మంత్రి ఎర్రబెల్లి క్యాంప్​ ఆఫీసు ముట్టడికి జీపీ కార్మికుల యత్నం

 మంత్రి ఎర్రబెల్లి క్యాంప్​ ఆఫీసు ముట్టడికి  జీపీ కార్మికుల యత్నం

పాలకుర్తి, వెలుగు:   రాష్ట్ర పంచాయతీ రాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు క్యాంపు ఆఫీసు ముట్టడికి  ప్రయత్నించిన గ్రామ పంచాయతీ కార్మికులు, సిబ్బందిని పోలీసులు అడ్డుకొని అరెస్ట్​ చేశారు.  కొంత కాలంగా తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ సమ్మె చేస్తున్న  పంచాయతీ కార్మికుల జేఏసీ శుక్రవారం జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని  మంత్రి ఎర్రబెల్లి క్యాంపు ఆఫీసును ముట్టడించి 48 గంటల పాటు మహాధర్నా కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చింది. దీంతో వర్ధన్నపేట ఏసీపీ వి.సురేశ్​ ఆధ్వర్యంలో పాలకుర్తి, వర్ధన్నపేట సీఐలు విశ్వేశ్వర్​, శ్రీనివాస్​, 10 మంది ఎస్సైలతో పాటు 150 మంది పోలీసు సిబ్బందితో ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రం నుంచే జేఏసీ నాయకులను అరెస్ట్​ చేసి పోలీస్​ స్టేషన్లలో నిర్బంధించారు. క్యాంపు ఆఫీసు చుట్టూ మీడియాకు కూడా పర్మిషన్​ లేకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. శుక్రవారం పొద్దున్నే పాలకుర్తి నలువైపులా కిలోమీటర్​ దూరంలోనే బారికేడ్లను ఏర్పాటు చేసి పాలకుర్తికి వచ్చే వాహనాలు తనిఖీ చేసి వివిధ ప్రాంతాల నుంచి ముట్టడికి వస్తున్న కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకొని పాలకుర్తికి చేరుకున్న వందలాది మంది జీపీ సిబ్బంది గ్రూపులుగా ఏర్పడి స్థానిక రాజీవ్​ చౌరస్తా, గుడివాడ చౌరస్తా, గవర్నమెంట్​ హాస్పిటల్ ​ఏరియాలో , మెయిన్ రోడ్డులోని​ షాపుల ముందు నిలబడి మూకుమ్మడిగా ఒకేసారి వెళ్లాలని ప్లాన్​ చేశారు. కానీ విషయం తెలుసుకున్న పోలీసులు ప్రైవేటు బస్సులు, డీసీఎం, ఇతర వెహికల్స్​లో వారిని బలవంతంగా ఎక్కించి ఇతర పోలీస్​ స్టేషన్లకు తరలించారు.    శాంతి యుతంగా తాము చేస్తున్న కార్యక్రమాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారని జేఏసీ జిల్లా కన్వీనర్​ రాపర్తి రాజు రాజీవ్​ చౌరస్తాలో నిరసనకు దిగారు.  ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తూ రోడ్డుపై బైఠాయించారు.  ఆందోళనకారులను అందరినీ చుట్టుపక్కల మండలాల పోలీస్​ స్టేషన్లకు తరలించారు. 

అక్రమ అరెస్టులను ఖండిస్తున్నం

 గ్రామ పంచాయతీ కార్మికుల అక్రమ అరెస్టులు చేయడాన్ని సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఖండిస్తోందని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కా రాములు, పాలడుగు భాస్కర్  తెలిపారు.  పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  ఇంటికి  వెళ్లి తమ గోడు వెళ్లబోసుకొని, వినతి పత్రం అందించడానికి  వెళ్లిన వందలాది మందిని అరెస్టు చేయడం దారుణమన్నారు.