కేసీఆర్​ పాలన పోవాలె.. తెలంగాణ గెలవాలె

కేసీఆర్​ పాలన పోవాలె.. తెలంగాణ గెలవాలె

నవంబర్ 30 నాడు జరుగనున్న ఎన్నికల్లో పోటీ వ్యక్తుల మధ్యనో, పార్టీల మధ్యనో కాదు. పాలకుల నిరంకుశత్వానికి, ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షల మధ్యనే ఈసారి ఎన్నికల్లో పోరాటం జరుగుతున్నది.  ఎన్నికల రాజకీయాలు ఎన్నికలతో మొదలై ఎన్నికలతోనే అంతం కావు. ఎన్నికలకు ముందు తలెత్తిన రాజకీయ పరిణామాలు ఎన్నికల్లో చాలా సాంద్రంగా వ్యక్తమౌతాయి. అందుకని ఎన్నికలకు ముందే  మొదలైన  పరిణామాలపైన దృష్టి పెడితే తప్ప ఎన్నికలను అర్థం చేసుకోలేం. 2018 ఎన్నికల్లో  గెలిచిన తరువాత కేసీఆర్​లో అహంభావం మరింత పెరిగింది.

పాలనలో నిరంకుశత్వం తీవ్రమైంది. రాజ్యాంగం వలన ఏర్పడిన వ్యవస్థలను విధ్వంసం చేసి, రాజ్యాంగ మర్యాదను కాలరాచి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టానుసారం అధికారాన్ని చెలాయిస్తున్నాడు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన ప్రతిరూపాలే. వారికి స్వతంత్ర అస్తిత్వం లేదు. స్వతంత్రంగా వ్యవహరించలేరు.  చట్టబద్ధ పాలన మచ్చుకైనా కనిపించడం లేదు. ఆయన ఏదంటే అదే చట్టం. ప్రభుత్వంతో సంభాషణ సాధ్యం కాదు. ముఖ్యమంత్రి ఎవరినీ కలువడు. మంత్రులను, ఎమ్మెల్యేలను కలిసినా ప్రయోజనం లేదు. ముఖ్యమంత్రి చెవిలో వేస్తానని వారు రొటీన్​గా సమాధానం చెపుతారు.

ఉద్యమ చరిత్ర వక్రీకరణ

 నిరంకుశ పాలనను సమర్థించుకోవడానికి కేసీఆర్ ఒక సిద్ధాంతాన్ని తయారు చేసినాడు. ఒక వ్యక్తి వల్లనే తెలంగాణ ఏర్పడిందన్న సిద్ధాంతాన్ని కేసీఆర్ తెలంగాణ ఉద్యమ చరిత్రను వక్రీకరించి  తయారు చేసినాడు. ఈ సిద్ధాంతం ప్రకారం కేసీఆర్ చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణను సాధించాడు. కేసీఆర్ దీక్షా దివస్ తప్ప తెలంగాణ చరిత్రలో ఇంకే పోరాటాలు జరుగలేదని  కేసీఆర్ ఉద్యమ  చరిత్ర చెప్పుతున్నది. మిగతా పోరాట ఘట్టాల ప్రస్తావన ఆయన సిద్ధాంతంలో లేదు.

 కేసీఆర్ తప్ప ఉద్యమంలో ఇక ఎవ్వరూ లేరు. ఈ ఉద్యమ చరిత్రలో ప్రజలు నిమిత్తమాత్రులు.  సమరశీలతతో, త్యాగనిరతితో ప్రజలు చేసిన పోరాటాలకు విలువలేదు. అమరుల ప్రస్తావన ఉండదు.  కేసీఆర్  వల్లనే  తెలంగాణ ఏర్పడింది కాబట్టి  ఆయన కన్నా తెలంగాణ గురించి ఆలోచించగలిగినవారు, తెలంగాణ పట్ల నిబద్ధతను కలిగినవారు లేరు. ఆయనను ప్రశ్నిస్తే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్నట్లేనని ప్రచారం చేసినాడు. కేసీఆర్,​ తెలంగాణ ఒక్కటే కాబట్టి...కేసీఆర్​ను విమర్శించి తెలంగాణా అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని అడ్డుకోవద్దన్న భావనను ప్రభుత్వమే ప్రచారం చేసింది. కేసీఆర్ ఏదో ఒకటి చేస్తున్నాడని నమ్మినవాళ్లంతా ఆయన సిద్ధాంతానికి పరోక్షంగా బలాన్ని చేకూర్చారు. ఈ సిద్ధాంతాన్ని అడ్డం పెట్టుకొని కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరించగలిగాడు.

