డీఎస్పీ విష్ణుమూర్తి మృతి తీరని లోటు : ఎస్పీ కాంతిలాల్ పాటిల్

డీఎస్పీ విష్ణుమూర్తి మృతి తీరని లోటు : ఎస్పీ కాంతిలాల్ పాటిల్

ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫా బాద్ జిల్లాలో ఫంక్షనల్ ఆర్టికల్స్ విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న సబ్బాని విష్ణుమూర్తి (57) హైదరాబాద్​లోని తన ఇంట్లో ఆదివారం రాత్రి గుండెపోటుతో చనిపోయారు. ఆయన మృతి పట్ల ఎస్పీ కాంతిలాల్ పాటిల్  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో బాధాకరమని, ఆయన మృతి పోలీస్ శాఖకు తీరని లోటని అన్నారు. సోమవారం ప్రెస్ నోట్ రిలీజ్​ చేశారు. విష్ణుమూర్తి విధేయత, క్రమశిక్షణతో పనిచేసిన నిజాయితీ గల అధికారి అని అన్నారు. విష్ణుమూర్తి ఆత్మకు శాంతి చేకూరాలని, జిల్లా పోలీస్ శాఖ తరఫున ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సంతాపం పాటించిన బహుజన సంఘాలు

డీఎస్పీ విష్ణుమూర్తి అకాల మరణం బహుజనులకు తీరని లోటని భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షుడు అశోక్ మహుల్కర్ అన్నారు. సోమవారం వాంకిడి మండల కేంద్రంలోని  జేత్వాన్ బుద్ధ విహార్ లో సంతాప సభ నిర్వహించి ఆయన ఫొటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విష్ణు మూర్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపించిన మార్గంలో నడుస్తూ అనేక మంది దళిత విద్యార్థులు, నిరుపేదలకు సాయం చేశారని అన్నారు. 

ప్రజల సమస్యలను తనవిగా భావించి సాయం చేసేవారిని పేర్కొన్నారు. కార్యక్రమంలో బౌద్ధ గురు బంతే భరద్వాజ్, సమతా సైనిక దళ్ జిల్లా అధ్యక్షుడు దుర్గం సందీప్, భారతీయ బౌద్ధ మహాసభ, అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు దుర్గం దుర్గాజి, ప్రధాన కార్యదర్శి విజయ్ ఉప్రే తదితరులు పాల్గొన్నారు.