అమిత్ షాతో పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ భేటీ

అమిత్ షాతో పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ భేటీ

న్యూఢిల్లీ: పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో ఇవాళ భేటీ అయ్యారు. అమిత్‌ షా నివాసంలోనే ఈ భేటీ జరిగింది. నిన్న ఢిల్లీ వచ్చిన ఆయన ఇవాళ వీలు చూసుకుని అమిత్ షాను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిన్న ఢిల్లీకి రావడంతోనే బీజేపీ పెద్దలను కలిసేందుకు వచ్చారని వార్తలు రాగా.. ఆయన లేదంటూ తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఇల్లు ఖాళీ చేసేందుకు ఢిల్లీ వచ్చానని నిన్న మీడియాతో చెప్పిన అమరీందర్‌ ఇవాళ సాయంత్రం నేరుగా అమిత్‌ షా ఇంటికి వెళ్లి భేటీ అయ్యారు. గంటకుపైగా వీరి మధ్య సమావేశం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ రాజీనామా గురించి ఆయన వెటకారంగా స్పందించిన విషయం తెలిసిందే. అతని తీరు గురించి ముందే చెప్పానని.. క్రికెట్ ఆడేటప్పుడు ఇండియా జట్టును అర్థాంతరంగా ఎలా వదిలేసి వచ్చాడో ఇప్పుడు అలాగే చేస్తాడని పార్టీ పెద్దలకు చెప్పానని మీడియాకు వెల్లడించారు. సిద్దూకు పాకిస్తాన్ తో సంబంధాలున్నాయని.. అతడు దేశానికి ప్రమాదకారి అని కెప్టెన్ అమరీందర్ సింగ్ కామెంట్ చేయడం కాంగ్రెస్ పార్టీని మరింత ఇరకాటంలో పడేశాయి. 
ప్రధాని మోడీని కలిసే అవకాశం
పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా‌తో కలిసి ఆయన ప్రధానితో భేటీ అవుతారని సమాచారం. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తున్న నేపధ్యంలో మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ను బీజేపీలో చేర్చుకుని  ప్రతిపక్షాలకు గట్టి షాక్ ఇవ్వబోతున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీనియర్ నేత అయిన తనను సీఎం పదవి నుంచి కాంగ్రెస్ పార్టీ తనను అవమానకరంగా తప్పించిందని కెప్టెన్ అమరీందర్ గుర్రుగా ఉన్నప్పటికీ ఎక్కడా బయటపడడం లేదు. తాజాగా కాంగ్రెస్ కు గట్టి షాక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు అమిత్ షాను కలవడం స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.