
- ఎన్ఎంసీకి లేఖ రాసిన ఎఫ్ఏఐఎంఏ
- కరీంనగర్లో 64 మంది ఇంటర్న్స్‌ను సస్పెండ్ చేయడం సరికాదు
- సీఏఐఎంఎస్ కాలేజీపై డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: స్టైపెండ్ కోసం నిరసన తెలిపినందుకు 64 మంది మెడికోలను సస్పెండ్ చేసిన కరీంనగర్ చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీపై డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (ఎఫ్ఏఐఎంఏ) డిమాండ్ చేసింది. విద్యార్ధులపై పోలీసులు అవమానకరంగా ప్రవర్తించారని, ఇంటర్న్స్తో బలవంతంగా తప్పుడు డిక్లరేషన్ వీడియోలు తీయించి, కాలేజీ అంతర్గత సమస్య అని ప్రకటించడం దారుణమని పేర్కొన్నది.
అలాగే, రాష్ట్రంలో స్టైపెండ్ చెల్లించని 23 ప్రైవేట్ మెడికల్ కాలేజీలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కు ఎఫ్ఏఐఎంఏ శనివారం లేఖ రాసింది. రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు విద్యార్ధులకు కేవలం రూ. 2వేల నుంచి రూ. 5వేలు మాత్రమే స్టైపెండ్ చెల్లిస్తున్నాయని , ఇంకొన్ని ఇవ్వడం కూడా మానేశాయని తెలిపింది.
ప్రైవేట్ మెడికల్ కాలేజీలు తక్షణమే స్టైపెండ్ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, సీఏఐఎంఎస్ ఘటనలపై యాక్షన్ తీసుకోవాలని కోరింది. ఇంటర్న్స్కు కంప్లీషన్ సర్టిఫికెట్ ఇవ్వకుండా వేధింపులకు గురిచేయొద్దని, స్టైపెండ్ చెల్లింపులను పర్యవేక్షించేందుకు మానిటరింగ్ మెకానిజంను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. భవిష్యత్తులోనూ ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరింది.