- ధర తగ్గించడం, ఏడు క్వింటాళ్లే కొనుగోలు చేస్తామని సీసీఐ చెప్పడంతో రైతుల ఆందోళన
- నేటి నుంచి బంద్‌కు పిలుపునిచ్చిన కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్
- ఇప్పటి వరకు యాదాద్రి జిల్లాలో 75 వేల క్వింటాళ్లే కొనుగోలు
నల్గొండ, యాదాద్రి/ వెలుగు: పత్తి కొనుగోళ్లలో సీసీఐ అమలు చేస్తున్న కఠిన నిబంధనలపై కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేటి నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేయాలని నిర్ణయించింది. కపాస్ కిసాన్ యాప్ స్లాట్ బుకింగ్ విధానం, ఎకరాకు కేవలం ఏడు క్వింటాళ్లను మాత్రమే కొనుగోలు చేయడం, అన్ని కొనుగోలు కేంద్రాలను ఒకేసారి ప్రారంభించకుండా దశలవారీగా తెరవడం వల్ల రైతులతో పాటు జిన్నింగ్ మిల్లులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని మిల్లర్లు ఆరోపిస్తున్నారు.
సీసీఐ స్పందన కరవు
ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు మహబూబ్‌నగర్ జోన్‌లో 38 సీసీఐ కేంద్రాలు ఉండగా, ఇప్పటికి 23 మాత్రమే ఓపెన్ చేశారు. నల్గొండ జిల్లాలోని 23 జిన్నింగ్ మిల్లులను గ్రూపులుగా విభజించి వాటిలో కొన్నింటిని తెరవడంతో పత్తిని అమ్మాలంటే రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు. కేంద్రాల వద్ద స్లాట్ లభ్యత లేక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ మార్పులపై సీసీఐ స్పందించకపోవడంతో, రాష్ట్ర కాటన్ మిల్లర్స్ అసోసియేషన్ నేటి నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
నవంబర్ 6 నుంచే బంద్ చేయాలని అనుకున్నా కేంద్ర మంత్రులు అందుబాటులో లేరన్న కారణంతో వాయిదా వేశారు. అయితే సమస్యల్లో మార్పు లేకపోవడంతో మళ్లీ కొనుగోళ్లు నిలిపివేయడమే మార్గమని మిల్లర్లు నిర్ణయించారు. అన్ని సీసీఐ కేంద్రాల వద్ద మూసివేత ప్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. సీసీఐ తీరును కేంద్ర ప్రభుత్వం వెంటనే మార్చకపోతే, పత్తి రైతులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
యాదాద్రి జిల్లాలో 1.33 లక్షల ఎకరాల్లో పత్తి సాగు..
యాదాద్రి జిల్లా వ్యాప్తంగా 68 వేల మంది రైతులు 1.33 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. పత్తి మొక్కల నుంచి దూది తీయాల్సిన కీలక దశలో పంట దెబ్బతింది. గతంలో ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి అంచనా వేసిన సీసీఐ, ఈసారి దానిని ఏడు క్వింటాళ్లకు తగ్గించింది. దీంతో మొత్తం దిగుబడి అంచనా 15.36 లక్షల క్వింటాళ్ల నుంచి 9.31 లక్షల క్వింటాళ్లకు పడిపోయింది. పైగా స్లాట్ బుకింగ్ విధానం, కొనుగోళ్లు ఆలస్యంగా ప్రారంభం కావడం, సీసీఐ ఏర్పాటు చేసిన 12 సెంటర్లలో ఇప్పటివరకు కేవలం 85 వేల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయడం రైతులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి.
ఈ అవకాశాన్ని దళారులు వాడుకుని, మద్దతు ధర రూ. 8100 ఉండగా రూ. 6000కే క్వింటాల్ కొనుగోళ్లు ప్రారంభించడంతో కొందరు రైతులు విధిలేక అమ్మకాలు చేశారు. సీసీఐ తీసుకుంటున్న నిర్ణయాలు, మిల్లర్ల కొనుగోలు నిలిపివేత రెండూ కలిపి పత్తి రైతులను మరింత నష్టాలకు గురిచేస్తున్నాయి. సాగులో భారీగా పెట్టుబడులు పెట్టిన రైతులు ఇప్పుడు తక్కువ రేట్లకే పత్తి అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారని, కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని సీసీఐ విధానాన్ని సవరించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
