ENG vs SA: డిఫెండింగ్ ఛాంపియన్స్ కథ ముగిసినట్లే.. చిత్తుచిత్తుగా ఓడిన ఇంగ్లాండ్

ENG vs SA: డిఫెండింగ్ ఛాంపియన్స్ కథ ముగిసినట్లే.. చిత్తుచిత్తుగా ఓడిన ఇంగ్లాండ్

డిఫెండింగ్ ఛాంపియన్స్ మేము.. ఈసారి టైటిల్ మాదే అంటూ 2023 ప్రపంచ కప్‌లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్ కథ ఈ టోర్నీలో ముగిసినట్లే కనిపిస్తోంది. శనివారం వాంఖెడే వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 229 పరుగుల భారీ తేడాతో చిత్తుచిత్తుగా ఓడింది. ఈ టోర్నీలో ఇంగ్లీష్ జట్టుకు ఇది మూడో ఓటమి. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట ఓడింది.

క్లాసెన్‌ ఊచకోత

మొదట హెండ్రిక్స్ క్లాసిక్ ఇన్నింగ్స్‌కు క్లాసెన్‌ ఊచకోత తోడవ్వడంతో సఫారీ జట్టు.. ఇంగ్లండ్ ముందు 400 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. హెన్రిచ్‌ క్లాసెన్‌ (109; 67 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరవిహారం చేయగా.. రీజా హెండ్రిక్స్‌ (85), రస్సీ వాన్‌ డెర్‌ డసెన్‌ (60) మంచి ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో మార్కో జాన్సెన్‌ (42 బంతుల్లో 75 నాటౌట్‌, 3 ఫోర్లు, 6 సిక్సర్లు) కూడా చెలరేగడంతో సౌతాఫ్రికా నిర్ణీత  50 ఓవర్లలో399 పరుగుల భారీ స్కోరు చేసింది.

ఔట్ అవ్వడానికి పోటీపడ్డారు

అనంతరం 400 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 170 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 22 ఓవర్లలోనే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. టార్గెట్ చేధించలేమని ముందే ఫిక్సయ్యారో ఏమో కానీ, ఇంగ్లాండ్ బ్యాటర్లు పోటీపడుతూ పెవిలియన్ చేరిపోయారు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో 43 పరుగులు చేసిన మార్క్ వుడ్ టాప్ స్కోరర్. జానీ బెయిర్‌ (10), డేవిడ్ మలాన్(6), జో రూట్(2), బెన్ స్టోక్స్(5), హ్యారీ బ్రూక్(17), జోస్ బట్లర్(15) పరుగులు చేశారు. ప్రొటీస్ బౌలర్లలో గెరాల్డ్ కోయెట్జీ 3 వికెట్లు పడకొట్టగా..  లుంగి ఎన్గిడి 2, మార్కో జాన్సెన్ 2, కగిసో రబడ 1,కేశవ్ మహారాజ్ 1 వికెట్ తీసుకున్నారు.

9వ స్థానంలో ఇంగ్లాండ్

ఈ విజయంతో దక్షణఫ్రికా జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకగా.. ఇంగ్లాండ్ జట్టు 9వ స్థానానికి పడిపోయింది. న్యూజిలాండ్, ఇండియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తొలి  నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఈ టోర్నీలో ఇంగ్లాండ్ జట్టు ఇంకా ఐదు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. అన్నింటా విజయం సాధించినా మిగిలిన జట్ల సమీకరణాలపై ఆధాపడాల్సిందే.