బంగారం ధర ఇప్పుడు తక్కువ అయింది.. ప్రస్తుతం ఎంతంటే..

బంగారం ధర ఇప్పుడు తక్కువ అయింది.. ప్రస్తుతం ఎంతంటే..
  • అనుకూలంగా అంతర్జాతీయ పరిస్థితులు

వెలుగు బిజినెస్​డెస్క్​ : బంగారం ధరలు ఇప్పటికిప్పుడు పెరగకున్నా  మరికొన్ని నెలల తరువాత ఎగబాకుతాయని బులియన్​ ఎక్స్​పర్టులు చెబుతున్నారు. పసిడిని కొనడానికి ఇది మంచి సమయమేనని అంటున్నారు. యూఎస్​ ఫెడ్  వడ్డీ రేటు విధానంపై అనిశ్చితి కారణంగా బంగారం ధరలు స్వల్పకాలంలో అస్థిరంగా ఉండవచ్చని, మధ్యస్థ నుంచి  దీర్ఘకాలంలో రేట్లు పెరుగుతాయని చెబుతున్నారు. ముఖ్యంగా వడ్డీరేట్ల తగ్గింపు ప్రారంభమైన తర్వాత బంగారం రేట్లు ఎక్కువ అవుతాయని భావిస్తున్నారు. 

ఈ క్యాలెండర్ సంవత్సరంలో ఇప్పటివరకు, ఎంసీఎక్స్​లో బంగారం ధరలు దాదాపు 7 శాతం పెరిగాయి. ఈక్విటీ బెంచ్‌‌‌‌మార్క్ సెన్సెక్స్ కూడా ఈ ఏడాది 7 శాతం లాభపడింది. ఈ ఏడాది మే 5 న ఎంసీఎక్స్​లో బంగారం ధరలు 10 గ్రాములకు రూ.61,460 స్థాయికి చేరుకున్నాయి.  పసిడి ఇప్పుడు 10 గ్రాములకు రూ.58,500 స్థాయికి పడింది. బాండ్ ఈల్డ్, యూఎస్​ డాలర్ పెరగడం వంటివి గత కొన్ని నెలలుగా బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఫెడరల్ రిజర్వ్ చైర్ జెరోమ్ పావెల్ చేసిన ప్రసంగానికి ముందు  యూఎస్​ డాలర్ రెండున్నర నెలల గరిష్ట స్థాయికి మళ్లీ చేరుకుంది. దీంతో శుక్రవారం ఎంసీఎక్స్​లో బంగారం ధరలు దిగి వచ్చాయి.

నిపుణులు ఏమంటున్నారంటే...

స్వల్పకాలంలో బంగారం అస్థిరంగా ఉండవచ్చని, ఇన్​ఫ్లేషన్​, వృద్ధి డేటా,  వడ్డీ రేట్ల గురించి ఆందోళనలు ఇందుకు కారణాలని నిపుణులు చెబుతున్నారు.  రాబోయే 6-–12 నెలల్లో మాత్రం ధరలు పెరుగుతాయని అంటున్నారు. ఆనంద్ రాఠీ షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్‌‌‌‌లో కమోడిటీస్ అండ్ కరెన్సీ డైరెక్టర్ నవీన్ మాథుర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలో బంగారం అన్ని ప్రధాన కమోడిటీల కంటే మెరుగైన పనితీరును కనబరిచిందని అన్నారు.  

" అమెరికా కొంత కాలం పాటు వడ్డీ రేట్లను ఎక్కువగా ఉంచవచ్చన్న అంచనాల కారణంగా స్వల్పకాలంలో బంగారం ధరలలో అధిక అస్థిరత ఉండవచ్చు. డాలర్​, ఇన్​ఫ్లేషన్​ వంటివి బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తిని పెంచవచ్చు" అని మాథుర్ చెప్పారు.  యూఎస్​ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ కొట్టుమిట్టాడుతోందని, 2024 మొదటి అర్ధభాగం చివరి నాటికి వడ్డీ రేట్లు తగ్గవచ్చని అన్నారు. " అంతర్జాతీయ స్పాట్ మార్కెట్‌‌‌‌లలో ఔన్స్‌‌‌‌ బంగారం ధర 1,850–1,820 డాలర్ల స్థాయికి తగ్గింది. రాబోయే ఆరు నుంచి తొమ్మిది నెలల్లో బంగారం ధరలు పెరుగుతాయని అనుకుంటున్నాం.  2024 సంవత్సరం ప్రథమార్థంలో 10 గ్రాముల స్థాయికి  64 వేల వరకు ఉండవచ్చు” అని మాథుర్ చెప్పారు.