పాలకుల ప్రయోజనాలకే ప్రాధాన్యం

 నిరంకుశ అధికారాలను కేసీఆర్ సమష్టి ప్రయోజనాల కోసం ఉపయోగించలేదు.  సమష్టి వనరుల దోపిడీకి వాడుకున్నాడు. ప్రజలు, ప్రజా సంక్షేమం అనే విషయాల పట్ల పాలకులకు పట్టింపు లేదు. ఇసుక దందాలు, భూముల సెటిల్మెంట్లు, ప్రభుత్వ కాంట్రాక్టులు సంపాదించుకోవడం వారికి ప్రధాన లక్ష్యాలు అయ్యాయి. ఆ పనుల మీదనే దృష్టి పెట్టారు. ఓటు వేసి గెలిపించిన ప్రజల సంగతి మరిచిపోయారు. పాలకులకు స్వంత ప్రయోజనాలే ప్రధానమయ్యాయి.

రాబందుల గుంపు అధికార పీఠం మీద కూర్చొని రాష్ట్రాన్ని దోచుకొని తింటున్నది. ఈ పరిస్థితి వల్లనే రాష్ట్రం అప్పుల పాలైంది.  కేసీఆర్ పాలనలో బాగా నష్టపోయింది విద్యార్థులు. అటు తరువాత  రైతులు, వృత్తుల మీద ఆధారపడి బతికే వర్గాలు. ఉపాధి, ఉద్యోగం కల్పించ వలసిన బాధ్యత ప్రభుత్వానిదేనన్న సోయి పాలకులకు లేనే లేదు. గత పదేండ్ల కాలంలో ప్రైవేట్ రంగంలో వచ్చిన అరకొర ఉద్యోగాలు ఇతర రాష్ట్రాల వారికి దక్కినాయి, ప్రభుత్వ ఖాళీల భర్తీకి అప్పుడో ఇప్పుడో  పరీక్షలు జరిపినా అధికార పక్ష నాయకులే ప్రశ్నపత్రాలు అమ్మి సొమ్ము చేసుకున్నారు. తమ వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చుకున్నారు.  అన్నీ తప్పుడు లెక్కలు చూపి ప్రజలను ఎప్పటికీ మభ్యపెట్టలేరు కదా.

వాస్తవాలు వెలుగులోకి..

తమ పిల్లలకు ఉద్యోగం రాకపోవడానికి పాలకుల నిర్వాకమే కారణమని ప్రజలకు అర్థమైంది. కళ్లు తెరిచిన ప్రజలు పాలకులపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు స్థానికులకే రిజర్వు చేయలేకపోయింది ప్రభుత్వం. వ్యవసాయ రంగం విషయానికి వస్తే.. దున్నినా, దున్నక పోయినా భూస్వాములకు రైతుబంధు ఇవ్వడంతో వ్యవసాయ రంగంలో అసమానతలు పెరిగిపోయాయి. వాస్తవంగా వ్యవసాయం పైన ఆధారపడి బతుకుతున్నవారికి ఇచ్చిన సాయం చాలలేదు.

