60 వేల మంది రైతులు  బీమాకు దూరం

60 వేల మంది రైతులు  బీమాకు దూరం

అప్లికేషన్‌ పెట్టుకున్నా టైమ్​ అయిపోయి బీమా కాలె
వారం కూడా టైం ఇవ్వకపోవడంతో పరేషాన్​
సర్కారు నిర్లక్ష్యంతో బీమా కోల్పోతున్న రైతులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఈసారి కొత్తగా పాస్​బుక్​లు వచ్చిన రైతుల్లో దాదాపు 60 వేల మందికి పైగా బీమాకు అప్లై చేసుకోలేకపోయారు. దరఖాస్తులు అప్​లోడ్​ చేసేందుకు కనీసం వారం కూడా టైమివ్వకపోవడంతో వీళ్లందరి అప్లికేషన్లు పెండింగ్​లో పడిపోయాయి. బీమాకు రైతులు అప్లై చేసుకున్నా, అప్లికేషన్లు పరిశీలనలో ఉన్నా.. ఇచ్చిన టైమ్​ అయిపోయిందని బీమా పోర్టల్​ను అధికారులు క్లోజ్​ చేశారు. దరఖాస్తుకు గతంలో నెలల తరబడి గడువుంటుండగా ఈసారి మాత్రం వారమంటే వారమే ఇవ్వడంతో చాలా మంది బీమాకు దూరమయ్యారు.  
వారం కూడా టైమియ్యలే
రైతు బీమాను ఆగస్టు14 నుంచి నమోదు చేయాల్సి ఉండగా ఆగస్టు 18 నుంచి క్షేత్ర స్థాయి అధికారులకు బీమా పోర్టల్‌‌‌‌‌‌‌‌లో లాగిన్​కు అనుమతిచ్చారు. ఏఈవోలు 32.76 లక్షల మంది పాత లబ్ధిదారుల జాబితాను తీసుకుని గ్రామాల వారిగా  డేటాతో  ఆధార్‌‌‌‌‌‌‌‌తో వెరిఫై చేసి  ఆగస్టు 24 వరకు పాత వాళ్ల రెన్యువల్‌‌‌‌‌‌‌‌ పూర్తి చేశారు. ఆ తర్వాత కొత్తగా పట్టాదారు పాస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌లు వచ్చిన వారి దరఖాస్తులు పరిశీలించి అప్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేయడం స్టార్ట్​ చేశారు. రాష్ట్రంలో 2,601 క్లస్టర్ల పరిధిలో కొత్తగా 4 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ప్రతి రైతు అప్లికేషన్‌‌‌‌‌‌‌‌ ఫాం నింపి సంతకాలు తీసుకుని అప్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేయాల్సి ఉండటంతో లేటైంది. కానీ వ్యవసాయ శాఖ గడవు ఇవ్వకుండా ఆగస్టు 30 అర్ధరాత్రి బీమా పోర్టల్‌‌‌‌‌‌‌‌ క్లోజ్‌‌‌‌‌‌‌‌ చేసింది. దీంతో ఒక్కో ఏఈవో వద్ద 30కి పైగా అప్లికేషన్లు అప్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ కాకుండా మిగిలిపోయాయి. 
ఈ యేడు అప్లికేషన్లు పెరిగినయ్‌‌‌‌‌‌‌‌ 
రైతు బీమా 2018–19లో ప్రారంభం కాగా ఆ యేడు 31.25 లక్షల మందికి బీమా కల్పించారు. 2019–20లో 30.81లక్షల మందికి, 2020-–21లో 32.73 లక్షల మందికి బీమా చేశారు. ఈసారి కొత్తగా 4 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. దీంతో ఈ యేడు ఆగస్టు 30 వరకు పాతవి , కొత్తవి కలిపి 35.20 లక్షల మందికి బీమా  కల్పించారు. మరో 60 వేలకు పైగా అప్లికేషన్లు మిగిలిపోయినట్టు సమాచారం. 
గతంలోనూ ఇదే ప్రాబ్లమ్​ 
దురదృష్టవశాత్తు బీమా పరిధిలో ఉన్న రైతు మరణిస్తే వారి కుటుంబాలకు ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీ నుంచి రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందుతుంది. అయితే 2019 డిసెంబర్  నుంచి 2020 ఆగస్టు 13 వరకు ఎన్‌‌‌‌‌‌‌‌రోల్‌‌‌‌‌‌‌‌ చేసుకున్న రైతులకు సర్కారు చెల్లించిన ప్రీమియం సరిపోక 1.34 లక్షల మంది రైతులకు ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీ ఐడీలు రాలేదు. ఆ యేడు చనిపోయిన 690 మందికి ఐడీలు రాక పరిహారం అందలేదు. ఇప్పటికీ ఆ రైతుల కుటుంబీకులు బీమా కోసం అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. తాజాగా 2021-–22 సంబంధించి కూడా బీమా అప్లై చేసుకుని ఆగస్టు 30 లోగా బీమా పోర్టల్‌‌‌‌‌‌‌‌ అప్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ కాకుండానే కొందరు రైతులు చనిపోయారు. మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో ఇటీవల ఇద్దరు రైతులు మరణించారు. ఆ కుటుంబాలకు ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీ ఐడీలు రాక  పరిహారం అందలేదు. ఆగస్టు 30లోగా అప్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌  కాకుండా పెండింగ్​లో ఉన్న దరఖాస్తులకు తిరిగి అవకాశం కల్పించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ వినిపిస్తోంది.

9 లక్షలకు పైగా కొత్త పాస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌లు
ధరణి పోర్టల్‌‌‌‌‌‌‌‌ ప్రారంభమయ్యాక 2020 నవంబర్​ 2 నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు షురూ అయ్యాయి. కొత్తగా 9 లక్షల మందికి పైగా రైతులకు పట్టా పాస్‌‌‌‌‌‌‌‌పుస్తకాలు అందాయి. గత ఆగస్టు 3 వరకు పాస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌లు పొందిన రైతులు బీమాకు అప్లై చేసుకోవడానికి అనుమతిచ్చారు. కొత్త వాళ్లలో 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల లోపున్న రైతులు దాదాపు 4 లక్షల మంది బీమాకు దరఖాస్తు చేసుకున్నారు. 
ప్రీమియం కట్టలేకే.. 
సర్కారు నిర్లక్ష్యంతో గతంలో రైతులు చనిపోతే రూ.5 లక్షల పరిహారం అందలేదు. కొత్తగా పాస్ బుక్ వచ్చిన అర్హులైన రైతుల బీమా నమోదుకు గడువు పెంచి ఇన్సురెన్స్‌‌‌‌‌‌‌‌ కల్పించాలి. ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీ చేయాల్సిన పనిని ఏఈవోలతో చేయిస్తున్నారు. పని ఏఈవోలది, లబ్ధి ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీది అన్నట్లుంది. సర్కారు  స్పందించి అర్హులైన వాళ్లకు బీమా వర్తించేలా చర్యలు తీసుకోవాలి. 
                                                                                                                                                                              - మూడ్ శోభన్, రైతు సంఘం  రాష్ట్ర సహాయ కార్యదర్శి