
సిద్దిపేట జిల్లాలోని చేర్యాలలో కల్తీపాల కలకలం రేగింది. పాలల్లో వెన్నశాతం ఎక్కువ రావడానికి ఉప్పు, చక్కెర వేసి కల్తీ చేసి పాలను అమ్ముతున్న ఘటన చేర్యాలలోని ప్రభుత్వ అనుబంధ సంస్థ విజయ డెయిరీలో వెలుగు చూసింది. డెయిరీలో కొందరు కేటుగాళ్ళు పాలను కల్తీ చేసి అమ్ముతున్నట్లు పాడి రైతులు ఆరోపించారు.
హైదరాబాద్ లోని విజయ డెయిరీ ప్రధాన కేంద్రానికి పాలు తీసుకువెళ్లగా అసలు విషయం బయటపడింది. దీంతో పాల ఉత్పత్తిదారులు చేర్యాల విజయడైరీ మేనేజర్ తో వాగ్వాదానికి దిగారు. కొందరు అక్రమంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారని పాడి రైతుల ఆరోపిస్తున్నారు. కల్తీ అయిన 52 క్యాన్ల పాలను పారబోసిన పాడి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.