జీహెచ్ఎంసీలో 100 కోట్ల బిల్లులు నిలిపివేత

జీహెచ్ఎంసీలో 100 కోట్ల బిల్లులు నిలిపివేత
  • బీఆర్ఎస్ ​హయాంలో అక్రమాలకు పాల్పడినట్టు గుర్తింపు
  • విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించిన జీహెచ్​ఎంసీ కమిషనర్ ఇలంబరితి

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీలో 2023కు ముందు వివిధ పనులకు సంబంధించిన రూ.100 కోట్ల బిల్లులను కమిషనర్ ఇలంబరితి నిలిపేశారు. ఆ పనులకు సంబంధించి విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించారు. జీహెచ్ఎంసీలో 2వేల మందికిపైగా కాంట్రాక్టర్లు వివిధ పనులు చేస్తున్నారు. వారికి సంబంధించిన బిల్లులు గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.1,200 కోట్ల వరకు పెండింగ్ లో ఉన్నాయి. 

ఇందులో 2023 డిసెంబర్ వరకు రూ.700 నుంచి రూ.- 800 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. ఆ ఫైళ్లను పరిశీలించిన తర్వాత అందులో రూ.100 కోట్ల పనులకు సంబంధించి బిల్లులపై అనుమానాలు తలెత్తడంతో వాటిని నిలిపేయాలని ఫైనాన్స్ విభాగం అధికారులను కమిషనర్ ఆదేశించారు. 

బీఆర్ఎస్ హయాంలో ఇష్టానుసారంగా బిల్లులు..

గత బీఆర్ఎస్​ హయాంలో అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పిన విధంగా అధికారులు బిల్లులు అందించారు. అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ కి తెలియకుండా ఏ బిల్లు కూడా శాంక్షన్​కాని పరిస్థితి ఉండేది. అధికారులు కూడా తమకెందుకు వచ్చిన తలనొప్పి అని అప్పటి ప్రభుత్వ పెద్దల కనుసైగల్లోనే పనులు చేశారు. ఇందులో చేయని పనులకు కూడా బిల్లులు ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో జీహెచ్ఎంసీ వద్ద నిధులు లేకపోవడంతో కాంట్రాక్టర్లకు ఎప్పుడూ రూ.1,500 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉండేవి. దీంతో అప్పట్లో మంత్రులుగా ఉన్నవారు చెప్పిన వారికే బిల్లులు ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. 

అప్పట్లో జీహెచ్ఎంసీ ఫైనాన్స్ విభాగంలో ఉన్న అధికారులు ఎటువంటి విషయాన్ని బయటకు చెప్పేవారు కాదు. ఆ ప్రభుత్వం అధికారం కోల్పోయి.. కాంగ్రెస్​ సర్కారు రావడంతో అధికారులు ఇప్పుడు పలు విషయాలను బయటకు చెప్తున్నారు. 

నాలుగేండ్లలోనే భారీగా అక్రమాలు..

2019 నుంచి 2023 వరకు  జీహెచ్ఎంసీ పరిధిలో చేసిన ప్రతి పనిలో అవినీతి, అక్రమాలు జరిగినట్టు కమిషనర్ దృష్టికి వచ్చింది. గ్రేటర్ లో వేసిన రోడ్లు, రోడ్ల మెయింటెనెన్స్, నాలాల పూడికతీత తదితర పనులన్నింటిలోనూ అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. ప్రస్తుతం కమిషనర్ ఇలంబరితి వచ్చిన తరువాత ప్రతి విషయాన్ని విజిలెన్స్,​ ఇంటెలిజెన్స్ విచారణకు ఆదేశిస్తున్నారు.