మన యాప్‌లకు వెల్‌కమ్‌

మన యాప్‌లకు వెల్‌కమ్‌

న్యూఢిల్లీ: సోషల్ మీడియా ప్రపంచాన్ని ఏలుతున్న ఫేస్‌‌‌‌బుక్ తన 17 సంవత్సరాల చరిత్రలో మొదటిసారిగా డెయిలీ కస్టమర్లను భారీగా కోల్పోయినట్టు ఈ నెల 2 న ప్రకటించింది.- 2021 చివరి మూడు నెలల్లో దాదాపు ఐదు లక్షల మంది యూజర్లు తగ్గారు. దీంతో  లాగిన్ల సంఖ్య 1.93 బిలియన్లకు పడిపోయింది. ఫలితంగా ఫేస్‌‌బుక్ షేర్ల విలువ కూడా తగ్గింది. ఇప్పుడు యూజర్లు.. ముఖ్యంగా ఇండియన్ యువత ఫారిన్ సోషల్ మీడియా కంటే లోకల్ సోషల్ మీడియా యాప్స్‌‌ను ఉపయోగించడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే లోకలైజేషన్ ఎక్కువగా ఉండటం, ప్రైవసీకి గ్యారంటీ ఇస్తుండటం, కమ్యూనిటీ సర్వీసులను అందుబాటులోకి తేవడం వంటివి ముఖ్యమైన కారణాలు. అందుకే ఫేస్‌‌బుక్, ట్విటర్, ఇన్‌‌స్టాగ్రామ్ వంటి అమెరికా టెక్ కంపెనీలు కొత్త యూజర్లను సంపాదించడానికి తిప్పలు పడుతున్నాయి.   భారతీయ స్టార్టప్‌‌లు ఈ మార్కెట్‌‌ను పట్టుకోవడంలో చాలా వరకు విజయం సాధిస్తున్నాయి. ఇది వరకే చాలా అమెరికా కంపెనీల యాప్‌‌లు మూతబడ్డాయి.  

మన ఇష్టాలకు తగ్గట్టు..

2000లలో ఆర్కుట్ హవా నడిచింది. ఆ తర్వాత ఫేస్‌‌బుక్ వచ్చింది. ఇప్పుడు, లోకల్‌  సోషల్ నెట్‌‌వర్క్‌‌ ప్లాట్‌‌ఫామ్‌‌లు యంగ్ యూజర్లను ఆకర్షిస్తున్నాయి.  ఇలాంటి వాటిలో యుబెల్ ఒకటి. ఇది యువత కోసం సోషల్ నెట్‌‌వర్క్ ప్లాట్‌‌ఫామ్‌‌ను డెవెలప్ చేసింది. గేమర్స్ కోసం క్లాన్ రెడీగా ఉంది. ఆటలంటే ఇష్టమున్న వారికోసం ఈ–స్పోర్ట్స్  ముందుకు వచ్చింది. మ్యూజిక్ కోసం స్వెల్ లెహర్ ప్లాట్‌‌ఫామ్‌‌ రెడీగా ఉంది. భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న అనేక సోషల్ నెట్‌‌వర్క్‌‌ యాప్‌లలో ఇవి కొన్ని మాత్రమే. భారీ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌లు, టెక్నాలజీలతో నడుస్తున్న మల్టీ నేషనల్ కంపెనీలకు ఇవి సవాల్ విసురుతున్నాయి. తాము సిలికాన్ వ్యాలీలోని ఒక  డిజిటల్ కాలనీ నివాసుల వంటి వాళ్లమని, యువతను, టెక్నాలజీల్లో మార్పులను ఒడిసిపట్టుకుంటే పోటీలో ముందు ఉండవచ్చని  లెహెర్  చీఫ్ ఎగ్జిక్యూటివ్ వికాస్ మల్పాని అన్నారు. తాము ఇచ్చే కంటెంట్‌‌ను అవి ఇవ్వలేవని స్పష్టం చేశారు. లెహెర్‌‌‌‌లో ఓరియోస్ వెంచర్‌‌‌‌కు కూడా వాటాలు ఉన్నాయి. లెహెర్ వంటి ప్లాట్‌‌ఫామ్‌‌లు మొగ్గదశలోనే ఉన్నాయని, ఇవి ఫేస్‌‌బుక్, ట్విటర్ స్థాయికి చేరుకోవడానికి చాలా సమయం పడుతుందని ఈ రంగంలోని ఎక్స్‌‌పర్టులు చెబుతున్నారు. అయితే ఇవి కచ్చితంగా సత్తా చూపించగలుతాయని అంటున్నారు. 

వీటికి ఆదరణ ఎందుకంటే...

