
- 350కి పైగా మూగజీవాల మృత్యువాత
- అమరవాదిలో ఒకేరోజు 14 గేదెలు మృతి
- నెన్నెల మండలంలో మరో మూడు గేదెలు
- వానాకాలంలో పొంచిఉన్న ప్రమాదాలు
- లైన్లు సరిచేయడంలో అధికారులు విఫలం
మంచిర్యాల, వెలుగు: జిల్లాలో కరెంట్షాక్ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇండ్లలో, పొలాల్లో, ఇతర పని ప్రదేశాల్లో షాక్‌తగిలి మృత్యువాతపడుతున్నారు. కూలర్లు, మొబైల్ చార్జింగ్, బోర్మోటార్లు, కరెంట్వైర్లతో కట్టిన దండేల వల్ల ఎక్కువగా చనిపోతున్నారు. పొలాల్లోని మోటార్లు రిపేర్లు చేస్తూ, ట్రాన్స్ఫార్మర్ల దగ్గర షాక్‌తగిలి రైతులు మరణిస్తున్నారు. చిన్న ఏమరపాటు కారణంగా నిండుప్రాణాలు క్షణాల్లో గాలిలో కలిసిపోతున్నాయి. ఏడాది కాలంగా జిల్లావ్యాప్తంగా 24 మంది చనిపోగా, నాలుగు సంవత్సరాల్లో 140 మంది కరెంట్కాటుకు బలయ్యారు.
ఏమరపాటుతో ప్రాణాలు బలి
ఇటీవల కాసిపేట మండలం దేవాపూర్అంగడి బజార్‌కు చెందిన ఎలక్ట్రీషియన్మన్నె శాంసన్ప్రశాంత్కుమార్(40) కరెంట్‌షాక్‌తో చనిపోయాడు. ఇంటి ఆవరణలోని బావి వద్ద కరెంట్మోటార్ స్విచ్ఆన్ చేయగా.. నీళ్లు రాకపోవడంతో మోటార్‌కు ఉన్న జే వైరును కదిలించాడు. దానికి కరెంట్సప్లై జరిగి షాక్ రావడంతో స్పాట్లోనే మృతిచెందాడు. రెండేండ్ల క్రితం చెన్నూర్టౌన్లోని లైన్గడ్డకు చెంది బొల్లంపల్లి శ్రీనివాస్–శశిదేవి దంపతులు ఇదే రీతిలో కరెంట్‌షాక్‌తో ప్రాణాలు కోల్పోయారు. శశిదేవి ఉదయం బోర్ వేసి పైపుతో నీళ్లు పడుతూ ఇల్లు శుభ్రం చేసింది. బయట ఇనుప తీగతో కట్టి ఉన్న దండెంపై బట్టలు ఆరేయబోయింది. ఆ దండేనికి కరెంట్వైర్తగిలి ఉండటంతో షాక్ కొట్టి పడిపోయింది. భార్యను కాపాడాలనే తపనతో భర్త శ్రీనివాస్ ఆమె చేయి విడిపించేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడికి కూడా షాక్ కొట్టి కుప్పకూలిపోయాడు.
పొలాల్లో పశువులకు ముప్పు
ఈ నెల 18న మందమర్రి మండలం అమరవాది గ్రామంలో14 బర్రెలు కరెంట్‌షాక్‌తో చనిపోయాయి. కూరగాయల తోటను జంతువుల నుంచి కాపాడుకునేందుకు ఓ రైతు కరెంట్ తీగలు అమర్చగా అవి పక్కనున్న చెరువులో పడ్డాయి. మేతకు వెళ్లిన బర్రెలు చెరువులో దిగడంతో షాక్‌తగిలి చనిపోయాయి. వాటిల్లో పాలిచ్చేవి కూడా ఉన్నాయి. తమ కుటుంబాలకు ఆసరాగా ఉన్న గేదెలు చనిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఈ నెల 25న నెన్నెల మండలం నార్వాయిపేట శివారులోని పొలాల్లో కరెంట్‌షాక్‌తో మూడు బర్రెలు మృతి చెందాయి. శనివారం రాత్రి కురిసిన గాలివానకు గుండ్లసోమారానికి వెళ్లే 11కేవీ వైర్లు తెగిపోయాయి.
ఆదివారం ఉదయం మేత కోసం వెళ్లిన బర్రెలు వైర్లకు తాకి చనిపోయాయి. అదే రోజు చెన్నూర్మండలం ముత్తారావుపల్లి శివారులోని పొలంలో మేత మేస్తున్న ఎద్దు ట్రాన్స్ఫార్మర్ ఎర్త్వైరుకు తగిలి చనిపోయింది. పొరుగునున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం బ్రాహ్మణపల్లిలో ఇటీవల దుక్కిటెడ్లు మృత్యువాతపడ్డాయి. మేతకోసం పొలాల్లోకి వెళ్లిన సమయంలో గాలిదుమారానికి కరెంట్‌వైర్లు తెగిపడగా వాటికి తాకి ఒకేసారి ఎనిమిది ఎడ్లు ప్రాణాలు విడిచాయి.
లైన్లు సరిచేయడంలో నిర్లక్ష్యం
పొలాల్లో వేలాడుతూ, ప్రమాదకరంగా మారిన లైన్లను సరిచేయడంలో విద్యుత్‌శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఏటా వర్షాకాలంలో గాలివానకు వైర్లు తెగిపోవడం, పోల్స్, ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఏర్పాటు చేసిన సపోర్ట్, ఎర్త్ వైర్లకు కరెంట్సప్లై కావడం వంటి ఘటనలతో మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. వర్షాకాలం ప్రారంభానికి ముందు పొలాల్లో ప్రమాదకరంగా ఉన్న లైన్లను గుర్తించి రిపేర్లు చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. వర్షాకాలంలో కరెంట్ షాక్ బారిపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నారు.
జిల్లాలో కరెంట్ షాక్‌తో చనిపోయిన మనుషులు, పశువుల వివరాలు
సంవత్సరం మనుషులు జంతువులు
2020–21 40 86
2021–22 28 56
2022–23 27 69
2023–24 21 61
2024–25 24 47
మొత్తం 140 319