
న్యూయార్క్: ప్రస్తుతం టెన్నిస్ ప్రపంచాన్ని ఏలుతున్న యువ కెరటాలు యానిక్ సినర్, కార్లోస్ అల్కరాజ్ మధ్య మరో సమరానికి రంగం సిద్ధమైంది. ఈ సీజన్ టెన్నిస్ క్యాలెండర్‌లో ఆఖరి గ్రాండ్‌స్లామ్ అయిన యూఎస్ ఓపెన్ చాంపియన్‌షిప్ ఆదివారం (ఆగస్టు 24) మొదలవనుంది. డిఫెండింగ్ చాంపియన్ వరల్డ్ నంబర్ వన్ సినర్.. రెండో ర్యాంకర్ అల్కరాజ్ మధ్య మరో ఫైనల్ ఖాయమని అందరూ భావిస్తున్న తరుణంలో ఈ కుర్రాళ్ల ఆధిపత్యానికి గండి కొట్టేందుకు నొవాక్ జొకోవిచ్ వంటి లెజెండ్స్, మరికొందరు మేటి ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు.
చివరి ఏడు గ్రాండ్‌స్లామ్స్ గెలుచుకొని ఇటలీ స్టార్ సినర్, స్పెయిన్ సెన్సేషన్ అల్కరాజ్ టెన్నిస్‌లో ఒక కొత్త శకానికి నాంది పలికారు. వీరిద్దరూ ఆడిన గత నాలుగు టోర్నీల్లో ఫైనల్లోనే ఢీ కొట్టడం వాళ్ల ఆధిపత్యానికి నిదర్శనం. గతంలో రఫెల్ నడాల్–రోజర్ ఫెడరర్ (ఫెడాల్) మాదిరిగా ఇప్పుడు సినర్–అల్కరాజ్ (సిన్కరాజ్) హవా నడుస్తోంది. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఐదున్నర గంటల హోరాహోరీ తుది పోరులో అల్కరాజ్ అద్భుత విజయం అందుకుంటే.. గత నెల వింబుల్డన్ టైటిల్ ఫైట్‌లో గెలిచి సినర్ ప్రతీకారం తీర్చుకున్నాడు.
గత వారం గాయం కారణంగా సిన్సినాటి ఫైనల్ నుంచి సినర్ తప్పుకోవడంతో అల్కరాజ్ టైటిల్ గెలిచినా.. యూఎస్ ఓపెన్‌లో అసలైన పోరుకు ఇద్దరూ సిద్ధంగా ఉన్నారు. ఈ టోర్నీలో టాప్–2 సీడెడ్ పోరు టైటిల్‌కే పరిమితం కాలేదు. వరల్డ్ నంబర్ వన్ కిరీటం కోసం కూడా వార్ జరగనుంది. ఈ టోర్నీలో ఎవరు ఎక్కువ దూరం వెళ్తే వాళ్లకే టాప్ ర్యాంక్ లభించనుంది. సినర్ తన టైటిల్‌తో పాటు నం.1 ర్యాంక్‌ను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాడు. 2022లో ఇక్కడ టైటిల్ నెగ్గిన అల్కరాజ్ గత ఎడిషన్‌లో మాత్రం రెండో రౌండ్‌లోనే వెనుదిరిగాడు. ఈసారి రెండో టైటిల్ నెగ్గడంతో పాటు సినర్ నుంచి టాప్ ప్లేస్‌ను లాక్కోవాలని చూస్తున్నాడు. టాప్ సీడ్ సినర్ తొలి రౌండ్‌లో చెక్ రిపబ్లిక్ ప్లేయర్ విట్ కొప్రివాతో తలపడనుండగా.. అల్కరాజ్.. అలెజాండ్రో టాబిలో (చిలీ)తో తన పోరు ఆరంభించనున్నాడు.
నొవాక్ పుంజుకునేనా?
‘సిన్కరాజ్’ హవాకు ముందు టెన్నిస్‌ను ఊపేసిన సెర్బియా లెజెండ్ నొవాక్ జొకోవిచ్ కొంతకాలంగా డీలా పడ్డాడు. ప్రతీ గ్రాండ్‌స్లామ్‌లో టైటిల్ ఫేవరట్లలో ఒకడిగా వస్తున్నప్పటికీ తన 25వ మేజర్ టైటిల్ వేటలో తడబడుతూనే ఉన్నాడు. కీలక దశల్లో ఓడిపోతున్నాడు. ఈ ఏడాది మూడుసార్లు సెమీస్‌లోనే ఇంటిదారి పట్టాడు. రెండుసార్లు సినర్ చేతిలో ఓడిన అతను ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జ్వెరెవ్‌తో సెమీస్‌లో గాయంతో వైదొలిగాడు. అయినా జొకోను తక్కువ అంచనా వేయలేం.
గతంలో నాలుగుసార్లు ఇక్కడ టైటిల్ నెగ్గిన అతను ఐదోసారి యూఎస్ ఓపెన్ చాంపియన్ అవ్వడంతో పాటు తన పనైపోలేదని నిరూపించుకోవాలని చూస్తున్నాడు. పైగా, టొరాంటో, సిన్సినాటి ఓపెన్‌లకు దూరంగా ఉండి ఈ మెగా టోర్నీపైనే ఫోకస్ పెట్టాడు. సినర్, అల్కరాజ్‌కు గట్టి పోటీ ఇచ్చే సత్తా ఉన్న నొవాక్.. తొలి రౌండ్‌లో అమెరికన్ లెర్నర్ టియన్‌తో పోటీ పడనున్నాడు. ఏడో సీడ్ జొకో.. డ్రా ప్రకారం క్వార్టర్ ఫైనల్లో టేలర్ ఫ్రిట్జ్‌తో, సెమీఫైనల్‌లో అల్కరాజ్‌తో తలపడే అవకాశం ఉంది.
ఇక, జర్మనీకి చెందిన మూడో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ తొలి గ్రాండ్ స్లామ్ వేటలో ఉన్నాడు. ఇది వరకు మూడుసార్లు గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరినా టైటిల్ నెగ్గని అతను ఈసారి మంచి ఫామ్‌లో ఉన్నాడు. టొరాంటో, సిన్సినాటి టోర్నీలలో సెమీస్ వరకు చేరి జోష్‌లో కనిపిస్తున్నాడు. బ్రిటన్ ప్లేయర్, వరల్డ్ నంబర్.5 డ్రేపర్ కూడా బలమైన పోటీదారుడు. గతేడాది ఇక్కడ సెమీస్ వరకూ వచ్చాడు. అయితే, గాయం నుంచి కోలుకుని వస్తున్నందున అతని ఫామ్ ఎలా ఉంటుందో చూడాలి. సొంతగడ్డపై టోర్నీలో పలువురు అమెరికన్లు కూడా సత్తా చాటాలని చూస్తున్నారు. గతేడాది రన్నరప్‌గా నిలిచిన టేలర్ ఫ్రిట్జ్ ఫేవరెట్లలో ఒకడిగా బరిలో నిలిచాడు. అతనితోపాటు బెన్ షెల్టన్ పై అమెరికన్ల నుంచి అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.
సబలెంకాకు స్వైటెక్ సవాల్
విమెన్స్ సింగిల్స్‌లోనూ స్టార్ ప్లేయర్ల మధ్య పోటీ ఫ్యాన్స్‌ను అలరించనుంది. డిఫెండింగ్ చాంపియన్, అరీనా సబలెంకా (బెలారస్) తన టైటిల్‌ను కాపాడుకోలని చూస్తుండగా.. సూపర్ ఫామ్‌లో ఉన్న ఇగా స్వైటెక్ (పోలాండ్) నుంచి ఆమెకు గట్టి పోటీ ఎదురుకానుంది. గత వారం సిన్సినాటి ఓపెన్ గెలిచిన ఆత్మవిశ్వాసంతో స్వైటెక్ బరిలోకి దిగుతోంది. ఆమెకు డ్రా చాలా అనుకూలంగా కనిపిస్తోంది. తొలి వారంలో పెద్ద సవాళ్లు లేకపోవడంతో ఫైనల్ వరకు ఆమె ప్రయాణం సాఫీగా సాగే అవకాశం ఉంది. టాప్ సీడ్ సబలెంకా తొలి రౌండ్‌లో స్విస్ ప్లేయర్ మసరోవాను ఎదుర్కోనుండగా.. రెండో సీడ్ స్వైటెక్.. ఎమిలియానా (కొలంబియా)తో పోరు ఆరంభించనుంది.
ఈ ఇద్దరికీ అమెరికా యంగ్ స్టర్ కోకో గాఫ్ నుంచి ముప్పు ఉంది. కొత్త కోచ్, కొత్త ఆశలతో బరిలోకి దిగుతున్న గాఫ్ తన మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం ప్రయత్నిస్తోంది. అయితే, తను తొలి రౌండ్ నుంచే గట్టి ప్రత్యర్థులతో తలపడాల్సి వస్తుంది. నాలుగో రౌండ్‌లో డారియా కసత్కినా, క్వార్టర్స్‌లో మాడిసన్ కీస్ వంటి ప్లేయర్లతో ముప్పు ఉంది. గత ఏడాది ఫైనలిస్ట్ అయిన జెస్సికా పెగులాపై లోకల్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నా.. ప్రస్తుతం తను ఫామ్ కోసం ఇబ్బంది పడుతోంది.
2021 విన్నర్, బ్రిటన్ స్టార్ ఎమ్మా రదుకాను మరోసారి మాయ చేయాలని చూస్తోంది. వింబుల్డన్ ఫైనలిస్ట్ అమందా అనిసిమోవా, 2024 సెమీ ఫైనలిస్ట్ ఎమ్మా నవారో వంటి అమెరికన్లు కూడా టైటిల్‌పై ఆశలు పెట్టుకోగా.. రెండేండ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో రీఎంట్రీ ఇచ్చిన యూఎస్ వెటరన్ వీనస్ విలియమ్స్ కూడా బరిలో ఉంది.