నానాటికీ పెరుగుతున్న ధరల కారణంగా పెట్టుబడి పెరిగింది, ఆదాయం మాత్రం అదే స్థాయిలో పెరగకపోవడంతో ఎవసాయం దండుగయింది. వృత్తుల మీద ఆధారపడి బతుకుతున్న వర్గాల ప్రజలు  బతుకుదెరువు కోల్పోయి ఆత్మహత్య చేసుకుంటున్నా ప్రభుత్వం నుంచి చేయూత లేదు. ఆదుకునే ప్రయత్నం జరగనేలేదు. గొర్రెపిల్లల పంపిణీ మూడునాళ్ళ ముచ్చటయింది. చెరువులో వేసిన చేప పిల్లల కన్నా నాయకులు లెక్క రాసుకొని బిల్లులు తీసుకున్నది ఎక్కువ. ముడి సరుకు ధరలు పెరిగి సరుకు అమ్ముడుపోక, కూలి గిట్టుబాటు కాక నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం స్పందించ లేదు. స్వర్ణకారులది, కంచరి, కమ్మరి, వడ్రంగం పని చేసేవారిది ఇదే పరిస్థితి.        

ధరణితో పాలకులకు లబ్ధి

 ధరణిలో తప్పులు దొర్లినా రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా ధరణిని సంస్కరించి ప్రభుత్వం పరిష్కారం చూపలేకపోయింది. కానీ, ఆ ధరణిని వాడుకొని లిటిగేషన్ భూములను, లావారిస్ భూములను, ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని పాలకులు తమపేరుమీద రాయించుకున్నారు. ధరణి పాలకులకు ఉపయోగపడినంతగా ప్రజలకు ఉపయోగపడలేదు. ఏనాడో గ్రామ భూస్వాముల నుంచి సాదా బైనామా ద్వారా భూములు కొన్న రైతులు ఇయ్యాల భూములను  కోల్పోయారు. వాటిని భూస్వాములు కాజేశారు. ధరణి పోతే భూములు పోతాయి, రైతు బంధు రాదని బెదిరిస్తున్న ముఖ్యమంత్రి ఈ సమస్యల గురించి మాత్రం మాట్లాడడు.

హడావిడిగా ఎక్కువ ఖర్చుతో కాళేశ్వరం బ్యారేజీలు కట్టి కాంట్రాక్టర్ల జేబులు నింపాలన్న యావ తప్ప తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన లేక పోవడం వల్లనే ఇయ్యాల కాళేశ్వరం బ్యారేజీలు కుంగిపోతున్నాయి. పైన కట్టిన పోచంపాడు డ్యామ్, ఎల్లంపల్లి డ్యామ్ బాగానే ఉన్నాయి. కింద పెట్టిన దేవాదులు పంపులు చెక్కుచెదరలేదు. కానీ, నడుమవున్న కాళేశ్వరం నడుమనే పోయింది. ప్రభుత్వం పరిచిన మిషన్ భగీరథ పైపుల వలన కాంట్రాక్టర్లకు పైసలు వచ్చినాయి. కానీ,  ప్రజలు ఇప్పటికీ తాగునీళ్లు కొనుక్కొని తాగుతున్నారు.

ఆయనకు ఎన్నికలు ఒక ఆట

హిట్లర్ రాసిన మెయిన్ కాంఫ్ ను బైబిల్ గా నమ్మే  కేసీఆర్ దృష్టిలో ప్రజలు లేకపోవడంలో వింత లేదు. ఆయన ఆలోచనల్లో  ఎన్నికలు ఒక ఆట. మాకియావెల్లి చెప్పినట్టు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి జరిగే ఆట.  ఆ ఆటలో ఎప్పుడూ ప్రతిపక్షాలను బలహీనపరచడమే ఆయన ఎత్తుగడ.  ప్రజలే చైతన్యవంతులైన రోజు ఏ శక్తి నిలవదన్న విషయాన్ని తెలంగాణ ఉద్యమం నేర్పించింది. కానీ,  కేసీఆర్ ఈ విషయాన్ని ఎన్నడూ గుర్తించలేదు.

