
- వరద, మిగులు జలాల లెక్క తేల్చేందుకు స్టడీ చేయించాలి
- పీబీ లింక్ ప్రాజెక్ట్.. టీఏసీ అనుమతులకు విరుద్ధం
- కేవలం పోలవరం ప్రాజెక్టుకే టీఏసీ అనుమతులున్నయ్
- బనకచర్ల లింక్‌తో ఆ ప్రాజెక్టు రూపురేఖలే మారిపోతయ్
- దీనికి గోదావరి పరీవాహక రాష్ట్రాల అనుమతులూ అవసరం
- ఈ లింక్‌తో ఏపీ తరలించే 200 టీఎంసీల్లో తెలంగాణ,
- మహారాష్ట్ర, కర్నాటకకూ కేటాయింపులు ఉండాలని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం–బనకచర్ల (పీబీ) లింక్ప్రాజెక్టుపై గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టును వరద జలాలతో చేపడుతున్నారా? లేక మిగులు జలాలతో చేపడుతున్నారా? అన్న దానిపై ఆ రాష్ట్రం ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదని పేర్కొంది. ఓసారి మిగులు జలాలని, మరోసారి వరద జలాలని చెబుతున్నదని తెలిపింది. ఈ నేపథ్యంలో ముందు వరద జలాలు, మిగులు జలాల లెక్కలను తేల్చాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.
ఇందుకోసం ప్రత్యేకంగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని చెప్పింది. మరోవైపు పీబీ లింక్‌ను ఏపీ చేపడితే.. పోలవరం ప్రాజెక్టుకు టెక్నికల్‌అడ్వైజరీ కమిటీ (టీఏసీ) అనుమతులను మరోసారి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని, బనకచర్లకు పోలవరం నుంచే నీటి సోర్సు ఉంది కాబట్టి అది తప్పనిసరి అని తెలిపింది. ఇటు గోదావరి పరివాహక రాష్ట్రాల అనుమతులూ తప్పనిసరి అని తేల్చి చెప్పింది. ఈ మేరకు పీబీ లింక్ప్రాజెక్టుపై తన అభిప్రాయాలను తెలియజేస్తూ సెంట్రల్వాటర్కమిషన్(సీడబ్ల్యూసీ)కు జీఆర్‌ఎంబీ లేఖ రాసింది.
పీబీ లింక్ ప్రాజెక్ట్ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు(పీఎఫ్ఆర్)ను గత నెలలో కేంద్రానికి ఏపీ సమర్పించింది. ఈ నేపథ్యంలో దానిపై అభిప్రాయాలు తెలియజేయాలని సూచిస్తూ సీడబ్ల్యూసీ, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ఏజెన్సీ(ఎన్‌డబ్ల్యూడీఏ), పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కృష్ణా, గోదావరి బోర్డులకు పీఎఫ్ఆర్‌ను కేంద్రం పంపించింది. దీనిపై గోదావరి బోర్డు స్పందిస్తూ.. సీడబ్ల్యూసీకి లేఖ రాసి ప్రాజెక్టుపై తన అభిప్రాయాలను వెల్లడించింది.
పోలవరం నుంచి ప్రాజెక్టును చేపడుతున్నారు కాబట్టి.. ప్రాజెక్ట్ స్వరూపమే మారిపోతుందని, అలాంటప్పుడు పోలవరం ప్రాజెక్టుకు కొత్తగా అనుమతులు తీసుకోవాల్సిందేనని గోదావరి బోర్డు తేల్చి చెప్పింది. అంతేగాకుండా గోదావరి పరివాహక రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ భరోసా ఇవ్వాల్సిన అవసరమూ ఉందని పేర్కొంది.
పోలవరం రూపురేఖలు మారుతయ్..
