
హనుమకొండ, వెలుగు: జిల్లాలో జూన్ 6వ తేదీ నుంచి నిర్వహించనున్న ‘బడిబాట’లో భాగంగా సర్కారు సూళ్లలో విద్యార్థుల అడ్మిషన్లను పెంచాలని, సమన్వయంతో పని చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య ఆఫీసర్లకు సూచించారు. హనుమకొండ కలెక్టరేట్ లో శుక్రవారం బడిబాట కార్యక్రమంపై సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బడిబాట కార్యక్రమ నిర్వహణకు ప్రత్యేక ప్రణాళిక ఉండాలన్నారు. తహసీల్దార్, ఎంపీడీవోలు, ఎంఈవోలు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి యూనిఫామ్స్ సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ప్రభుత్వ, కేజీబీవీ విద్యాసంస్థల్లో ఇంటర్మీడియట్ చదివేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో విద్యాలత, జిల్లా సంక్షేమ అధికారి జయంతి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ఎంక్వైరీ స్పీడప్ చేయాలె
పరకాల: భూభారతి సదస్సుల్లో వచ్చిన అప్లికేషన్ల ఎంక్వైరీని స్పీడప్ చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. పైలట్‌ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన నడికూడ మండలంలో స్వీకరించిన అప్లికేషన్ల విచారణ ప్రక్రియపై తహసీల్దార్కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. దరఖాస్తులను పరిశీలించి రైతులకు నోటీసులు ఇచ్చి, క్షేత్రస్థాయిలో విచారణ చేయాలన్నారు. తగిన ఉత్తర్వులు జారీ చేసి ఆన్లైన్లో నమోదు చేయాలని తహసీల్దార్ రవీందర్‌కు చెప్పారు. అనంతరం రాయపర్తిలో ఏర్పాటు చేసిన విచారణ ప్రక్రియను పరిశీలించారు. కలెక్టర్‌వెంట ఆర్డీవో నారాయణ, అధికారులున్నారు.