తరుగు తీస్తున్నరు..రశీదులు ఇస్తలేరు..రైతుల రాస్తారోకోలు, ధర్నాలు

 తరుగు తీస్తున్నరు..రశీదులు ఇస్తలేరు..రైతుల రాస్తారోకోలు, ధర్నాలు
  • కేంద్రాలు ప్రారంభించినా కాంటా పెడ్తలేరని ఫైర్
  • ​ తరుగు తీస్తున్నరని, రశీదులు ఇస్తలేరని రాస్తారోకోలు, ధర్నాలు 
  • వానతో నష్టపోయిన రైతులకు పరిహారమివ్వాలని  వివిధ పార్టీల డిమాండ్​

వెలుగు నెట్​వర్క్​: ధాన్యం కొనుగోళ్లపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలాచోట్ల కొనుగోలు కేంద్రాలు తెరవలేదని, తెరిచిన చోట కాంటాలు పెట్టడం  లేదని, కొంటున్న చోట తరుగు పేరుతో దోచుకుంటున్నారని, రశీదులు ఇవ్వడం లేదని రైతులు రోడ్డెక్కారు. ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తించారు.  మరోవైపు అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను, కౌలు రైతులకు పరిహారమివ్వాలని, తడిసిన ధాన్యాన్ని కొనాలని వివిధ పార్టీల ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు . మంచిర్యాల జిల్లా ఊట్కూర్ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై మండల రైతులు రాస్తారోకో  చేశారు. వీరికి ఆల్​పార్టీ నాయకులు మద్దతు పలికారు.

గంటసేపు బైఠాయించడంతో రెండు వైపులా భారీగా ట్రాఫిక్​జామ్​అయ్యింది. మండలంలో చాలాచోట్ల కొనుగోలు కేంద్రాలు తెరిచినా కాంటా పెట్టడం లేదని మండిపడ్డారు. కొన్ని చోట్ల కొంటున్నా తరుగు పేరిట అధికారులు దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్​జిల్లా ఆర్మూర్​మండలంలోని తహసీల్దార్​ఆఫీస్​ఎదుట బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. ఇదే జిల్లా కోటగిరి తహసీల్దార్ ఆఫీస్ ఎదుట సీపీఐ నిరసన తెలిపింది.

సిరిసిల్ల జిల్లా కోనరావుపేట తహసీల్దార్ ఆఫీసు ముందు, హుస్నాబాద్​ఆర్డీవో ఆఫీసు ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. వడగండ్ల వానతో నష్టపోయిన రైతన్నలకు పరిహారం ఇవ్వాలని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్​ఓబీసీ సెల్, పీసీసీ కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అడిషనల్​కలెక్టర్​కు వినతిపత్రం ఇచ్చారు. కరీంనగర్​రూరల్ మండలం గోపాల్​పూర్ ఎక్స్​ రోడ్డు వద్ద కాంగ్రెస్​రాస్తారోకో చేసింది. ఇదే జిల్లా రామడుగు మండలం వెదిర ఎక్స్ రోడ్ వద్ద ఉన్న జగిత్యాల–కరీంనగర్ రోడ్డుపై కాంగ్రెస్​నాయకులు బైఠాయించి నిరసన తెలిపారు.  

మక్కలు కొనాలని స్వీయ నిర్బంధం 

బోథ్​: మక్కలను కొనాలని డిమాండ్​ చేస్తూ ఆదిలాబాద్​జిల్లా బోథ్​మండలంలోని కన్గుట్ట గ్రామ రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. గురువారం తెల్లవారుజామున గ్రామ పంచాయతీ కార్యాలయం లోపలకు వెళ్లి తాళం వేసుకున్నారు. అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న మొక్కజొన్న పంటను ప్రభుత్వమే కొనాలని డిమాండ్​ చేశారు. ప్రజాప్రతినిధులు వచ్చి రెండు రోజుల్లో కొనేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్​మండలం రాపల్లి, నర్సింగాపూర్​ గ్రామాల్లో వడ్ల కొనుగోళ్లు ప్రారంభించాలని కలెక్టరేట్​ ఎదుట నిరసన తెలిపారు. తర్వాత జిల్లా సివిల్​సప్లయీస్​ఆఫీసర్​కు వినతిపత్రం ఇచ్చారు.