- ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
కామారెడ్డి, వెలుగు: ఎమ్మెల్యే ధ్యాస ప్రొటోకాల్‌పైనే ఉంటుందని, కానీ, తన ధ్యాస అభివృద్ధిపై ఉంటుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. తన పేరు శిలాఫలకాలపై ఉండాలని అనుకోవట్లేదని, శిలఫలకాల కంటే అభివృద్ధే తనకు ముఖ్యమని తెలిపారు. ఆదివారం కామారెడ్డిలో డెయిరీ కాలేజీలో రూ.35 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, 15వ వార్డులో రూ.20 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్ల పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండేండ్లుగా ఎమ్మెల్యే సహకారం కోసం ఎదురు చూశానని తెలిపారు. ఎమ్మెల్యే మాత్రం ప్రొటోకాల్ అంటూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. కామారెడ్డి టౌన్‌కు రూ.6 కోట్లతో అండర్ గ్రౌండ్ సబ్‌స్టేషన్ మంజూరైతే శంకుస్థాపన చేయడానికి ఎమ్మెల్యేకు టైం దొరకడం లేదన్నారు.
రాష్ట్రంలో మిగిలిన మూడు చోట్ల పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. అభివృద్ధి పనులపై విజిలెన్స్‌కు ఫిర్యాదు చేశారని, ప్రొటోకాల్ కంటే అభివృద్ధే ముఖ్యమని భావించి పనులు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. రూ.195 కోట్లతో గతంలో చేపట్టిన తాగునీటి స్కీమ్‌కు సంబంధించిన మెయిన్ పైప్‌లైన్ మార్చే పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ పనులు కంప్లీట్ అయితే కామారెడ్డి ప్రజలకు ప్రతి రోజు 10 ఎంఎల్డీ వాటర్ సప్లైచేయవచ్చని చెప్పారు. కామారెడ్డి డెయిరీ కాలేజీ అభివృద్ధికి గత ప్రభుత్వం చర్యలు చేపట్టలేదన్నారు. లైబ్రరీ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కైలాస్ శ్రీనివాస్‌రావు, పండ్ల రాజు, నర్సింగ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, గూడుగుల శ్రీను, ఐరేని సందీప్, రాంమోహన్ పాల్గొన్నారు. అనంతరం ఐకేపీ డైరీ, క్యాలెండర్‌ను ఆయన అవిష్కరించారు.
