- అచ్చం ‘వెలుగు’ను పోలిన డిజిటల్ కాపీలు క్రియేట్ చేసి సర్క్యులేట్
- పూటకో క్లిప్పింగ్ వదులుతున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్
- సైబర్ క్రైమ్ పోలీసులకు ‘వీ6 వెలుగు’ యాజమాన్యం ఫిర్యాదు
- బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ సోషల్ మీడియా విభాగం పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నది. తెలంగాణ ప్రజల ఆదారాభిమానాలు కలిగిన ‘వీ6 వెలుగు’ లోగోను తన ఫేక్‌న్యూస్‌కు వాడుకుంటున్నది. తమకు సొంత పేపర్ ఉన్నప్పటికీ దాని పేరుతో వార్తలను రాస్తే జనం నమ్మరు గనుక విశ్వసనీయతకు మారుపేరైన ‘వీ6 వెలుగు’ పేరుతో తప్పుడు వార్తలు రాసి వైరల్ చేస్తున్నది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటర్లను తప్పుదోవ పట్టించేలా అచ్చం ‘వెలుగు’ను పోలిన విధంగా వివిధ రకాల డిజిటల్ కాపీలు క్రియేట్ చేసి సర్క్యులేట్ చేస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సహా మంత్రులు, కీలక నేతల ఫొటోలు పెట్టి, వాళ్లు అనని మాటలు అన్నట్టుగా, జరగని విషయాలు జరిగినట్లుగా చిత్రీకరిస్తున్నది.
బీఆర్‌ఎస్ అభ్యర్థికి అనుకూలంగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంటున్న ఈ వార్తలు వీ6 వెలుగులో ప్రచురించినట్లు చూపడం ద్వారా ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నది. పెద్ద సంఖ్యలో ఇలాంటి క్లిప్పింగ్‌లు సోషల్ మీడియాలో తిరుగుతుండడంతో ఈ అంశాన్ని వీ6 వెలుగు యాజమాన్యం సీరియస్‌గా తీసుకున్నది. ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ సీపీ సజ్జనార్‌తో పాటు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేసింది.
వెలుగు పేరుతో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఫేక్ కాపీలను పోలీసులకు అందజేసింది. వీటి వెనుక బీఆర్‌ఎస్ పెయిడ్ సైన్యం ఉన్నట్లు తెలిపింది. ఇలాంటి ఫేక్ న్యూస్ పట్ల జూబ్లీహిల్స్ ఓటర్లు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వీ6 యాజమాన్యం ఒక ప్రకటనలో సూచించింది. ‘వీ6 వెలుగు’ పేరుతో నకిలీ వార్తలు క్రియేట్ చేస్తున్న వారి వివరాలు తెలిస్తే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేసింది.
