కుమ్రంభీం వర్ధంతికి అన్ని ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

కుమ్రంభీం వర్ధంతికి అన్ని ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
  • కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
  • 7న విద్యాసంస్థలకు సెలవు

ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్​జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్ లో ఈ నెల 7న నిర్వహించనున్న కుమ్రంభీం వర్ధంతికి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని  కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. వర్ధంతి కార్యక్రమ ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్​లో అధికారులతో రివ్యూ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వేడుకల్లో తాగునీరు, రవాణా, భోజన వసతి, విద్యుత్ సరఫరా, వైద్య శిబిరాలు, పారిశుద్ధ్యం కార్యక్రమాలను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు.

 ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని, ప్రజల కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని, వాటర్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, భోజన వసతి కల్పించాలన్నారు. రవాణాకు ఇబ్బందులు కలగకుండా రోడ్లకు రిపేర్లు చేపట్టాలని, పోలీసులు బందోబస్తు కల్పించాలని ఆదేశించారు. అధికారులు సమన్వయంతో పని చేసి వేడుకలను సక్సెస్​ చేయాలన్నారు.

విద్యాసంస్థలకు సెలవు

కుమ్రంభీం వర్ధంతిని పురస్కరించుకొని జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. కుమ్రంభీం వర్ధంతి వేడుకలు ఈ నెల 7న జోడేఘాట్​లో నిర్వహించనున్న నేపథ్యంలో ఆరోజు సెలవు ప్రకటించారు. ఈ సెలవుకు బదులుగా నవంబర్ 8న రెండో శనివారం రోజును పనిదినంగా కొనసాగించనున్నట్లు  పేర్కొన్నారు.