
- మద్దతు ధర 5,328 కాగా, రూ.4 వేలకు కొంటున్న మహారాష్ట్ర వ్యాపారులు
- నష్టపోతున్న అన్నదాతలు
- కేంద్ర సర్కార్సెంటర్లు ప్రారంభించాలని రైతుల విన్నపం
నిజామాబాద్, వెలుగు : జిల్లాలో సొయాబీన్ పంట కోతలు పూర్తై ధాన్యం అమ్మేందుకు రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి, మక్కజొన్న తర్వాత అధిక విస్తీర్ణంలో సొయాబీన్ సాగవుతోంది. ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు కొంత నష్టం జరిగింది. మిగిలిన పంట చేతికొచ్చినా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయకపోవడంతో మహారాష్ట్ర వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సొయా క్వింటాల్ మద్దతు ధర రూ.5,328 కాగా, రూ.4,000 మాత్రమే చెల్లిస్తూ రైతులను నిండా ముంచుతున్నారు. దీంతో క్వింటాల్‌పై రూ.1,300 నష్టం వస్తుందని రైతులు వాపోతున్నారు. సొయాబీన్సర్కార్ కొనుగోలు సెంటర్లు ప్రారంభించకపోతే ఆరుగాలం కష్టపడ్డ శ్రమ దళారుల పాలవుతుందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
వర్షాల దెబ్బతో తగ్గిన దిగుబడి..
జిల్లావ్యాప్తంగా సొయాబీన్37,839 ఎకరాల్లో సాగైంది. ఆగస్టు 17 నుంచి 19, 27 నుంచి 30 వరకు భారీ వర్షాలు కురిశాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో పంట నష్టపోగా, అత్యధికంగా సాగైన బోధన్ రెవెన్యూ డివిజన్‌లో రైతులు పంటను దక్కించుకోగలిగారు. ముఖ్యంగా గోదావరి, మంజీరా పరీవాహక ప్రాంతాలు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రభావిత మండలాల్లో సుమారు 12,054 ఎకరాల్లో పంట దెబ్బతిన్నది. మిగిలిన 25,785 ఎకరాల్లో పంట కోతలు ఈ నెలలో ప్రారంభమయ్యాయి. ఎకరానికి పది క్వింటాళ్లు దిగుబడి రావాల్సి ఉండగా, ఎనిమిది క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. దీంతో పంట దిగుబడి తగ్గగా, ఉన్న పంటను అమ్ముకోవడానికి కష్టాలు పడాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు.
12 సెంటర్ల కోసం కేంద్రానికి లెటర్ పంపిన రాష్ట్రం..
పొద్దుతిరుగుడు, శనగలు, సొయాబీన్ కొనుగోలు సెంటర్లు కేంద్ర సర్కార్ అనుమతితో సింగిల్ విండో ఆధ్వర్యంలో ప్రారంభం కావాల్సి ఉంది. గతేడాది మాదిరిగా బోధన్ రెవెన్యూ డివిజన్‌లో 12 సెంటర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లెటర్ పంపింది. కానీ ఇప్పటివరకు అనుమతులు రాకపోవడంతో సెంటర్లు ప్రారంభం కాలేదు. పంట నిల్వ చేసేందుకు సౌకర్యం లేకపోవడంతోపాటు వర్షాలు వస్తాయన్న భయంతో మహారాష్ట్ర వ్యాపారులకు అగ్గువకే అమ్ముకుంటున్నారు.
కేంద్రం నిర్ణయించిన మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5,328 కాగా, రూ.4 వేలకే అమ్ముతూ రూ.1,300 నష్టపోతున్నారు. జిల్లాలో సొయాబీన్2.06 లక్షల క్వింటాళ్ల దిగుబడి అంచనా ఉండగా, ఇప్పటికే సుమారు 50 వేల క్వింటాళ్ల సొయాను తక్కువ ధరలకు అమ్మేశారు. గత ఏడాది సెప్టెంబర్ 25న సెంటర్లు ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం ఈసారి ఆలస్యం చేయడం అన్నదాతలను తీవ్రంగా కలవరపెడుతోంది. కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సొయా రైతులు వేడుకుంటున్నారు.
అగ్గువకు అమ్మలేకపోతున్నా..
సొంత భూమితోపాటు కౌలుకు తీసుకుని 36 ఎకరాల్లో సొయాబీన్ సాగు చేశా. కోసిన పంటను నిల్వ చేసే సౌకర్యం లేదు. మళ్లీ వర్షాలు వచ్చేటట్టున్నయ్. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయక ఆగం చేస్తోంది. అగ్గువకే అమ్ముకుందామంటే మనసు రావడం లేదు. –అడ్డగట్ల గంగాధర్, రైతు, కుమ్మన్ పల్లి
పర్మిషన్ రాగానే ఓపెన్ చేస్తాం
కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే సొయాబీన్కొనుగోలు సెంటర్లు ప్రారంభిస్తాం. జిల్లాలో 12 సెంటర్లు అవసరమని నివేదించాం. రైతులు దళారులకు పంటను అమ్మి నష్టపోవద్దు. ప్రభుత్వ సెంటర్లు షురూ కాగానే పంటను తీసుకొచ్చి మద్దతు ధర పొందాలి. – డి.మహేశ్‌కుమార్, డీఎం, మార్క్‌ఫెడ్