట కనపడుతుంటాయి. 74 ఏండ్ల నుంచి ప్రజలు ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూస్తూనే ఉన్నారు.
నాయకులు ప్రజల గురించి పట్టించుకోవట్లే
మన దేశాభివృద్ధి కుంటుపడటానికి, ప్రజలకు ప్రభుత్వ సేవలు అందడంలో అలసత్వానికి కారణం ఎవరు? అధిక జనాభా, పేదరికం అని కొందరంటారు. మరికొందరు నిరక్షరాస్యత, వ్యవసాయ ఆధారిత దేశం కారణాలని చెబుతారు. ఇలా చర్చ మొదలై పరిష్కార మార్గాలను అన్వేషించినా, వాటిని అమలు పర్చడంలో విఫలమవుతున్నాం. పూర్వం రాజుల కొలువుల్లో మంత్రులు తెలివితేటలతో ఉండి, ప్రజల యోగక్షేమాల గురించి ఆలోచించేవారు. మహాత్మాగాంధీ, నెహ్రూ, అంబేద్కర్, పటేల్ లాంటి నాయకుల పోరాటంతోపాటు మేధోమథనం జరగడం వల్లే స్వాతంత్ర్యం సిద్ధించింది. కారణాలు ఏమైనప్పటికీ స్వాతంత్ర్యం అనంతరం మేధావులు, విద్యావంతులు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రానురాను స్వార్థపూరిత, అధికార దాహమున్న నేరచరితులు, గూండాలు రాజకీయాల్లోకి ప్రవేశించడం, సేవా ధృక్ఫథమున్న నాయకులు దూరమవ్వడంతో శాసన వ్యవస్థ బలహీనపడింది. ప్రస్తుత నాయకులు ప్రజల సమస్యలను పక్కన బెట్టి, ప్రజా సేవలను మరిచి, అనుచరులను వెంట బెట్టుకొని తమ కమీషన్ల వసూళ్లకై ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు. ప్రజలు తనను ఎందుకు ఎన్నుకున్నారు? నేను ఏ విధంగా ప్రజలకు సేవ చేయగలను? ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొత్త శాసనాలు చేయడం అవసరమా? అన్న విషయాలను పట్టించుకోవడం లేదు. ప్రస్తుతాన్ని మరిచి రాబోయే ఎన్నికల గురించే ఎక్కువ ఆలోచనలు చేస్తున్నారు. కొంతమంది నాయకులైతే తన కార్యకర్తల కోసమే పనిచేస్తున్నారు. తన నియోజకవర్గంలో మిగతా వారిని శత్రువుగా పరిగణిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సామాన్య ప్రజలకు ప్రభుత్వ సేవలు సరైన రీతిలో చేరక ఇబ్బందులు పడుతున్నారు.
యువతకు చేయూతనివ్వాలె
మన అఖండ భారత్ విభిన్న మతాలకు, విభిన్న కులాలకు నిలయం. భిన్నమైన సంస్కృతులు, వేర్వేరు యాసలు, భాషలు.. వీటన్నింటినీ కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. ప్రతి ఒక్కరూ దేశభక్తి, సమైక్యత, సౌభ్రాతృత్వం, సామరస్యం, జాతీయభావం అలవర్చుకోవాలి. మనకు స్వాతంత్ర్యం వచ్చి 74 సంవత్సరాలు గడిచినా ఈనాటికీ కోట్లాది మందికి సరైన కూడు, గుడ్డ, నాణ్యమైన విద్య, వైద్యం అందడంలేదు. మన తర్వాత స్వాతంత్ర్యం సాధించిన దేశాలు కూడా బాగా అభివృద్ధి చెందాయి. కొన్ని సంస్థలు చేసిన మార్గదర్శకాల ప్రకారం, మనదేశం అభివృద్ధి చెందిన జాబితాలో ఉండాలంటే వ్వవసాయంతో పాటు పరిశ్రమలు స్థాపించడానికి ప్రభుత్వం యువతకు చేయూతనివ్వాలి. ప్రభుత్వ పనులను నిర్మాణ రంగ సంస్థలకు అప్పగించడంలో నిజాయితీగా వ్యవహరించాలి. ప్రభుత్వం ప్రజాపంపిణీ అమలు పరిచే విధానంలో జవాబుదారీతనంతో మెలగాలి. ప్రభుత్వంలో అవినీతిని కూకటివేళ్లతో నిర్మూలించాలి.
ప్రజలకు సేవ చేయడానికి ముందుకు రావాలె
జర్మనీకి చెందిన ట్రాన్స్​పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ కరప్షన్​కు సంబంధించి చేసిన సర్వే ప్రకారం, 180 దేశాల్లో సర్వే చేయగా అవినీతిలో ఇండియా 86వ స్థానంలో నిలిచింది. సింగపూర్, అమెరికా తక్కువ అవినీతి ఉన్న దేశాలుగా, బంగ్లాదేశ్, వెనిజులా ఎక్కువ అవినీతిగల దేశాలుగా నిలిచాయి. మనిషి వ్యక్తిగత జీవితంలో ఏదైనా తప్పు చేస్తే తాను ఒక్కడే బాధను భరించాలి. కానీ ప్రజా జీవితంలో ఉన్న ప్రజాప్రతినిధులు తప్పులు చేస్తే అతన్ని ఎన్నుకున్న ప్రజలందరూ బాధను భరించాలి. అందుకే మన నాయకులను ఎన్నుకునే ముందు బాగా ఆలోచించాలి. నాగరిక ప్రపంచంలో ఏ నాయకుడైనా నిజాయితీ, ప్రజల భాగస్వామ్యం, జవాబుదారీతనంతో పరిపాలన సాగిస్తే అతను ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాడు. అలాగే ప్రజాస్వామ్య పరిరక్షణకై విద్యావంతులు, మేధావులు, యువత ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావాలి. భావితరాలకు మార్గదర్శకులుగా నిలవాలి.

