పార్టీ పాతికేళ్ల చరిత్రలో ముందెన్నడూ లేనంతగా బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు సంఘర్షణకు గురవుతున్నారు. పుంజుకోవాల్సిన తరుణంలో తమ నాయకుడి వైఖరి గురించే పార్టీ శ్రేణుల ఆందోళన! మారుతున్నానని ప్రకటించి, మారినట్టే కనిపించి, మార్పు లేకుండా ఉన్న తమనేత కేసీఆర్ పట్టీపట్టని ధోరణి ఇలాగే ఉంటే ఇక పార్టీ పరిస్థితి మారేదెట్లా ? అన్నది వారి మెదళ్లను నిరంతరం తొలుస్తున్న ప్రశ్న. నిన్నటికి నిన్న, ‘కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండేళ్లు గడువిచ్చాం, ఇక ఉపేక్షించేది లేదు, తోలు తీసుడే, తోముడే..’ అని ప్రకటించి, ఒకరోజుకే తమ నేత అసెంబ్లీకి మొహం చాటేసిన తీరు, మళ్లీ ఫామ్‌హౌస్ బాటపట్టిన వైనం బీఆర్‌ఎస్ వారినే అయోమయానికి గురిచేస్తోంది.
అసెంబ్లీ లాబీల్లో ఆంతరంగిక ముచ్చట్లలో ‘ఇది మాకే పాలుపోని పరిస్థితి!’ అన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఒకరి వ్యాఖ్య పార్టీ సగటు మనోస్థితికి పట్టిన అద్దం! తెలంగాణలో రాజకీయ ఎజెండాను ప్రతిపక్షం నిర్దేశించడం లేదు, పాలకపక్ష కాంగ్రెస్ పన్నే రాజకీయ ‘పన్నాగం’లో పడి ప్రతిపక్షం గిలగిలా కొట్టుకుంటోంది. రాష్ట్రంలో విపక్ష సంకటం పాలక పక్షానికి సంబరంగా, జనానికి నిరుత్సాహంగా, ప్రజాస్వామ్యానికి వెలితిగా ఉంది.
ప్రజలకు గట్టిగా గళం వినిపించడానికి అసెంబ్లీని వేదికగా వాడుకోవడంలో విపక్ష బీఆర్‌ఎస్ విఫలమవుతోంది. స్పీకర్ తమకు అవకాశం ఇవ్వట్లేదనే ఒక అంశంపై అప్పటికప్పుడు, అక్కడికక్కడ నిరసన తెలపడం కాకుండా మొత్తం శీతాకాల సమావేశాలనే బహిష్కరించడం వ్యూహపరమైన తప్పిదమనే అభిప్రాయం ఇతరుల్లో కన్నా పార్టీవారిలోనే అధికంగా ఉంది.
పైగా తాము లేవనెత్తిన ‘నదీ జలాల హక్కుల’ అంశం చేపట్టడానికి సర్కారు సిద్ధమైనపుడు, తగు వాదనతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకుగల అవకాశం జారవిడుచుకుందనే భావన వ్యక్తమౌతోంది. సభలో గైర్హాజరు కారణంగా... ‘పదేళ్లు అధికారంలో ఉంటూ ‘నీటి ద్రోహం’ చేసి, చర్చలో దొరికిపోతామనే మొహం చాటేశారు’ అనే పాలకపక్ష విమర్శకు తామే తావిచ్చినట్టయింది.
పట్టుమని పాతిక మంది ఎమ్మెల్యేలకు మించి సంఖ్యాబలం (294మంది సభలో) లేకుండా, ప్రతిపక్ష నాయకుడి హోదా సహితం లేని రోజున కూడా దివంగత నేత పి.జనార్దన్‌రెడ్డి మొక్కవోని దీక్షతో విపక్ష పాత్ర పోషించారు. గట్టి ప్రతిపక్ష పాత్ర నిర్వహించమని ప్రజలు 39 మంది ఎమ్మెల్యేలను (119 మంది సభలో) ఇస్తే, జనం విశ్వాసాన్ని బీఆర్‌ఎస్ నిలబెట్టలేకపోతోంది. జారిపోయిన పదిమంది ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది ‘మేమింకా పార్టీలోనే ఉన్నాం’ అంటున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి! సాంకేతికంగా ఏదైనా చేయడానికి నాయకత్వం శోధిస్తున్నట్టు లేదనే విమర్శ వినిపిస్తోంది. రెండేళ్ల తర్వాత పార్టీ శాసన సభాపక్షానికి ఉప నాయకులను ఎంపికచేసి కూడా వారి సేవల్ని సమర్థంగా వాడుకోలేని పరిస్థితి. ఇక బడ్జెట్ సమావేశాల వరకూ నిరీక్షించాల్సిందే!
