తుంగభద్రకు పోటెత్తిన వరద

తుంగభద్రకు పోటెత్తిన వరద

అయిజ, వెలుగు: కర్నాటకలోని టీబీ డ్యామ్  గేట్లు ఓపెన్  చేయడంతో తుంగభద్రా నదికి వరద పోటెత్తింది. అయిజ మండలం పులికల్  గ్రామ సమీపంలోని నాగలదిన్నె బ్రిడ్జి వద్ద శనివారం వరద ఉధృతి పెరిగింది. ఒక్కసారిగా వరద పోటెత్తడంతో నది తీర గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజోలి సమీపంలోని సుంకేసుల బ్యారేజీకి 72 వేల క్యూసెక్కులు ఇన్ ఫ్లో వస్తుండగా, 19 గేట్లు ఒక మీటర్  మేర ఎత్తి 74,423 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

భూత్పూర్ రిజర్వాయర్ నుంచి నీటి విడుదల

మక్తల్: భూత్పూర్  రిజర్వాయర్  నుంచి శనివారం ఇరిగేషన్​ అధికారులు సాగునీటిని విడుదల చేశారు. ఇరిగేషన్  డీఈ సతీశ్ కుమార్  కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని విడుదల చేశారు. లక్ష్మారెడ్డి, మార్కెట్  వైస్  చైర్మన్  గణేశ్ కుమార్, కట్ట సురేశ్, కృష్ణయ్య గౌడ్, తాయప్ప, రాంరెడ్డి పాల్గొన్నారు.

జూరాల 12 గేట్లు ఓపెన్..

గద్వాల: జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. జూరాల  ప్రాజెక్టుకు 1.17 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 12 గేట్లను ఓపెన్  చేసి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు వద్ద 317.420 మీటర్ల లెవెల్ ను మెయింటెన్​ చేస్తూ 12 గేట్లను ఎత్తి 79,800 క్యూసెక్కులు, విద్యుత్  ఉత్పత్తి ద్వారా29,327 క్యూసెక్కులు, బీమా లిఫ్ట్–1 ద్వారా 650 క్యూసెక్కులు, కోయిల్ సాగర్  లిఫ్ట్  ద్వారా 315 క్యూసెక్కులు, లెఫ్ట్  కెనాల్  ద్వారా 550 క్యూసెక్కులు, రైట్  కెనాల్  ద్వారా290 క్యూసెక్కులు, ఆర్డీఎస్  లింక్  కెనాల్  ద్వారా 150 క్యూసెక్కులు, బీమా లిఫ్ట్–-2కు 750 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 750 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి మొత్తంగా1,12,366 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు