నిజామాబాద్ రూరల్, వెలుగు : నిజామాబాద్ నగర శివారులో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి దందా నిర్వహిస్తున్న ముఠాను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. గురువారం విలేకరులకు ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా నేరిడుగొండ మండలానికి చెందిన పూజాపవార్, కుప్పి గ్రామానికి చెందిన బాయ్ జాదవ్ అనే ఇద్దరు మహిళలు మధ్యప్రదేశ్లోని సిర్పూర్ పట్టణంలో ఎండు గంజాయి కొనుగోలు చేసి నిర్మల్ పట్టణానికి తరలించారు.
గురువారం నిర్మల్ పట్టణం నుంచి బస్సులో నిజామాబాద్ కు వచ్చి పది కిలోల ఎండు గంజాయిని బస్టాండ్ సమీపంలోని రిలయన్స్మార్టు వద్ద ముగ్గురు వ్యక్తులకు అమ్ముతుండగా ఎక్సైజ్ సీఐ స్వప్న తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. సదరు మహిళలు మధ్యప్రదేశ్లో రూ.15వేలకు కిలో గంజాయిని కొనుగోలు చేసి పట్టణంలో రూ.20వేలకు అమ్ముతున్నారని తెలిపారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలతో పాటు కొనుగోలు చేస్తున్న కిషన్, ఇంద్రజిత్, వెంకట్రామ్లను అదుపులోకి తీసుకున్నామని మల్లారెడ్డి వివరించారు.
నిర్మల్ లో ఎండు గాంజా పట్టివేత
బాల్కొండ : మండలంలోని చిట్టాపూర్ లో గాంజా సిగరెట్ తాగుతున్న ఓ వ్యక్తిని పట్టుకుని పోలీసులు కూపీ లాగి ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎస్సై శైలేందర్ వివరాల ప్రకారం.. చిట్టాపూర్ లో గాంజా సిగరేట్ తాగిన ఓ వ్యక్తిని విచారించగా అదే గ్రామానికి చెందిన దాసరి ఉదయ్ నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం మోహల్లా గ్రామానికి చెందిన బుజిగే లాలప్ప వద్ద కొనుగోలు చేసినట్టు ఒప్పుకున్నాడు.
ఉన్నతాధికారుల ఆదేశాలతో లాలప్ప ఇంటికి వెళ్లి తనిఖీలు చేయగా 584 గ్రాముల ఎండు గంజాయి, పెరట్లో ఓ గంజాయి మొక్కను గుర్తించారు. వాటిని సీజ్ చేసి, ఇద్దరిని రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై చెప్పారు.