నిజాయితీగా పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతది
మన మనగడ కోసం నిర్మించుకున్న ప్రభుత్వాలు, రాసుకున్న రాజ్యాంగం, రూపొందించుకున్న చట్టాలను నిజాయితీగా అమలు పరిచినప్పుడే నిజమైన అభివృద్ధి సాధిస్తాం. ప్రజల జీవితాలు ప్రభుత్వంతో నిరంతరం ముడిపడి ఉన్నాయి. మన పాలనా వ్యవస్థలో భాగమైన కొందరు అధికారులు ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో చూపించి ప్రజల సేవలకు అడ్డుపడుతుంటారు. మరికొంతమంది అధికారులు ఆశ్రితపక్షపాతం, అలసత్వం, నిర్లక్ష్యంతో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. కొంతమంది ప్రతి నెలా జీతభత్యాలు పొందుతూనే, మరోవైపు ప్రజలను పీడించి, అవినీతికి పాల్పడి సొమ్మును పోగు చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించి జవాబుదారీగా ఉంటూ, ఎటువంటి అవినీతి, అక్రమాలకు పాల్పడకుండా ఉంటే రిటైర్మెంట్​కు ముందు, రిటైర్మెంట్​కు తర్వాత కూడా నిర్భయంగా జీవించవచ్చు. ప్రతి రోజూ లంచం తీసుకొంటూ, భయభయంగా బతుకుతూ, సమాజానికి తప్పుడు సంకేతాలను పంపుతూ, విషవలయములో చిక్కుకొని కొందరు తొందరగా తనువు చాలిస్తున్నారు. 

అవినీతిని రూపుమాపాలె
మన సమాజంలో ఉన్న సతీసహగమనం, బాల్య వివాహాలు, అంటరానితనం, బాలకార్మికుల వంటి సాంఘిక రుగ్మతలను రూపుమాపుకొన్నాం. ప్రభుత్వ వ్యవస్థల్లో అవినీతిని కూడా రూపుమాపడం సాధ్యపడదా? మన ప్రజాస్వామ్య పాలనలో ఇది కచ్చితంగా సాధ్యపడుతుంది. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు ద్వారా మంచి నాయకత్వాన్ని బలపరచాలి. సమాజంలో ప్రజలు ప్రశాంతంగా జీవించడానికి మనం నిర్మించుకున్న ప్రభుత్వాలను మనం ప్రశ్నించాలి. ప్రస్తుత పాలనతో విరక్తి చెందితే పాలకులను ప్రశ్నించడానికి వెనుకాడవద్దు. ప్రస్తుతం రాజ్యాంగ హక్కుల గురించి మాట్లాడే వారు ఎక్కువై.. వారి బాధ్యతలను విస్మరిస్తున్నారు. మనది అతిపెద్ద లిఖిత రాజ్యాంగమైనా, దానిని అనుసరించడంలో వెనుకబడ్డామని చెప్పవచ్చు. మన న్యాయ వ్యవస్థ ప్రజలకు సత్వర న్యాయాన్ని అందించకపోవడం ఒక కారణం. ఈ పరిస్థితుల కారణంగా సేవాధృక్పథం ఉన్న వారు ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలంటే భయపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైన మీడియా కూడా తన కర్తవ్యాన్ని నెరవేర్చలేకపోయింది. నేటి మీడియా వైఖరి మాదిరిగానే 1947 కంటే ముందు పరిస్థితి ఉంటే ఇంకా మనం స్వాతంత్ర్యం రాని దేశాల జాబితాలోనే ఉండేవాళ్లం.

                                                                                                                               - సోమ  శ్రీనివాస్ రెడ్డి, వ్యవస్థాపకులు,  సర్వేజనా సుఖినోభవంతు ఫౌండేషన్