పోలవరం దిగువ నుంచి బనకచర్లకు నీటిని లిఫ్ట్చేస్తారు కాబట్టి.. అది టీఏసీ నిబంధనలకు విరుద్ధమని గోదావరి బోర్డు స్పష్టం చేసింది. ‘‘టీఏసీ అనుమతుల ప్రకారం పోలవరం డ్యామ్ ఎండీడీఎల్ 141 ఫీట్లు కాగా, లైవ్ స్టోరేజీ కెపాసిటీ 75 టీఎంసీలు. కుడి కాలువ సామర్థ్యం 12 వేల క్యూసెక్కులు. కానీ, అనుమతులకు విరుద్ధంగా ఏపీ పోలవరం ప్రాజెక్టు పనులను చేపడుతున్నది. దీనిపై ఇప్పటికే బేసిన్‌లోని రాష్ట్రాలు ఎన్నోసార్లు కేంద్రానికి ఫిర్యాదు చేశాయి. ఏపీ ప్రభుత్వం తాజాగా పోలవరం బనకచర్ల లింక్ చేపడితే పోలవరం కుడి కాలువకు సమాంతరంగా 1,400 క్యూసెక్కుల కెపాసిటీ ఉన్న తాడిపూడి కాలువను 80 కిలోమీటర్ల నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు 105 కిలోమీటర్ల వరకు పొడిగిస్తారు.
కాలువ సామర్థ్యం కూడా 10 వేల క్యూసెక్కులకు విస్తరించాల్సి ఉంటుంది. పోలవరం కుడికాలువ సామర్థ్యాన్ని కూడా 28 వేల క్యూసెక్కులతో చేపట్టాల్సి ఉంటుంది. దీంతో పోలవరం నుంచి నికరంగా 38 వేల క్యూసెక్కులను (3.5 టీఎంసీలు) తరలించాల్సి ఉంటుంది. ఈ లెక్కన పీబీ లింక్టీఏసీ అనుమతులకు విరుద్ధం. కేవలం పోలవరం ప్రాజెక్టుకే టీఏసీ అనుమతులు ఉన్నాయి. పీబీ లింక్‌ను చేపడితే కొత్తగా మళ్లీ పోలవరం మొత్తానికి టీఏసీ అనుమతులు తీసుకోవాల్సిందే’’ అని తేల్చి చెప్పింది. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న అనుమతులకు విరుద్ధంగా ఉన్న డిజైన్లను మార్చాల్సి ఉంటుందని తెలిపింది.
నీటి వాటాల మాటేంటి?
కృష్ణా డెల్టాకు పోలవరం నుంచి ఏపీ 80 టీఎంసీల నీటిని తరలిస్తున్నదని, ఈ నేపథ్యంలోనే ఏపీ తరలిస్తున్న నీటిలో తెలంగాణ 45 టీఎంసీలు, మహారాష్ట్ర 14 టీఎంసీలు, కర్నాటకకు 21 టీఎంసీల చొప్పున నీటిని కేటాయించారని గోదావరి బోర్డు లేఖలో పేర్కొంది. ఈ లెక్కన ఆ ప్రొరేటా ప్రకారం.. ప్రస్తుతం పోలవరం నుంచి బనకచర్లకు 200 టీఎంసీలను తరలిస్తే ఆ మూడు రాష్ట్రాలకూ ఆ నీటిలోనూ వాటాలను పంచాల్సి ఉంటుందని, దీనిపై స్పష్టతనివ్వలేదని వెల్లడించింది. ఇటు పోలవరం నుంచి 2 టీఎంసీలను తరలిస్తే.. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఆపరేషన్షెడ్యూల్ను మార్చాల్సి ఉంటుందని, దీనికి అన్ని రాష్ట్రాల అనుమతి తప్పనిసరి అని తేల్చి చెప్పింది.
రాష్ట్రాలతో చర్చించాలని స్పష్టం చేసింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే ప్రాజెక్టుపై ముందుకు వెళ్లాలని తేల్చి చెప్పింది. కాగా, సీడబ్ల్యూసీకి లేఖ రాసిన విషయంపై తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాల్సి ఉన్నా.. జీఆర్ఎంబీ మాత్రం ఇవ్వలేదు. ఏకపక్షంగా ముందుకు వెళ్తున్నది. గతంలోనూ కేంద్ర జలశక్తి శాఖ, సీడబ్ల్యూసీ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై లేఖ రాసినా.. సంబంధిత రాష్ట్రాలతో చర్చించాల్సి ఉన్నప్పటికీ బోర్డు విస్మరించింది.