అసెంబ్లీయే తగిన వేదిక
కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ఆయన తనయ కవిత కూడా అంటున్నారు. ప్రజా సబంధమున్న ఏ కీలకాంశంపైనైనా తమ వాదనే సరైనదని బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ భవన్‌లోనో, ప్రజాభవన్/ గాంధీ భవన్‌లోనో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చేందుకయితే ఇక అసెంబ్లీ ఎందుకు? ఫామ్‌హౌస్ నుంచి రాజకీయం నడిపేటట్టయితే ప్రతిపక్ష నేత హోదా ఎందుకు? సుదీర్ఘ కాలం తర్వాత కేసీఆర్ మళ్లీ అసెంబ్లీకి వస్తే, ఇక ‘ఆయన మారారు’ అనుకున్నారంతా!
కొద్ది నిమిషాలే సభలో ఉండటం, అసెంబ్లీ రిజిస్టరు తన గదికి తెప్పించుకొని సంతకం చేయడాన్ని ఆయన వ్యూహకర్తలే ఆర్భాటంగా మీడియాకు విడుదల చేయడం, తెల్లారే ఆయన గైర్హాజరవటం వెనుక వారి వ్యూహమేంటో ఎవరికీ బోధపడలేదు. పైగా, విపక్ష నేతగా కేసీఆర్ రెండే మార్లు సభకు వచ్చి ఎంత జీతం (రూ. 57 లక్షలు) తీసుకున్నారు, సెక్యూరిటీకి ఎంత ఖర్చయింది వంటి వివరాలను లోగడ అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి ఆయనను ఘాటుగా విమర్శించారు.
జనాభిప్రాయమే గీటురాయి
ఎన్నికల్లో ప్రజల తీర్పును బట్టే పాలక, ప్రతిపక్షాలు నిర్ణయమవుతాయి. అటుపై అయిదేళ్ల కాలంలో ఎవరి పాత్ర ఎంతమేరకు నిర్వహించారనేదాన్ని బట్టే తదుపరి ఎన్నికల్లో జనాభిప్రాయం వ్యక్తమవుతుంది. నాయకులో, పార్టీలో కేవలం వారి రాజకీయ మనుగడ కోసం పనిచేస్తున్నారని కాకుండా ‘మా కోసం పనిచేస్తున్నారు’ అని ప్రజలు భావించినపుడే మనుగడ! ప్రజాసమస్యలపై పోరాటం ద్వారా, ప్రభుత్వాల తప్పిదాలను ఎండగట్టడం ద్వారా ప్రతిపక్షం ప్రజలకు చేరువవుతుంది.
ఉమ్మడి ఏపీలో పాలక తెలుగుదేశంకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులకు 1999లో (పీసీసీ), 2004లో (సీఎల్పీ) రెండుమార్లూ వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వం వహించారు. కానీ, 1999లో కన్నా 2004లో ప్రజలు ఆయన్ని ఎక్కువగా సొంతం చేసుకున్నారు. ఫలితాల్లో అది ప్రతిబింబించింది. పాతకేళ్ల వైఎస్సార్ రాజకీయ చరిత్ర అంతా అసంతృప్తి, వ్యతిరేక యోచన, అలజడి, ఫ్యాక్షనిజం అని మెజారిటీ మీడియా ఆయనకు ప్రతికూల ప్రచారం నడిపినా.... రెండంశాలు, 2004 ఎన్నికలప్పుడు ప్రజలకాయనను చేరువ చేశాయి.
ఒకటి.. ప్రతి సమస్యలోనూ తన వాగ్ధాటితో ప్రజాపక్షం వహించే విపక్షనేతగా ఆయనను చూపిన అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలు, రెండు.. ప్రజలకు సన్నిహితంగా వెళ్లి ఉమ్మడి రాష్ట్రంలోని ఈ కొస చేవెళ్ల నుంచి ఆ కొస ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర జరిపి ఆయనొక తిరుగులేని నాయకుడయ్యారు. కాంగ్రెస్ పార్టీని దిగ్విజయంగా విజయతీరాలకు నడిపి అధికారంలోకి తెచ్చారు.
ఇవన్నీ కేసీఆర్‌కు తెలియని విషయాలు కావు. కానీ, ‘జీవితాన్ని పణంగా పెట్టి తెలంగాణ సాధించి, వెనుకబడ్డ చిన్న కొత్త రాష్ట్రాన్ని పదేళ్ల పాలనలో దేశంలోనే ముందు వరుసలోకి తెచ్చిన తనకు ప్రత్యర్థులు, ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డి సాటియా?’ అనుకుంటారు. ప్రజాక్షేత్రంలో ఈ వాదనలేవీ నిలిచేవి కావు. ఎప్పటికప్పుడే కొత్త లెక్క! ఇవాళ్టి అవసరాలకు ప్రజలతో ఎవరున్నారన్నదే ప్రధానం.
