
- రెండు రోజుల క్రితం వృద్ధురాలి తొంటికి తగిలిన తూటా
- ఆందోళనలో బోనాలపల్లె గ్రామస్తులు
- ఫైరింగ్ రేంజ్ తరలించాలని డిమాండ్
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సమీపంలో పోలీసుల ట్రైనింగ్ కోసం ఏర్పాటు చేసిన ఫైరింగ్ రేంజ్ రెండు గ్రామాల ప్రజలను భయపెడుతోంది. ఫైరింగ్ ప్రాక్టీస్ చేసే క్రమంలో తమ గ్రామాల వైపు కొన్నిసార్లు తూటాలు దూసుకొస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇంటి పై కప్పులు, గోడలకు బుల్లెట్లు తగలగా.. ఈ నెల 20న బోనాలపల్లి గ్రామంలో వృద్ధురాలు అమృతమ్మ(80) తుంటికి బుల్లెట్ తగలడంతో మరింత భయాందోళనకు గురవుతున్నారు.
అదృష్టవశాత్తు ఆమె స్వల్పంగా గాయపడిందని, జరగరాని ఘటన జరిగితే బాధ్యులెవరని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. అమృతమ్మకు తగిలిన బుల్లెట్‌ను గ్రామస్తులు పోలీసులకు అందజేశారు. బుల్లెట్ తక్కువ స్పీడ్‌తో తగిలిందని, అదే ఎక్కువ స్పీడ్‌తో తగిలి ఉంటే తమ తల్లి పరిస్థితి ఏమిటని బాధితురాలి కుమారుడు మల్లేశం ఆవేదన వ్యక్తం చేశాడు.
భయంభయంగా బోనాలపల్లి
కరీంనగర్ రూరల్ మండలం ఎలగందుల గ్రామానికి హామ్లేట్ విలేజీగా ఉన్న బోనాలపల్లి ప్రజలను కొన్నాళ్లుగా పోలీస్ తూటాలు భయపెడుతున్నాయి. ఇదే ప్రాంతంలో చాలా ఏళ్లుగా పోలీసులు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ.. గతంలో తూటాలు దూసుకొచ్చిన దాఖలాలు లేవని, ఫైరింగ్ రేంజ్‌కు తమ గ్రామానికి మధ్య గుట్ట ఉండడంతో బుల్లెట్లు రాలేదని గ్రామస్తులు చెప్తున్నారు. మైనింగ్ కారణంగా గుట్ట ఎత్తు తగ్గిపోవడంతో పోలీసులు కాల్చిన బుల్లెట్లు గుట్టను దాటుకుని గ్రామంలోకి వస్తున్నాయంటున్నారు.
ఫైరింగ్ రేంజ్ కు ఈ గ్రామం 700 మీటర్ల దూరంలో ఉండడంతో బోనాలపల్లిలోని ఇళ్ల వాకిళ్లు, పైకప్పులపై తూటాలు పడుతున్నాయి. దీంతో ఆందోళన చెందుతున్న గ్రామస్తులు పోలీస్ ఫైరింగ్ రేంజ్‌ను తమ గ్రామానికి దూరంగా తరలించాలని కోరుతున్నారు. కాగా సంఘటన జరిగిన రోజే సమాచారం అందుకున్న సీపీ గౌష్ ఆలం ప్రత్యేక బృందాన్ని ఫైరింగ్ రేంజ్ కు, బోనాలపల్లెకు పంపి వివరాలు సేకరించినట్లు తెలిసింది.
ఎవలో రాయితో కొట్టిండ్లనిపించింది
నాకు మూడు రోజుల తొంటికి దెబ్బ తగిలింది. ఎవరో రాయితో గట్టిగా కొట్టినట్లు అనిపించింది. నేను మొత్తుకోవడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి చూసి అది రాయి కాదు.. తుపాకీ తూటా అని చెప్పిండ్లు. నా కొడుకులు దవఖానాకు తీసుకపోయి చూపెట్టిండ్లు. పోలీసులు వచ్చి మాట్లాడి నా ఫొటో తీసుకుని పోయిండ్లు. తగిలింది తూటా అని తెలిసేసరికి భయపడ్డా. జర్ర అయితే పాణం పోతుండే. - అమృతమ్మ, బాధితురాలు, బోనాలపల్లె