శ్రీశైలానికి స్వల్ప వరద!

శ్రీశైలానికి స్వల్ప వరద!
  • వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టుకు 2.5 టీఎంసీలు 
  • జూరాల, తుంగభద్రకూ స్వల్పంగా ఇన్​​ఫ్లో

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వర్షాలు జోరుగా కురుస్తుండడంతో కృష్ణా బేసిన్​తో పాటు గోదావరి బేసిన్​కూ వరద మొదలైంది. శుక్రవారం శ్రీశైలం ప్రాజెక్టుకు 2.5 టీఎంసీల మేర వరద వచ్చి చేరింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు 10,935 క్యూసెక్కుల మేర వరద వస్తున్నది. ఎగువన వర్షాలు కురుస్తున్నందున  వరద కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే, ఎగువన వర్షాలు భారీగా పడి.. ప్రాజెక్టులు నిండితే జులై నాటికి మన ప్రాజెక్టులకు వరద మొదలయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఇటు జూరాల, అటు తుంగభద్రకూ స్వల్ప వరద వస్తున్నది. జూరాలకు 5600, తుంగభద్రకు 6700 క్యూసెక్కుల చొప్పున వరద వస్తున్నది. ఇటు గోదావరి బేసిన్​లోని శ్రీరాంసాగర్​ ప్రాజెక్టుకు కూడా కొద్దికొద్దిగా ఇన్​ఫ్లో​ నమోదవుతున్నది. 

రెండు రోజుల్లో నైరుతి

కేరళలోకి మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మూడు రోజుల తర్వాత తెలంగాణలోనూ రుతుపవనాలు ప్రవేశించవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అరేబియాలో ఏర్పడిన అల్పపీడనం.. శనివారం వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. బంగాళాఖాతంలోనూ 27న అల్పపీడనం ఏర్పడుతుందన్నారు. మరో ఐదు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడతాయని తెలిపిన అధికారులు.. ఎల్లో అలర్ట్​ జారీ చేశారు. కాగా.. శుక్రవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్​ భూపాలపల్లి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి.