
ఆదిలాబాద్టౌన్, వెలుగు: ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం ఉద్యోగులు, కార్మికులు, దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్చేస్తూ సోమవారం ఆదిలాబాద్ జిల్లాలో ఆందోళనలు చేపట్టారు. ఏఎన్ఎంలను ఎన్సీడీ ఆన్లైన్ ప్రోగాంలో నుంచి తొలగించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు.
తమకు ఆన్లైన్ నమోదుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. దివ్యాంగులు, వృద్ధులకు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ డబ్బులు పెంచాలని డిమాండ్చేస్తూ ఎమ్మార్పీఎస్ఆధ్వర్యంలో దివ్యాంగులు జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల ముందు ధర్నా చేశారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్, ఉపాధ్యక్షుడు స్వామి, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు, దివ్యాంగులు పాల్గొన్నారు.