హర్యానాలో సైనీ సర్కార్ మైనార్టీలో పడ్డది..బల పరీక్ష పెట్టండి

హర్యానాలో సైనీ సర్కార్ మైనార్టీలో పడ్డది..బల పరీక్ష పెట్టండి
చండీగఢ్:  హర్యానా సర్కారుకు అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని కోరుతూ జన నాయక్ జనతా పార్టీ (జేజేపీ) చీఫ్‌‌‌‌ దుష్యంత్ చౌతాలా గురువారం ఆ రాష్ట్ర గవర్నర్‌‌‌‌ బండారు దత్తాత్రేయకు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వానికి మెజారిటీ లేకపోతే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్‌‌‌‌ చేశారు. బీజేపీకి ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మద్దతు ఉప సంహరించుకోవడంతో సీఎం నాయబ్ సైనీ ప్రభుత్వం మైనార్టీలో పడిందని లేఖలో తెలిపారు. బల పరీక్ష ద్వారా రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. దుష్యంత్  లేఖతో హర్యానా రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. ‘‘సీఎం నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వానికి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నారు. ప్రభుత్వాన్ని కొనసాగించేంత బలం సైనీ సర్కార్​కు లేదు. వెంటనే అసెంబ్లీలో బల పరీక్ష నిర్వహించాలి.
 
మెజారిటీ నిరూపించుకుంటేనే సైనీ ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉంటుంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేకపోతే రాష్ట్రపతి పాలన విధించాలి” అని దుష్యంత్​ చౌతాలా లేఖలో పేర్కొన్నారు. మరోవైపు భేటీ అయ్యేందుకు టైమ్ ఇవ్వాలని అటు కాంగ్రెస్ ప్రతినిధులు కూడా గవర్నర్​ను కోరారు. బల  పరీక్ష పెడితే తమ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్​కు మద్దతు ఇస్తారని ఆయన ఓ వీడియో మెసేజ్ లో తెలిపారు. కాంగ్రెస్​కు అనుకూలంగా ముగ్గురు స్వతంత్రులు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు సోంబిర్ సంగ్వాన్ (దాద్రీ), రణధీర్ సింగ్ గొల్లెన్ (పుండ్రి), ధరంపాల్ గొండర్ (నిలోఖేరి) సైనీ సర్కార్​కు తమ మద్దతు ఉప సంహరించుకున్నారు. వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు డిసైడ్ అయ్యారు.  కాగా, మార్చి 13వ తేదీనే అసెంబ్లీలో బల పరీక్ష నిర్వహించామని అసెంబ్లీ స్పీకర్ జ్ఞాన్​చంద్ గుప్తా తెలిపారు. మళ్లీ ఆరు నెలల తర్వాతే బల పరీక్షకు చాన్స్ ఉంటుందన్నారు. 

మా ప్రభుత్వానికి ఢోకా లేదు: సైనీ

తమ ప్రభుత్వానికి ఢోకా లేదని,  మార్చిలో పెట్టిన అవిశ్వాస తీర్మానంలో గెలిచామని సీఎం సైనీ స్పష్టం చేశారు. ఎప్పుడంటే అప్పుడు బల పరీక్ష పెట్టలేరని అన్నారు. మళ్లీ ఆరు నెలల తర్వాతే ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాల్సి ఉంటుందని, అప్పుడైనా తామే స్పష్టమైన మెజార్టీతో గెలుస్తామన్నారు.