ప్రజలను తొలుబొమ్మలను చేసి ఆడించవచ్చునని నమ్మిన కేసీఆర్ నేడు భంగపడ్డాడు. ఇక కేసీఆర్ అనే నియంతను సాగనంపడానికి ప్రజలు చైతన్యవంతులై, తమపాత్ర పోషించడానికి  సిద్ధమయ్యారు. ఎట్టి పరిస్థితిలోనూ తెలంగాణ గెలవాలన్న పట్టింపుతో ప్రజలు ఉన్నారు. వాస్తవానికి ప్రజలే పార్టీల కన్నా ఒక అడుగు ముందున్నారు. 

తుపాకీ రామన్నలా కేసీఆర్ ప్రగల్భాలు

ప్రభుత్వ యూనివర్సిటీలను నాశనం చేసి భారాస సభ్యులు యూనివర్సిటీలు పెట్టుకొని లాభపడ్డారు. ఆర్టీసీ కోసం ప్రైవేటు బస్సులు కొని లాభాలను ప్రైవేట్ కంపెనీలకు కలిగించినారు. ఒకవైపు  ప్రైవేట్ కంపెనీలకు దోచిపెట్టగా మరొకవైపు  విద్య, వైద్యం మీద, సంక్షేమం మీద బడ్జెట్ కోత విధించారు. దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు పేరుతో చిల్లర పైసలు వెదజల్లి  ప్రజలను ఆఫీసుల చుట్టూ, నాయకుల చుట్టూ తిప్పుకున్నారు.

వాస్తవాలను దాచిపెట్టడానికి అనేక కట్టు కథలు చెప్పడానికి కేసీఆర్ ప్రయత్నించాడు. ఇప్పుడు ప్రజలు కేసీఆర్ ముచ్చట వినడానికి సిద్ధంగా లేరు. ఆయన చెప్పే ముచ్చటకు వాస్తవానికి మధ్యన పొంతన లేదన్న విషయాన్ని ప్రజలు తెలుసుకున్నారు. ఒకప్పుడు తూటాల వలె పేలిన కేసీఆర్ మాటలు ఇవ్వాళ తుపాకీ రామన్న ప్రగల్భాల వలే వినబడుతున్నాయి.  వాస్తవాలు బయటకు పొక్కకుండా మీడియాను నియంత్రించి జాగ్రత్త పడిన కేసీఆర్ ఇవ్వాళ ప్రజలకు వాస్తవాలను తెలియచేస్తున్న సోషల్ మీడియాను నియంత్రించ లేకపోతున్నాడు. వాస్తవాలన్నీ ప్రజలకు తెలుస్తున్నాయి.   

కార్పొరేట్ శక్తులతో కుమ్మక్కు

గత ఎన్నికల్లో వాస్తవాలను కప్పిపుచ్చి, తన మాయ మాటలతో ప్రజలను కేసీఆర్ కనికట్టు చేయగలిగాడు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఆయన ఎత్తుగడ ప్రజలకు అర్థమైంది. కాంట్రాక్టర్లు, కార్పొరేట్ శక్తులతో కుమ్మక్కైన  పాలకులు కోట్లు దోచుకొని తమకు చిల్లర పైసలు వేస్తున్నారన్న విషయం ప్రజలకు అర్థమైంది. పాలకుల కుట్రలు తేలిపోయాయి. కేసీఆర్ అస్త్రాలు అన్నీ అయిపోయాయి. ఇప్పుడు కేసీఆర్ ముందున్న మార్గం ఒక్కటే. ప్రతిపక్ష పార్టీల నాయకులను కొనుగోలు చేసి నిలదొక్కుకోవడానికి ప్రయత్నించడం తప్ప ఆయనకు ఇంకొక మార్గం లేదు. కేసీఆర్ వ్యూహంలో ఒక బలహీనత ఉన్నది. ఆయన ప్రజల్లో తన బలాన్ని పెంచుకోవడం కన్నా ప్రతిపక్షాలను బలహీన పరచాలని చూస్తాడు.

ప్రొ. ఎం కోదండరామ్,అధ్యక్షుడు,  తెలంగాణ జనసమితి