- ట్రంప్ సర్కార్ కొత్త రూల్స్ తెచ్చినట్లు సీబీఎస్ కథనం
- గుండె జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నోళ్లకూ వీసా నిరాకరణ
- అమెరికా హెల్త్ సెక్టార్ పై భారం తగ్గించేందుకే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
వాషింగ్టన్: అమెరికాలో నివసించేందుకు దరఖాస్తు చేసుకునే విదేశీ పౌరులకు డయాబెటిస్, ఒబెసిటీ లేదా గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటే వీసా నిరాకరించవచ్చని యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సర్కార్ కొత్త గైడ్ లైన్స్ జారీ చేసింది. ఇకపై వీసా అప్లికెంట్లకు ఈ గైడ్ లైన్స్ వర్తింపచేయాలని అన్ని అమెరికన్ ఎంబసీలు, కాన్సులర్ ఆఫీసుల అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు పంపినట్టు ‘సీబీఎస్ న్యూస్’ వెల్లడించింది.
దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు అమెరికాలోకి రావడాన్ని ప్రభుత్వ వనరులపై భారంగా మారే అవకాశంగా పరిగణించాలని ఈ గైడ్ లైన్స్ లో ట్రంప్ సర్కార్ పేర్కొంది. దరఖాస్తుదారుల ఆరోగ్యం లేదా వయస్సును బట్టి.. ప్రభుత్వ నిధులతో నడిచే వైద్య సంరక్షణపై ఆధారపడే అవకాశం ఉంటే వారిని ‘పబ్లిక్ ఛార్జ్’గా వర్గీకరించవచ్చని తెలిపింది. “వీసాకు అప్లై చేసుకున్న దరఖాస్తుదారుడి ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
కార్డియోవాస్కులర్, శ్వాసకోశ, క్యాన్సర్, డయాబెటిస్, మెటబాలిక్, న్యూరాలజికల్ వ్యాధులు, మానసిక ఆరోగ్య పరిస్థితుల వంటి వాటికి లక్షల డాలర్ల విలువైన వైద్య సంరక్షణ అవసరం కావచ్చు. ఒబెసిటీ ఉంటే అది ఆస్తమా, హైబీపీ వంటి పరిస్థితులకు దారితీసి వైద్య ఖర్చులను పెంచవచ్చు కూడా” అని ప్రభుత్వం పేర్కొంది.
‘‘దరఖాస్తుదారులు ప్రభుత్వంపై ఆధారపడకుండా స్వయంగా వైద్య చికిత్స ఖర్చులను భరించగలరా? లేదా? వారిపై ఆధారపడిన కుటుంబసభ్యుల ఆరోగ్య పరిస్థితి ఏమిటి? ఈ అంశాలు దరఖాస్తుదారుడు ఉద్యోగంలో కొనసాగే సామర్థ్యాన్ని ప్రభావితం చేయవచ్చా? అన్నది కూడా పరిగణనలోకి తీసుకోవాలి” అని వివరించింది. కాగా, అమెరికా వీసా దరఖాస్తుల్లో ఆరోగ్య పరీక్షలు ఎప్పటి నుంచో భాగంగా ఉన్నప్పటికీ, ఈ కొత్త రూల్స్ వీసా క్రిటేరియాను మరింత విస్తృతం చేయనున్నాయి. అలాగే ఆరోగ్య ఖర్చులు లేదా హెల్త్ రిస్క్ల ఆధారంగా దరఖాస్తులను తిరస్కరించే అధికారాన్ని కాన్సులర్ అధికారులకు కల్పించనున్నాయి.
