దళితులను దగా చేసిందెవరు దొర గారు ?

దళితులను దగా చేసిందెవరు దొర గారు ?

పదేండ్ల  బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాలనలో  దళిత- బహుజనులకు జరిగిన మోసాల లెక్క తేల్చాల్సిన సమయం ఇది. తెలంగాణ రాజకీయాల్లో దళిత,  బహుజన వర్గాలెప్పుడూ రాజకీయ శక్తులే.  సామాజిక న్యాయం, అణగారిన వర్గాల అభ్యున్నతి,  దళిత సాధికారత లాంటి పదాలు ప్రతీ రాజకీయ పార్టీ వినిపిస్తుంటుంది.  కానీ ఆచరణలో  పాటించేవి కొన్ని పార్టీలు మాత్రమే.  తెలంగాణ అంటేనే బహుజనులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల త్యాగాల పునాదులపై పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్రం నేటికీ అన్యాయాలపాలై  అవమానాలెదుర్కోవడం బాధాకరం.  

అధికార దర్పంతో  బహుజనులను చీపురు పుల్లల్లా  తీసేసిన కేసీఆర్ అధికారం కోల్పోయాక కూడా  దళితులపై పగ పెంచుకుంటుండడం  ఆందోళన  కలిగిస్తున్నది.  నాడు దళిత  సీఎం మాట దగ్గర నుంచి  ఇయ్యాల దళిత స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై  బూతుల వర్షం కురిపించే వరకు చూస్తే  బీఆర్ఎస్  దళిత,  బహుజన వ్యతిరేక ధోరణి  స్పష్టమవుతున్నది.  కేసీఆర్ దళిత వ్యతిరేక  నైజం బయటపడుతున్నది.

సబ్బండ వర్ణాల  సాధికారత  నినాదాలు ఇచ్చిన ఆ పార్టీ,   దళిత  సీఎం వాగ్దానాన్ని అటకెక్కించడం, మంత్రివర్గంలో దళితులకు ఒకరికి మాత్రమే స్థానం కల్పించడం,  సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లాన్ నిధులను దారి మళ్లించడం, బీసీ రిజర్వేషన్లను కుదించడం, ఓ దళితుణ్ని అకారణంగా డిప్యూటీ  సీఎం నుంచి బర్తరఫ్ చేయడం, నేరెళ్ల దళితులను తొక్కి చంపించడం వంటి ఎన్నో దుర్మార్గాలు చేసింది. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉంటే  దళిత నేతకు సీఎల్పీ హోదా  తొలగించడం, ఓ బీసీ మంత్రికి ఉద్వాసన పలకడం వరకు చూస్తే బీఆర్ఎస్ సహజ శైలి అర్థం అవుతుంది.

సమాజం అంతరాలను సృష్టించిన కారణంగా అధికారం కోల్పోయిన ఆ పార్టీ.. అసెంబ్లీ సాక్షిగా మరోసారి  తన దొరల నైజాన్ని,  ప్రధానంగా  దళిత వ్యతిరేక తన అసలు స్వభావాన్ని బయటపెట్టుకుంది. అసెంబ్లీ సాక్షిగా జరిగిన పర్వాన్ని జనం కళ్లారా చూసిన తెల్లారి కూడా దొరల దురహంకారంతో  బీఆర్ఎస్ నాయకులు మాట్లాడి వారి దళిత  వ్యతిరేక డీఎన్ఏను చాటుకున్నారు.

దళిత జాతికే  వెన్నుపోటు 
తెలంగాణ ఉద్యమ సమయంలో  కేసీఆర్  చేసిన అతిపెద్ద వాగ్దానాల్లో ఒకటి.. - రాష్ట్రం ఏర్పడితే  తొలి ముఖ్యమంత్రి పదవి దళితుడికే దక్కుతుందని. ఈ వాగ్దానం గురించి కాంగ్రెస్ అధిష్టానానికి స్వయంగా లేఖ రాశానని కూడా చెప్పుకున్నారు.  కానీ  రాష్ట్రం ఏర్పడగానే  ఆ మాటను  తుంగలో తొక్కి, తానే ముఖ్యమంత్రి  కుర్చీలో కూర్చున్నారు. ఇచ్చిన మాటకు  కట్టుబడకపోవడం ఒక ఎత్తయితే, ఆ తర్వాత దళిత ఉప ముఖ్యమంత్రి  పదవిని కూడా ఆరునెలల్లోపే తొలగించడం  బీఆర్ఎస్  దళిత వ్యతిరేక ఆలోచనా విధానానికి నిదర్శనం. 

