- ఓటీటీ యూజర్లు 66 కోట్లు.. దేశ జనాభాలో 45 శాతానికి సమానం
- వార్షికంగా 11 శాతం పెరుగుదల
- బండిల్స్, అగ్రిగేటర్లతో భారీ వృద్ధి
- ఆర్మాక్స్ మీడియా రిపోర్ట్ వెల్లడి
న్యూఢిల్లీ: నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ప్రైమ్, హాట్స్టార్వంటి ఓవర్ ది టాప్(ఓటీటీ) ప్లాట్ఫారమ్స్వినోదానికి కేరాఫ్ అడ్రస్‌గా ఎదుగుతున్నాయి. వీటితో మనదేశ డిజిటల్ వినోద రంగం జెట్స్పీడ్తో దూసుకెళ్తోంది. మీడియా కన్సల్టింగ్ సంస్థ ఆర్మాక్స్ మీడియా తాజా రిపోర్ట్ ప్రకారం.. ఇండియాలో ఓటీటీలు చూసేవారి సంఖ్య 66.49 కోట్లకు చేరింది. ఇది దేశ మొత్తం జనాభాలో 45 శాతానికి సమానం!
గత ఏడాది కాలంతో పోలిస్తే వీళ్ల సంఖ్య 11 శాతం పెరిగింది. అప్పుడు ఈ సంఖ్య 60.12 కోట్లుగా ఉండేది. టెలికం ఆపరేటర్ల బండిల్స్, ఓటీటీ అగ్రిగేటర్ల ద్వారా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లను పొందుతున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. డబ్బు చెల్లించి చూసే యాక్టివ్ సబ్‌స్క్రిప్షన్ల సంఖ్య 17.26 కోట్లకు చేరుకుంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 16 శాతం అధికం.
జియో, ఎయిర్టెల్ కొన్ని రీచార్జ్‌ప్లాన్లపై ఉచితంగానే ఓటీటీ సేవలను అందిస్తున్నాయి. ఇంటర్నెట్ కనెక్టివిటీ టీవీ విభాగంలో కీలకమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఈ విభాగం యూజర్ల సంఖ్య 20.69 కోట్లకు ఎగబాకింది. గత సంవత్సరంతో పోలిస్తే ఇది ఏకంగా 60 శాతం దూసుకెళ్లింది. ఇప్పటి వరకు మొబైల్ ఫోన్ల ద్వారా మాత్రమే ఎక్కువగా వీడియోలు చూసే భారత మార్కెట్ ఇప్పుడు టూ స్క్రీన్ వ్యవస్థగా మారుతోందని ఆర్మాక్స్ మీడియా వ్యవస్థాపకుడు, సీఈవో శైలేష్ కపూర్ తెలిపారు. దీనివల్ల ప్రేక్షకులు ఎప్పుడంటే అప్పుడు కంటెంట్‌ను ఆస్వాదించగలుగుతున్నారని వివరించారు.
వారంలో 14 గంటలు
ఆన్లైన్లో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, సీరియళ్లు చూడటానికి జనం కేటాయిస్తున్న సమయం కూడా పెరిగింది. సగటున ప్రతి వీక్షకుడు వారానికి 14.9 గంటల పాటు ఆన్‌లైన్ వీడియో కంటెంట్ చూస్తున్నాడు. సోషల్ మీడియా, మైక్రో డ్రామా ప్లాట్‌ఫామ్‌లు, ఫాస్ట్ ఛానెళ్లలో గడిపే సమయం కూడా ఇందులో కలిసే ఉంది. దీనివల్ల ఏడాదికి మొత్తంగా 51,700 కోట్ల గంటల నిడివి గల వీడియోలు చూస్తున్నారని అంచనా. 44 నగరాల్లో ఓటీటీ వీక్షకుల సంఖ్య 0.1 కోట్లు లేదా అంతకంటే ఎక్కువగా ఉంది. పట్టణ , గ్రామీణ ప్రాంతాల్లోని 15 వేల మందిపై ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో సర్వే నిర్వహించి ఈ నివేదికను రూపొందించారు.
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. కంటెంట్ పరంగా కొన్ని కొత్త పోకడలు వెలుగు చూశాయి. మైక్రో డ్రామాలు 50 శాతం వృద్ధితో ప్రేక్షకులను ఆకర్షిస్తుండగా, కొరియన్ డ్రామాలు 48 శాతం, యానిమేషన్ కంటెంట్ 32 శాతం వృద్ధిని సాధించగలిగాయి. ఉచిత ప్రసారాలు అందించే ఫాస్ట్ ఛానెల్స్ వినియోగం కూడా ప్రారంభమైంది. ఆడియో స్ట్రీమింగ్ రంగం సైతం భారీగా విస్తరిస్తోంది. నెలవారీ యాక్టివ్ ఆడియో స్ట్రీమింగ్ యూజర్ల సంఖ్య 22.73 కోట్లకు చేరుకోగా, వారిలో 1.5 కోట్ల మంది పెయిడ్ సర్వీసులు వాడుతున్నారని ఆర్మాక్స్ రిపోర్ట్ వివరించింది.
