వైభవంగా బతుకమ్మ సంబురాలు షురూ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ఆడిపాడిన ఆడపడుచులు

వైభవంగా బతుకమ్మ సంబురాలు షురూ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ఆడిపాడిన ఆడపడుచులు

ఎంగిలిపూల బతుకమ్మతో పూల పండుగ సంబురాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆడపడచులు బతుకమ్మను తీరొక్క పూలతో పేర్చి, అందులో గౌరమ్మను చేర్చి ఊరూరా ఆలయాలు, చెరువులు, కుంటల సమీపంలో ఒక చోట చేరి ఒక్కేసి పువ్వేసి చందమామా అంటూ ఆడిపాడారు. ‘చిన్ని మా బతుకమ్మ.. చిన్నారక్క బతుకమ్మ, కోలో కోలో కోల్.. చుక్కపొద్దున లేచి కోల్.. వీ6  బతుకమ్మ పాటలు, డీజే సౌండ్స్ తో ఊరూవాడ హోరెత్తింది. 

కరీంనగర్ మహాశక్తి ఆలయంలో నిర్వహించిన వేడుకలకు భారీగా మహిళలు, చిన్నారులు, యువతులు తరలివచ్చారు. కరీంనగర్ లో గోకుల్ నగర్ లో తెలంగాణ సంప్రదాయ చీర కట్టుతో  మహిళలు బతుకమ్మ ఆడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేములవాడ రాజన్న ఆలయంలో మహిళలు బతుకమ్మలతో ఆడిపాడారు. అనంతరం ఆలయ ధర్మగుండంలో నిమజ్జనం చేశారు. సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాకేంద్రాలతోపాటు మండలకేంద్రాల్లోనూ బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి.     - నెట్‌‌‌‌వర్క్‌‌‌‌, వెలుగు