దళితులను  కేవలం  ఎన్నికల  వ్యూహంలో ఒక సాధనంగా వాడుకోవడమే తప్ప,  వారికి నిజమైన రాజకీయ భాగస్వామ్యం కల్పించే ఉద్దేశం  బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లేదని ఇది స్పష్టం చేస్తోంది.  అంతేకాదు  బీఆర్ఎస్  పదేండ్ల పాలనలో ఒక టర్మ్ మాదిగ ఉపకులానికి, రెండో టర్మ్  మాలకు అవకాశమిచ్చి అగ్రవర్ణాలకే  పెద్దపీట వేసిన చరిత్ర  ఆ పార్టీది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఐదుగురు దళితులకు అవకాశం కల్పించింది.  బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్  రెండో టర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  బీసీ మంత్రిని బర్తరఫ్  చేసి పార్టీ నుంచి సాగనంపడం గమనార్హం.

దళిత బంధుతో దగా 
హుజూరాబాద్ ఉప ఎన్నిక వేళ  ఆగమేఘాల మీద  ప్రకటించిన దళితబంధు పథకం వెనుక ఉద్దేశం సంక్షేమమా  లేక  రాజకీయ అవసరమా అనేది మొదటి నుంచీ ప్రశ్నార్థకమే.  వాసాలమర్రి  గ్రామంలో  జరిగిన ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్  అధ్యయనం  ప్రకారం.. 52 దళిత కుటుంబాలు మాత్రమే ఉన్న గ్రామంలో 75 యూనిట్లు మంజూరు చేయడం,  కొన్ని కుటుంబాలకు ఒకటికి మించి యూనిట్లు కేటాయించడం,  రూ.6.5 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినా  చాలా యూనిట్లు కార్యరూపం దాల్చకపోవడం వంటి తీవ్ర అవకతవకలు వెలుగులోకి వచ్చాయి.

మెదక్ ప్రాంతంలో  అర్హులైన దళితుల నుంచి ఎంపిక కోసం రూ.లక్ష వసూలు చేశారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. గ్రామంలో  ఇరవై  కుటుంబాలలో ఒక్కరికి మాత్రమే పథకం అందుతుండటంతో  ‘అందరికీ ఇవ్వాలి, లేదా ఎవరికీ ఇవ్వొద్దు’ అన్న ఆగ్రహం దళిత సమాజంలో వ్యాపించింది.  అధికార పార్టీ కార్యకర్తలు,  మద్దతుదారులకే  పథకం పరిమితమైందన్న  ఆరోపణలు  దళితబంధు అసలు స్వరూపాన్ని బట్టబయలు చేశాయి.

ఎస్సీ, ఎస్టీల సబ్ ప్లాన్ నిధుల మళ్లింపు
మూడెకరాల భూమి హామీ కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో దళితుల్లో ఎన్నో ఆశలు రేకెత్తించింది.  భూమిలేని  దళిత  కుటుంబాలకు భూమి అందించి ఆర్థికంగా  నిలబెట్టాలన్న లక్ష్యం గొప్పదే.  కానీ ఆ హామీ అమలు సున్నా అని చెప్పాలి.  ఒకవైపు భూమి,  మరోవైపు ఉపాధి, విద్య, గృహం, సామాజిక భద్రత.. ఈ అంశాలన్నింటినీ సమగ్రంగా చూడాల్సిన అవసరం ఉన్నప్పటికీ, రాజకీయ ప్రకటనలు ఎక్కువగా,  స్థిరమైన  సామాజిక మార్పు లేదన్న అభిప్రాయం  ఏర్పడింది.  చట్టబద్ధంగా  జనాభా దామాషా ప్రకారం  ఎస్సీ,  ఎస్టీలకు  కేటాయించాల్సిన సబ్ ప్లాన్  నిధులను ఇతర పథకాలకు మళ్లించారన్న ఆరోపణలు బీఆర్ఎస్  పాలనలో  పదేపదే వినిపించాయి.

