ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

దేవరకద్ర, మరికల్ వెలుగు: దేవరకద్ర మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి, పోచ్చమ్మ ఆలయం వద్ద ఉన్న కాషాయ జెండాలను జీపీ సిబ్బంది తొలగించడంపై శనివారం వీహెచ్‌‌పీ ఆధ్వర్యంలో అంతరాష్ట్ర  రహదారి167పై  ధర్నా నిర్వహించారు.  ఈ సందర్భంగా నేతలు గుద్దెటి చంద్రయ్య శెట్టి, గోవర్ధన్ రెడ్డి, దేవన్న సాగర్  మాట్లాడుతూ దసరా  రోజు పోలీసుల ఆదేశాల మేరకే జెండాలను తొలగించినట్లు జీపీ సిబ్బంది చెప్పారని మండిపడ్డారు. భారీగా ట్రాఫిక్‌‌ జామ్‌‌ కావడంతో  ఎస్సై భగవంత్​ రెడ్డి ధర్నా విరమించాలని కోరారు. అయినా వాళ్లు వినకపోవడంతో  సీఐ  రజిత రెడ్డి  అక్కడికి చేరుకొని  జెండాలు మళ్లీ ఏర్పాటు చేయిస్తామని హమీ ఇచ్చారు.   అలాగే మరికల్‌‌లో కట్టిన కాషాయ జెండాలను  తొలగించడంపై గ్రామస్తులు రాస్తారోకో చేశారు. సీఐ రామ్‌‌లాల్‌‌, ఎస్సై అశోక్‌‌ బాబు అక్కడికి చేరుకొని సోమవారం మళ్లీ ఏర్పాటు చేయిస్తామని చెప్పాడంతో ఆందోళనను విరమించారు. 

చెరువులో పడి వ్యక్తి మృతి

మక్తల్, వెలుగు: వలస వెళ్తున్నామని అత్తామామకు చెప్పేందుకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు.  ఎస్సై పర్వతాలు వివరాల ప్రకారం.. మాగనూర్​మండలం ఉజ్జెల్లికి చెందిన గోవిందు (35 ) బతుకుదెరువు కోసం బొంబాయికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకొని అత్తామామకు చెబుదామని శనివారం ఉప్పరిపల్లి బయల్దేరాడు. వీళ్లు ఇల్లు ఊరికి దూరంగా చెరువుకు ఆవల ఉండడంతో నడుచుకుంటూ వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు చెరువులో పడ్డాడు.  గమనించిన గ్రామస్తులు డెడ్‌‌బాడీని బయటికి తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.  పోలీసులు అక్కడికి చేరుకొని మక్తల్ ​ప్రభుత్వ అస్పత్రిలో పోస్టుమార్టం చేయించి కుటుంబసభ్యులకు అప్పగించారు.  మృతునికి భార్య లక్ష్మి, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

వ్యక్తి దారుణ హత్య

గద్వాల, వెలుగు:  మల్దకల్ మండలం అమరవాయి గ్రామానికి చెందిన బోయ నడిపి నల్లన్న(48) దారుణ హత్యకు గురయ్యాడు. సీఐ చంద్రశేఖర్,  ఎస్సై శేఖర్ వివరాల ప్రకారం.. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నల్లన్న శుక్రవారం రాత్రి భోజనం అనంతరం గ్రామ సమీపంలోని పశువుల కొట్టం వద్దకు వెళ్లి పడుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డళ్లతో విచక్షణా రహితంగా నరికారు. శనివారం ఉదయం  కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో  క్లూస్ టీం, డాగ్‌‌ స్క్వాడ్‌‌తో ఘటనా స్థలంలో వివరాలు సేకరించారు. మృతుడికి ఇద్దరు భార్యలు ఉండగా.. మొదటి భార్య ఎల్లమ్మకు ఇద్దరు కూతుళ్లు, రెండో భార్య అనుములమ్మకు కూతురు, కొడుకు ఉన్నారు. ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అక్రమ సంబంధం కోణంలో దర్యాప్తు చేపట్టారు. అంత్యక్రియలు ముగిసిన వెంటనే గ్రామానికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