పొలిటికల్ ఫిలాసఫీ కరువు
‘ఇప్పుడన్నా అంతో ఇంతో రాస్తున్నాం.. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో లోపాల గురించి, ఆ పదేళ్లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాలుగయిదు లైన్లయినా రాయగలిగామా?’ అంటూ ఒక సీనియర్ జర్నలిస్ట్ అసెంబ్లీ లాబీ ముచ్చట్లలో చేసిన ప్రయివేటు వ్యాఖ్య కీలకం. ఈ పరిస్థితిని గరిష్టంగా వాడుకోగలిగే అవకాశం ఉండీ బీఆర్‌ఎస్ విఫలమవుతోంది. స్పష్టమైన పంథా కొరవడుతోంది.
పదేళ్లు అధికారంలో ఉండి, ఏకపక్షంగా వ్యవహరించిన వారికి కొన్ని విషయాల్లో ‘నోరెత్తి విమర్శ చేయలేని బ్యాగేజీ’ ఒకటుంటుంది. ఏం విమర్శించబోయినా ‘ఇది మీ నిర్వాక ఫలితమే!’ అనే ప్రతివిమర్శకు ఆస్కారముంటుంది. కాంగ్రెస్ ఎన్నికల హామీల వైఫల్యాల్నో, ప్రజా సమస్యలనో ఎండగట్టి ప్రజాపక్షం వహించవచ్చు.
ఏదైనా ప్రజాసమస్య తీసుకొని, రాష్ట్రవ్యాప్త ఆందోళనతో ప్రభుత్వం దిగివచ్చేలా కట్టడి చేసిన ఒక్క అంశం కూడా ఈ రెండేళ్లలో లేకపోవడం లోపమే! పైన సరైన నాయకత్వం లేదని, ద్వితీయ స్థాయిలో అనారోగ్యకర స్పర్థ, నిత్యం దుమ్మెత్తిపోసే సొంత కూతురి గొంతు నియంత్రించలేనితనం... ఇలాంటి విషయాల్లోనూ పార్టీ శ్రేణులకు అసంతృప్తి ఉంది. ఇటీవలి పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ ప్రకటించిన ‘కార్యాచరణ’ ఏమిటో ఇంకా వెలువడలేదు. అధినేత ఆలోచన నుంచి ఆచరణ దాకా మార్పు కోసం బీఆర్‌ఎస్ శ్రేణులు నిరీక్షిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌కు బలమైనా, బలహీనతైనా కేసీఆర్‌యే కనుక ఆయనే రాజకీయ మనుగడను శాసిస్తాడని వారి నమ్మకం!
ప్రతిపక్ష పాత్రపై నిర్లక్ష్యం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంలో కేసీఆర్ నిర్వహించిన భూమిక గొప్పదనడంలో ఎవరికీ రెండో అభిప్రాయం ఉండదు. అదే సమయంలో, ప్రతిపక్ష నాయకుడి పాత్రను సంవత్సరాల తరబడి నిర్లక్ష్యం చేయడాన్నీ జనమెవరూ ఉపేక్షించరు. దివంగత నేత పి.శివశంకర్.. ఒకమారు గాంధీభవన్ ప్రకాశం హాల్లో సభికులను ఉద్దేశించి మాట్లాడుతూ విపక్షం కర్తవ్యమేంటో వివరించారు.
‘సర్కారును విమర్శిస్తున్నామని, కుట్ర పన్నుతున్నామని మమ్మల్ని తప్పుబడతారేంటి? అసలు ప్రతిపక్షం చేయాల్సిందేంటి? మూడే పనులు... వ్యతిరేకించడం, ఎండగట్టడం, దించేయడం అని వివరించారు. విపక్షంగా బీఆర్‌ఎస్ నిర్వహిస్తున్న పాత్ర ఏంటో తమ నాయకత్వం గుండెల మీద చేయివేసుకొని సమీక్షించుకోవాలని పార్టీ వర్గీయులే సణుగుతున్నారు. కొవిడ్ కాలంలో ఐటీ ఉద్యోగుల్లాగ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటేనో, వర్క్ ఫ్రమ్ విల్లా అంటేనో, వర్క్ ఫ్రమ్ ఫామ్‌హౌస్ అంటేనో రాజకీయాల్లో చెల్లదు. రాజకీయ పక్షాలు నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండాలి. గట్టిగా తమ గొంతు వినిపించాలి.
దిలీప్ రెడ్డి, పొలిటికల్ ఎనలిస్ట్, డైరెక్టర్, పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ
