- మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కోరిన ప్రభుత్వ సలహాదారు
కామారెడ్డి, వెలుగు : జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ కోరారు. ఆదివారం హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు వెళ్తున్న ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మార్గమధ్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆగారు. ఈ సందర్భంగా మంత్రిని షబ్బీర్అలీ కలిసి సాగునీటి ప్రాజెక్టులతోపాటు మున్సిపల్ ఎన్నికలపై చర్చించారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపాదికన పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని సూచించారు. అనంతరం మంత్రిని సన్మానించారు.
కేంద్రం నుంచి నయా పైసా తీసుకురాలే..
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి కేంద్రం నుంచి నియోజకవర్గానికి నయా పైసా తీసుకురాలేదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ విమర్శించారు. ఆదివారం కామారెడ్డి టౌన్‌లోని 19,41,43,48,49 వార్డుల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా షబ్బీర్అలీ మాట్లాడుతూ కామారెడ్డి అభివృద్ధిని విస్మరించిన ఎమ్మెల్యేను నిలదీయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడం కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు.
