
- కరీంనగర్ జిల్లాలో రోజూ సెలవులో 400 నుంచి 450 మంది టీచర్లు
- మరో 400 మంది వరకు ఆబ్సెంట్
- యాప్‌లో ఎర్రర్స్‌తో ఆబ్సెంట్స్‌గా చూపిస్తున్నట్లు చెప్తున్న టీచర్లు
- ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం అమల్లోకి వచ్చి నెల రోజులు
- 9 నెలల కింద పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన పెద్దపల్లి జిల్లాలోనూ 80 శాతం దాటని అటెండెన్స్
కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గవర్నమెంట్ స్కూళ్లలో టీచర్ల అటెండెన్స్ అంతంత మాత్రంగానే నమోదవుతోంది. సర్కార్ బడుల్లో పని చేసే టీచర్లు అనధికారికంగా డుమ్మా కొట్టకుండా, స్కూల్ కు ఆలస్యంగా రాకుండ చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని సర్కార్ బడుల్లో ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం ద్వారా స్మార్ట్ ఫోన్లలో అటెండెన్స్‌ను ఆగస్టు 1 నుంచి అమలుచేస్తోంది. జిల్లా కేంద్రాలు, సమీపంలోని పట్టణాల నుంచి స్కూళ్లకు ఆలస్యంగా రావడం, కొందరైతే తమకు బదులు విద్యా వాలంటీర్లను పెట్టడం, మరికొందరు ముందు లీవ్ లెటర్ ఇచ్చి.. ఆ తర్వాత వచ్చాక రిజిష్టర్లలో సంతకం చేసి లెటర్ వాపస్ తీసుకోవడంలాంటి చర్యలకు పాల్పడుతున్నారు.
అందుకే ఇలాంటి పనులకు తావు లేకుండా ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టంను నిరుడు డిసెంబర్‌లో రాష్ట్రంలోనే తొలిసారిగా పెద్దపల్లి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఆగస్టు 1 నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎఫ్ఆర్ఎస్ ను అమలు చేస్తుండగా.. సగటు అటెండెన్స్ చూస్తే 75 శాతం మించడం లేదు.
సెలవుల్లో ఎక్కువ మంది..
కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ ప్రైమరీ, హైస్కూళ్లు కలిపి మొత్తం 631 స్కూళ్లు ఉండగా వాటిలో 3,720 మంది టీచర్లు ఉన్నారు. వీరిలో 3,698 మంది టీచర్లు రిజిష్టర్ చేసుకోగా.. ఈ నెల 29న 2,803 మంది హాజరవ్వగా.. 444 మంది గైర్హాజరయ్యారు. యాప్‌లో ఎర్రర్, సరిగ్గా అటెండెన్స్ నమోదు చేయలేని వారికి ఆబ్సెంట్ అని వస్తోందని టీచర్లు చెప్తున్నారు. మరో 451 మంది లీవ్ తీసుకున్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. జిల్లాలోని అటెండెన్స్ పర్సంటేజీ 75.8 శాతంగా నమోదైంది. జగిత్యాల జిల్లాలో మొత్తం 4,419 మంది టీచర్లు ఉండగా.. 4,407 మంది టీచర్లు రిజిష్టర్ అయ్యారు.
వీరిలో సోమవారం 3,165 మంది(72 శాతం) మంది మాత్రమే హాజరవ్వగా.. మిగతా 1,242 మంది(28 శాతం) ఆబ్సెంట్ అవ్వడమో, లీవ్ పెట్టడమో చేశారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని 484 స్కూళ్లలో 2,589 మంది టీచర్లు ఉండగా, 2,548 మంది టీచర్లు రిజిష్టర్ చేసుకున్నారు. రోజూ 75 శాతం మాత్రమే అటెండెన్స్ నమోదవుతోంది. 15 శాతం మంది టీచర్లు లీవ్ లో ఉంటుండగా, 10 శాతం మంది టీచర్లు టెక్నికల్ ప్రాబ్లం వల్ల అటెండెన్స్
వేసుకోలేకపోతున్నట్లు తెలిసింది.
గాడినపడని పైలట్ జిల్లా
పైలట్ జిల్లాగా ఉన్న పెద్దపల్లిలో 531 ప్రభుత్వ స్కూళ్లలో 530 స్కూళ్లు ఎఫ్ఆర్ఎస్ లో రిజిష్టర్ అయ్యాయి. ఇందులో మొత్తం 2,711 మంది టీచర్లు ఉండగా, 2,696 మంది డీఎస్ఈ ఎఫ్ఆర్‌ఎస్ యాప్ లో రిజిష్టర్ అయ్యారు. వీరిలో ఆగస్టు 30న 2,163 మంది(79 శాతం) హాజరైతే 179 మంది ఆబ్సెంట్ కాగా 354 మంది లీవ్ తీసుకున్నారు. ఆగస్టులో సగటున అటెండెన్స్ పర్సంటేజీ 79గా నమోదైంది. ఆగస్టు 1న 69.7 శాతం అటెండెన్స్ నమోదైతే గరిష్టంగా ఆగస్టు 7న 85 శాతం మంది అటెండ్ అయ్యారు.
అంటే రోజూ 20 శాతం మంది టీచర్లు సెలవు పెట్టడమో, లేదా ఆబ్సెంట్ అవ్వడమో చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో స్కూల్‌కు ఆలస్యంగా వచ్చిన కొందరు టీచర్లు కూడా ఆ రోజు యాప్ పని చేయలేదనే అటెండెన్స్ నుంచి తప్పించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇందులో అప్పుడప్పుడు సర్వర్, జీపీఎస్ ఎర్రర్స్, నెట్ వర్క్ సమస్యలు తలెత్తుతున్నట్లు ఆఫీసర్లు చెప్తున్నారు.