“సోషల్ మీడియా లోకలైజేషన్ చాలా ముఖ్యం. పూర్తిగా మనకు నచ్చిన విధానంలో, భాషలో వాడుకునే వీలు ఉండాలి. ఇలా చేస్తే దేశంలోని యువత అంతా ఆ ప్లాట్‌‌ఫామ్‌‌లనే వాడుతుంది. వారి మధ్య అంతరాలు తొలగిపోతాయి. ఇలాంటి ప్లాట్‌‌ఫామ్‌‌లకే భవిష్యత్ ఉంటుంది” అని 3వన్4 క్యాపిటల్‌‌లో ఫౌండింగ్ పార్టనర్,చీఫ్ ఇన్వెస్ట్‌‌మెంట్ ఆఫీసర్  ప్రణవ్ పాయ్ అన్నారు. ఇది యుబెల్‌‌తో పాటు, మైక్రోబ్లాగింగ్ యాప్ , భారతీయ ప్రాంతీయ భాషల్లో ఆడియో కంటెంట్‌‌ని అందించే కుకూ ఎఫ్ఎం రేడియోలో పెట్టుబడి పెట్టింది. సంప్రదాయ సోషల్ మీడియా ప్లాట్‌‌ఫామ్‌‌లు యూజర్ల అవసరాలను పూర్తిగా తీర్చడం లేదని, లోకల్ యాప్స్ మరింత లోతుగా వెళ్లి అన్ని వర్గాల వారికి ఉపయోగపడే కంటెంట్‌‌ను అందిస్తున్నాయని ఓరియోస్ వెంచర్  మేనేజింగ్ పార్టనర్ అనూప్ జైన్ అన్నారు. ఇలాంటి వాటికి యూజర్ల నుంచి ఎంతో డిమాండ్ ఉందని చెప్పారు. పెద్ద సోషల్ మీడియాల్లో  సమస్యలు ఉండటం వల్ల కొత్తతరం యూజర్లు లోకల్ యాప్‌ల  వైపు చూస్తున్నారని చెప్పారు. 
ఫేక్ ప్రొఫైళ్ల బెడద..
“చాలా మంది యువత తమకు మంచి ప్లాట్‌‌ఫామ్‌‌ లేదని, ఒకరితో ఒకరు నిజంగా కనెక్ట్ అవ్వడానికి సహాయపడే మంచి సోషల్ మీడియా లేదని భావిస్తున్నారు. ఇన్‌‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లు ఫేక్ ప్రొఫైళ్లకు అడ్డాగా మారాయి. అబద్ధపు పోస్టులే ఎక్కువనే భావన బలపడింది” అని స్వెల్ కో–ఫౌండర్ & సీఈఓ సుధా కె వరదరాజన్ అన్నారు. స్వెల్ ఆడియో యాప్ ద్వారా మన మనసులో ఉన్న విషయాన్ని త్వరగా, సులువుగా అందరితో పంచుకోవచ్చు. స్వెల్ పూర్తిగా టీనేజర్ల యాప్. వారికి సీక్రెసీని అందిస్తోంది.   పెద్దలకు దూరంగా తమ కోసం ప్రైవేట్ స్పేస్ అవసరమని భావించే వాళ్ల కోసం దీనిని డిజైన్ చేశారు. ఇతర యాప్‌‌లలో ఇలాంటి ప్రైవేసీ లేదని యుబెల్ సీఈఓ  సౌరభ్ సక్సేనా అన్నారు. “అన్ని నెట్‌‌వర్క్‌‌లలో పెద్దలు ఉన్నందున టీనేజర్లు తమ కోసం ప్రత్యేకమైన చోటును కోరుకుంటారు. టీనేజ్ చాలా చాలా ప్రత్యేకమైన వయస్సు. పెద్దవాళ్ళతో కలవడం వాళ్ళకి ఇష్టం ఉండదు” అన్ని అన్నారాయన.

భవిష్యత్ లోకల్ యాప్‌‌‌‌లదే ?

క్లాన్ వంటివి తమకు నచ్చిన సమూహంతో కనెక్ట్ అయ్యేలా చేస్తాయని దీని కో–ఫౌండర్ & సీఈఓ  సాగర్ నాయర్ అన్నారు. ఇన్‌‌స్టాగ్రామ్ ద్వారా కంటెంట్‌‌ని 20 శాతం కమ్యూనిటీకి మాత్రమే  చేరుకోవడానికి అనుమతిస్తుంది. క్లాన్ వంటి వాటిలో ఇట్లాంటి పరిమితులు లేవు. ఇన్‌‌స్టాగ్రామ్ లేదా ఫేస్‌‌బుక్‌లలో కంటెంట్‌ అందరికీ చేరుతుందని, తమ యాప్ ద్వారా వారు కోరుకున్న సమూహంతోనే షేర్ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. రాబోయే కాలంలో పెద్ద సోషల్ మీడియా కంపెనీలు లోకల్‌ వెర్షన్లను కొనుగోలు చేయడానికి తప్పక ఆసక్తి చూపుతాయని  ఓరియోస్‌‌కు చెందిన జైన్ తెలిపారు. మార్కెట్‌‌లో నిలబడాలంటే ఇలాంటి వాటి అవసరం వాటికి చాలా ఉంటుందని అన్నారు. రాబోయే ఐదేళ్లలో లోకల్ లాంగ్వేజ్‌‌ల సోషల్ మీడియాలు చాలా డెవెలప్ అవుతాయని స్పష్టం చేశారు. అందుకే కుకూ ఎఫ్ఎం ఆరు భారతీయ భాషల్లో ఎఫ్ఎం రేడియో సర్వీసులను అందుబాటులోకి తెచ్చిందని దీనికి కోఫౌండర్ వినోద్ కుమార్ మీనా అన్నారు. తాము ప్రాంతీయ భాషల పోడ్‌‌కాస్టింగ్, కమ్యూనిటీ లిజనర్స్ సేవలనూ అందిస్తామని చెప్పారు. పెద్ద సోషల్ మీడియాల్లో ఇటువంటి సదుపాయాలు లేవని వివరించారు.  తమ ప్లాట్‌‌ఫామ్‌‌లో దాదాపు నాలుగు లక్షల మంది సబ్‌స్క్రయిబర్లు ఉన్నారని వివరించారు.