ఎస్సీ కార్పొరేషన్  రుణాలు అర్హులైనవారికి మంజూరు చేయకపోవడం,  గిరిజనులకు రావాల్సిన 12 శాతం రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏళ్ల తరబడి పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెట్టడం వంటివి గత బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రశ్నించేలా చేశాయి. రంగారెడ్డి జిల్లాలో  ఒకేప్రాంతంలో  గిరిజనుల  నుంచి 1,500 ఎకరాల  అసైన్డ్ భూములను వెనక్కి తీసుకున్నారన్న ఆరోపణ కూడా తీవ్రమైనదే. దళిత, గిరిజన సంక్షేమం కోసమని రాజ్యాంగబద్ధంగా కేటాయించిన నిధులను దారి మళ్లించడం, వారి భూమి హక్కులను హరించడం - ఇవి కేవలం పరిపాలనా వైఫల్యాలు కావు, ఉద్దేశపూర్వక నిర్లక్ష్యానికి నిదర్శనాలు.
 
బీసీలకు వెన్నుపోటు.. రిజర్వేషన్ల కోత 
బహుజన  వ్యతిరేకతకు  అత్యంత  స్పష్టమైన ఉదాహరణ 2018లో  బీఆర్ఎస్  ప్రభుత్వం  తీసుకున్న నిర్ణయం.  పంచాయతీరాజ్ ఎన్నికల్లో  50 శాతం  రిజర్వేషన్  పరిమితికి లోబడాలంటూ నిబంధనలు మార్చివేసి, అప్పటివరకూ దాదాపు 34 శాతంగా  ఉన్న  బీసీ ప్రాతినిధ్యాన్ని కేవలం 22 శాతానికి కుదించేశారు.

ఈ  కీలక నిర్ణయంపై అప్పట్లో ఏ ఒక్క బీఆర్ఎస్  నేత  కూడా  బహిరంగంగా  అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అధికారంలో ఉన్న పదేళ్లలో  బీసీల  జనగణన కోసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయని  బీఆర్ఎస్,  ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చొని 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం గళమెత్తడం అవకాశవాద రాజకీయానికి పరాకాష్ట.

బీసీ బంధు పథకాన్ని కూడా కేవలం ఎన్నికల  గిమ్మిక్కుగానే  ప్రవేశపెట్టారన్న విమర్శలు బలంగా ఉన్నాయి.  అధికారంలో ఉన్నప్పుడు హక్కులు  కత్తిరించి,  పదవి  కోల్పోయాక ఉద్యమకారుల వేషం వేయడం బీఆర్ఎస్ ద్వంద్వ నీతికి అద్దం పడుతుంది.

పదేళ్లు  అధికారం  అనుభవించిన పార్టీ  ఇప్పుడు  దళితుల సమస్యలపై  ప్రశ్నలు సంధిస్తే,  సహజంగానే ప్రజలు గత  పాలన  లెక్కలు అడుగుతారు.  అదే  సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా తన హామీల అమలుపై ప్రజలకు  సమాధానం  చెప్పాలి.  దళితులకు  న్యాయం అనేది  రాజకీయ  నినాదం కాదు.  అది  రాజ్యాంగం ఇచ్చిన హక్కు.  బహుజనుల సంక్షేమం  ఓటుబ్యాంకు కోసం ఉపయోగించే అంశం కాదు. అది  ప్రజాస్వామ్య పాలనకు కొలమానం.

వేముల వీరేశం, ఎమ్మెల్యే నకిరేకల్,  ప్రభుత్వ విప్