
న్యూఢిల్లీ: తన భర్తను బేషరతుగా విడుదల చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లడఖ్‌లోని ప్రముఖ క్లైమెట్ యాక్టివిస్ట్ సోనం వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె బుధవారం రాష్ట్రపతికి లెటర్ రాశారు. " లడఖ్‌కు రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ కింద గిరిజన ప్రాంతాల రక్షణ కోసం నా భర్త నిరసన చేశారు. కానీ, హింసాత్మక నిరసనను ప్రేరేపించాడనే ఆరోపణలతో పోలీసులు సెప్టెంబర్ 26న ఆయనను అదుపులోకి తీసుకుని జోధ్‌పూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా వాంగ్‌చుక్‌ను కలుసుకోనివ్వలేదు. కనీసం ఆయనతో మాట్లాడనివ్వట్లేదు.నా భర్త పోరాటాలను, ఆశయాలను చంపాలని కొందరు గత నెల రోజులుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
గత నాలుగేండ్లుగా ఆయనపై అనేక కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. వాతావరణ మార్పులు, కరగుతున్న హిమానీనదాలు, విద్యా సంస్కరణల గురించి మాట్లాడటం నేరమా? లడఖ్ ప్రజల హక్కుల కోసం పోరాడటం పాపమా? వీటిపై ఆయన గాంధేయ పద్ధతిలో శాంతియుతంగానే నిరసన తెలియజేస్తున్నారు. వెనుకబడిన గిరిజనుల అభ్యున్నతి కోసం పోరాడుతున్నారు. దీనివల్ల జాతీయ భద్రతకు ఏంటి ముప్పు? మీది కూడా గిరిజన నేపథ్యమే కాబట్టి నా బాధను అర్థం చేసుకోండి. వాంగ్‌చుక్ అరెస్ట్ పై జోక్యం చేసుకుని, మీ అధికారాలతో ఆయనను బేషరతుగా విడిపించండి" అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో గీతాంజలి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, లా మినిస్టర్, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌లకు కూడా కాపీలు పంపారు.