ఎల్‌‌‌‌కేపీ సెక్యూరిటీస్‌‌‌‌లోని వీపీ రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది మాట్లాడుతూ గ్లోబల్ సెంట్రల్ బ్యాంక్‌‌‌‌లు బంగారాన్ని కొంటూనే ఉన్నాయని,  డాలర్ విలువ పెరుగుతూనే ఉందని అన్నారు. ఫలితంగా బంగారం ధరలు గణనీయంగా పెరగకపోయినా, స్థిరంగా ఉండవచ్చని స్పష్టం చేశారు.  ఫెడరల్ రిజర్వ్ తన రేట్ల పెంపును ఆపితే బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. సంవత్సరం ముగిసే సమయానికి ధర స్థాయిలు రూ.61వేల నుంచి రూ.62వేల వరకు ఉండవచ్చని త్రివేది చెప్పారు. భౌగోళిక రాజకీయ సమస్యలు, ఇన్​ప్లేషన్​ వల్ల బంగారం ధరలు పెరిగే అవకాశాలే ఎక్కువని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమోడిటీస్ హెడ్ హరీష్ అన్నారు.  

మున్ముందు బంగారం ధరలను ప్రభావితం చేసే అంశాలు

1. ఇన్​ఫ్లేషన్ ​: బంగారం ఇన్​ఫ్లేషన్​కు హెడ్జ్‌‌‌‌గా ఉపయోగపడుతుంది. పెరుగుతున్న ఇన్​ఫ్లేషన్​ కారణంగా కరెన్సీల విలువ పడిపోయినప్పుడు, పెట్టుబడిదారులు తమ పెట్టుబడి విలువను కాపాడుకోవడానికి బంగారాన్ని కొంటారు. దీని వలన బంగారం ధర పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇన్​ఫ్లేషన్​ తగ్గింది. సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాల వల్ల రానున్న నెలల్లో ఇన్​ఫ్లేషన్​ మరింత తగ్గుతుందని అంచనా.

2. వడ్డీ రేట్లు : బంగారం ధరలు వడ్డీ రేట్లకు  స్పందిస్తాయి. తక్కువ- వడ్డీ రేట్ల వల్ల పసిడికి మరింత గిరాకీ పెరుగుతుంది. వడ్డీరేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు,  బాండ్లు వంటి ఇతర పెట్టుబడులవైపు మళ్లుతారు. ఈ ఏడాది యూఎస్‌‌‌‌ ఫెడ్‌‌‌‌, ఆర్‌‌‌‌బీఐలు రేట్లను తగ్గించే అవకాశాలు కనిపించడం లేదు. మరిన్ని సార్లు పెంచకపోవచ్చు కూడా. 

3. డాలర్ కదలిక : బంగారం ధర డాలర్లలో ఉండటంతో, ధరలు దీని కదలికలపై ఆధారపడి ఉంటాయి.  డాలర్ బలంగా ఉంటే బంగారం ధరలు తగ్గుతాయి. బలహీనంగా మారితే  దీనికి డిమాండ్​ పెరుగుతుంది. రాబోయే నెలల్లో ఫెడ్ హాకిష్‌‌‌‌గా ఉంటే, అది డాలర్‌‌‌‌కు మరింత బలాన్ని చేకూర్చవచ్చు. ఇది బంగారం ధరలకు ప్రతికూలం కావచ్చు.

4. స్థూల ఆర్థిక,  భౌగోళిక రాజకీయ కారకాలు : భౌగోళిక రాజకీయ సంక్షోభం, ఆర్థిక అనిశ్చితి లేదా ఆర్థిక మార్కెట్ అస్థిరత సమయంలో బంగారం కొనడం బెటర్​. యూఎస్ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది.  భారతదేశం  స్థూల ఆర్థిక పరిస్థితి బలంగా ఉంది. అయితే ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపగల యూరప్,  చైనా దేశాలు ఒత్తిడిలో ఉన్నాయి. అమెరికా, భారత్‌‌‌‌లో ఆర్థిక వృద్ధిరేటు తగ్గితే అది బంగారానికి సానుకూలంగా ఉంటుంది. వర్షాలు కూడా బాగున్నాయి కాబట్టి బంగారానికి డిమాండ్​ ఇంకా రావొచ్చు.