ఈ-సిగరెట్ అమ్మకాలపై కొరడా.. 15 వెబ్ సైట్లకు నోటీసులు

ఈ-సిగరెట్ అమ్మకాలపై కొరడా.. 15 వెబ్ సైట్లకు నోటీసులు

2019 నుంచి నిషేధం ఉన్నప్పటికీ.. కొన్ని ఆన్‌లైన్ షాపింగ్ సైట్‌లు, రిటైల్ షాపులలో ఇంకనూ ఈ-సిగరెట్ లు లభ్యమవుతున్నాయి. ఈ క్రమంలో దీనికి సంబంధించిన పోర్టల్ సమాచారాన్ని నివేదించాలని తాజాగా కేంద్రం రాష్ట్రాలను కోరింది. ఈ క్రమంలోనే ఈ సిగరెట్ల అమ్మకాలు, వాటికి సంబంధించిన ప్రకటనలు అమలు చేస్తోన్న 15 వెబ్ సైట్లకు తమ కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశిస్తూ.. నోటీసులు జారీ చేసింది. లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇక మరో వైపు ఈ సిగరెట్ల నిషేధాన్ని సమర్థంగా పాటించేలా చూడాలని ఆరోగ్య శాఖ ఇటీవలే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది

సోషల్ మీడియాలో ఈ-సిగరెట్ల ప్రకటనలు మరియు విక్రయాలను కూడా మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోందని, త్వరలో వాటికి నోటీసులు జారీ చేయవచ్చని అధికారులు తెలిపారు. చట్టానికి లోబడి పని చేయని వెబ్ సైట్ లను కూడా తొలగించేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెంటనే.. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు లేఖ రాయాలని యోచిస్తోంది. కాగా ఎలక్ట్రానిక్ సిగరెట్లపై 2019లో చట్టం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఈ-సిగరెట్ల అమ్మకాలు, తయారీ, ఎగుమతి, దిగుమతి, రవాణా, పంపిణీ లాంటివన్నీ వస్తాయి.