న్యూఢిల్లీ: ఈసారి పండుగ సీజన్ ఆటో కంపెనీలను ఖుషీ చేసింది. కేవలం 42 రోజుల్లో ఏకంగా 52 లక్షలకు పైగా బండ్లు అమ్ముడయ్యాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) డేటా ప్రకారం, ఈ ఏడాది 42 రోజుల పండుగ సీజన్‌లో 52,38,401 బండ్ల అమ్మకాలు జరిగాయి. కిందటేడాది ఇదే టైమ్‌లో అమ్ముడైన 43,25,632 బండ్లతో పోలిస్తే 21 శాతం వృద్ధి నమోదైంది. బండ్ల రిజిస్ట్రేషన్ ఆధారంగా ఫాడా రిటైల్ సేల్స్‌ను లెక్కిస్తుంది.
దీని ప్రకారం, ఈ ఏడాది పండుగ సీజన్‌లో బండ్ల రిజిస్ట్రేషన్లు రికార్డ్ స్థాయికి చేరాయి. ప్యాసింజర్ వాహనాల రిజిస్ట్రేషన్లు ఏడాది లెక్కన 23 శాతం పెరిగి 6,21,539 యూనిట్ల నుంచి 7,66,918 యూనిట్లకు ఎగిశాయి. జీఎస్‌టీ రేట్లు తగ్గించడం వల్ల వాహనాల ధరలు దిగొచ్చాయి. దీంతో మధ్యతరగతి వినియోగదారులు బండ్ల కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ముఖ్యంగా చిన్న కార్ల అమ్మకాలు భారీగా పెరిగాయి.
40 లక్షలకు పైగా టూవీలర్ల సేల్స్
ఈ ఏడాది పండుగ సీజన్‌లో 40,52,503 టూవీలర్లు అమ్ముడయ్యాయి. కిందటేడాది ఇదే టైమ్‌లో అమ్ముడైన 33,27,198 యూనిట్లతో పోలిస్తే 22శాతం వృద్ధి ఉంది. గ్రామాల్లో డిమాండ్ పుంజుకోవడం కలిసొచ్చింది. ట్యాక్స్ సంస్కరణలతో ప్రజల దగ్గర డబ్బు పెరగడం, ధరలు తగ్గడంతో టూవీలర్ల సేల్స్ ఊపందుకున్నాయి. కమ్యూటర్ బైక్స్, స్కూటర్లకు డిమాండ్ పెరగగా, ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా గిరాకీ కనిపించింది. త్రీ-వీలర్ సేల్స్ ఏడాది లెక్కన 9 శాతం, కమర్షియల్ వాహనాల సేల్స్ 15 శాతం పెరిగాయి.
అక్టోబర్‌లో 41 శాతం అప్
ఈ ఏడాది అక్టోబర్‌లో బండ్ల రిటైల్ విక్రయాలు 40,23,923 యూనిట్లకు చేరాయి. కిందటేడాది అక్టోబర్‌తో పోలిస్తే 41 శాతం గ్రోత్ కనిపించింది. ఇందులో ప్యాసింజర్ వాహనాలు 5,57,373 యూనిట్లు (ఏడాది లెక్కన 11శాతం వృద్ధి), టూ-వీలర్లు 31,49,846 యూనిట్లుగా (52శాతం వృద్ధి) ఉన్నాయి. త్రీవీలర్ల అమ్మకాలు 5 శాతం పెరిగి 1,29,517 కి చేరాయి. జీఎస్‌టీ రేట్ల తగ్గింపు సెప్టెంబర్ చివరి నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో మొదటి 21 రోజుల్లో సేల్స్ పెద్దగా జరగలేదు.
కానీ, అక్టోబర్‌లో డిమాండ్ పుంజుకుంది. ‘‘రానున్న మూడు నెలల్లో బండ్ల రిటైల్ సేల్స్ మరింత పెరిగే అవకాశముంది. పెళ్లిళ్లు, పంటల కాలం, కొత్త మోడళ్ల విడుదల, స్టాక్ అందుబాటులో ఉండడం, ఏడాది చివరి ఆఫర్లు వంటివి సేల్స్ పెరగడానికి సాయపడతాయి”అని ఫాడా సభ్యుడు ఒకరు చెప్పారు.
