తెలంగాణ బడుల్లోనూ పత్రికా పఠనం తప్పనిసరి చేయాలి

తెలంగాణ బడుల్లోనూ పత్రికా పఠనం తప్పనిసరి చేయాలి

ఇటీవల ఉత్తరప్రదేశ్  ప్రభుత్వం పాఠశాల విద్యార్థులు తప్పనిసరిగా వార్తా పత్రికలు చదవాలనే నిర్ణయం తీసుకోవడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ నిర్ణయం విద్యను  కేవలం పాఠ్యపుస్తకాలకు పరిమితం చేయకుండా, విద్యార్థులను సమాజంతో  అనుసంధానం చేసే దిశగా ఒక కీలకమైన  ముందడుగుగా చెప్పవచ్చు. 

నేటి డిజిటల్ యుగంలో  విద్యార్థులు ఎక్కువగా  మొబైల్ ఫోన్లు,  సోషల్ మీడియా, షార్ట్ వీడియోలకే పరిమితమవుతున్నారు. దీనివల్ల ఏకాగ్రత లోపించడం, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో పత్రికా పఠనాన్ని అలవాటుగా మార్చడం ద్వారా  విద్యార్థుల్లో  ప్రశాంతత, ఆలోచనా శక్తి,  భాషా నైపుణ్యాలు మెరుగుపడతాయి. 

విభిన్న అంశాలపై సమాచారం
పత్రికా పఠనం వల్ల రాజకీయాలు,  ఆర్థిక వ్యవస్థ, విజ్ఞానం, పర్యావరణం, క్రీడలు వంటి విభిన్న అంశాలపై సమాచారం లభిస్తుంది. వర్తమాన  వ్యవహారాలపై అవగాహన పత్రికల ద్వారానే  బలపడుతుంది. అదే విధంగా పత్రికా పఠనం.. పుస్తక పఠనానికి తొలిమెట్టు వంటిది. రోజూ కొంత  సమయం  పత్రిక చదవడం ద్వారా చదవాలనే ఆసక్తి పెరిగి,  భవిష్యత్తులో  నాణ్యమైన  పుస్తకాలు చదివే అలవాటు  ఏర్పడుతుంది. 

ఇది విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుంది.  పత్రిక చదవడం విద్యార్థుల్లో  సామాజిక బాధ్యతను పెంచుతుంది. యూపీఎస్సీ,  టీజీపీఎస్పీ వంటి  పరీక్షలకు  సంబంధించిన  సమాచారం  పత్రికల ద్వారా సులభంగా లభిస్తుంది.  పాఠశాలల్లో  పత్రికా పఠనం వల్ల విద్యార్థుల భవిష్యత్తు పోటీ పరీక్షలకు చాలా ప్రయోజనం కలుగుతుంది. పత్రికలు  విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచనా శక్తిని పెంచుతాయి.  వివిధ అంశాలపై  భిన్నమైన అభిప్రాయాలను చదవడం ద్వారా వారు ఆలోచించి నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు.

సమకాలీన పరిణామాలపై అవగాహన
పత్రికలు చదవడం వల్ల భాషా నైపుణ్యాలు మెరుగుపడతాయి. కొత్త పదాలు, వాక్య నిర్మాణాలు తెలుసుకోవడం ద్వారా పదసంపద పెరుగుతుంది. ఇది వ్యాస రచన, ప్రసంగం, పరీక్షలలో సమాధానాలు రాయడంలో ఎంతో ఉపయోగపడుతుంది. 

పత్రికా పఠనం ద్వారా విద్యార్థులకు ఎన్నో విషయాలపై అవగాహన పెరుగుతుంది.  దేశం, ప్రపంచం, రాజకీయాలు, శాస్త్ర, సాంకేతికత, క్రీడలు వంటి విభిన్న రంగాలకు సంబంధించిన సమాచారం పత్రికలో లభిస్తుంది. దీని వల్ల విద్యార్థులు సమకాలీన పరిణామాలపై అవగాహన పొందుతారు.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా  నిలవాలి.  పాఠశాలల్లో ఉదయం అసెంబ్లీ తర్వాత లేదా ప్రత్యేక సమయాన్ని కేటాయించి పత్రిక పఠనం నిర్వహిస్తే  విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, అవగాహన, విమ ర్శనాత్మక ఆలోచన  పెరుగుతాయి. 

మొత్తానికి వార్తా పత్రిక పఠనాన్ని తప్పనిసరి చేయడం విద్యా వ్యవస్థలో ఒక సానుకూల మార్పు. ఇది విద్యార్థులను కేవలం పరీక్షలకే కాకుండా, బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దే  ప్రయత్నంగా భావించవచ్చు. పత్రికా పఠనం మన రాష్ట్రంలోనూ అమలు చేయాల్సిన అవసరం ఉంది.  దీనిపై  తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశిద్దాం.

డా. కోమల్ల ఇంద్రసేనారెడ్డి, లైబ్రేరియన్, కాకతీయ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్