మహిళా చట్టాల అమలులో నిర్లక్ష్యం

నారాయణపేట, వెలుగు: ప్రభుత్వాలు మహిళా చట్టాల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని టీపీటీఎఫ్‌‌ స్టేట్ లీడర్ నారాయణమ్మ మండిపడ్డారు. శనివారం ప్రగతిశీల మహిళా సంఘం 7వ రాష్ట్ర మహాసభల ప్రారంభోత్సవం సందర్భంగా అరుణోదయ కళాకారులు, మహిళలు జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు.  అనంతరం సత్యనారాయణ చౌరస్తాలో పీవోడబ్ల్యూ రాష్ట్ర అద్యక్షురాలు కె.రమ అధ్యక్షతన నిర్వహించిన సభలో నారాయణమ్మ మాట్లాడుతూ  దేశంలో మహిళలు, బాలికలపై వేధింపులు, అత్యాచారాలు పెరిగిపోయాయని వాపోయారు. అయినా నిందితులకు శిక్షలు పడడం లేదని, డబ్బు, పలుకుబడితో తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. కె. రమ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మద్యం ఆదాయంపై ఆధారపడడం సరికాదని,  పల్లెల్లో  విచ్చిలవిడిగా మద్యం దొరుకుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  మద్యం మత్తు కారణంగానే మహిళలపై దాడులు జరుగుతున్నాయన్నారు.  ఈ కార్యక్రమంలో పీవోడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరుణ, ఉపాధ్యక్షరాలు గోదావరి, సహాయ కార్యదర్శులు  కల్పన, విజయలక్ష్మి, రాష్ట్ర కమిటీ సభ్యులు శిరోమణి, ఝాన్సీ, లలిత, సంధ్య, స్వరూప, లక్ష్మీబాయి విజయ, లక్ష్మి, సావిత్ర, పీవోడబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు శారద, ఉపాధ్యక్షురాలు లక్ష్మి, జిల్లా కార్యదర్శి సౌజన్య,  సహాయ కార్యదర్శి భాగ్యలక్ష్మి, ట్రెజరర్‌‌‌‌ మాధవి, ప్రజాపంథా నేతలు కృష్ణ, బి.రాము, కాశీనాథ్​ పాల్గొన్నారు.

నారాయణ పేట కలెక్టర్‌‌‌‌‌‌‌‌గా శ్రీహర్ష

గద్వాల, నారాయణపేట, వెలుగు: గద్వాల జిల్లా అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) కోయ శ్రీహర్షకు ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చింది. నారాయణపేట జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌గా నియమిస్తూ సీఎస్‌‌‌‌ సోమేశ్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ 2020 ఫిబ్రవరి నుంచి పనిచేస్తున్న కలెక్టర్ హరిచందనను జనరల్ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌లో రిపోర్ట్ చేయాలని అందులో పేర్కొన్నారు.  కాగా,  గద్వాల నుంచి శ్రీహర్షను ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ చేసిన సర్కారు.. ఆయన స్థానంలో ఇంకా ఎవరికీ పోస్టింగ్ ఇవ్వలేదు. 

బీఆర్‌‌‌‌ఎస్‌‌కు మద్దతుగా ర్యాలీ

జడ్చర్ల, వెలుగు: బీఆర్‌‌‌‌ఎస్‌‌ను స్వాగతిస్తూ పార్టీ నేతలు శనివారం జడ్చర్ల నుంచి హైదరాబాద్‌‌లోని తెలంగాణ భవన్​వరకు కార్ల ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని సన్మానించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  దేశం కోసం సీఎం కేసీఆర్​ చేస్తున్న పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  జడ్పీ వైస్​ చైర్మన్​ కోడ్గల్​ యాదయ్య,  డీసీఎంఎస్​ చైర్మన్​ ప్రభాకర్​ రెడ్డి, రాష్ట్ర గిరిజన సంక్షేమ కార్పొరేషన్​ చైర్మన్​ వాల్యా నాయక్​,రాష్ట్ర సంగీత నాటక అకాడమీ మాజీ చైర్మన్​ బాద్మి శివకుమార్​ ఉన్నారు. 

పార్టీలకతీతంగా అభివృద్ధి

గండీడ్, వెలుగు: పార్టీలకతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి చెప్పారు. శనివారం మహమ్మదాబాద్ మండల కేంద్రంలో దళితబంధు కింద లబ్ధిదారుడు గోపాల్ పెట్టుకున్న బట్టల షాప్‌‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  దళితులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌‌‌‌ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని చెప్పారు.  విడతలవారీగా ప్రతి దళిత కుటుంబానికి లబ్ధి చేకూరుస్తామన్నారు. అనంతరం గండీడ్ మండలం లింగాయపల్లి,  బైస్పల్లి, జక్కుల పల్లి, సల్కర్ పేట్ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్‌‌‌‌ఎస్‌‌లో చేరగా..  కండువా కప్పి ఆహ్వానించారు.  లింగయ్య పల్లి సర్పంచ్ వెంకటయ్య, జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ ఈశ్వరయ్య, పీఏసీఎస్‌‌ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ గిరిధర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గోపాల్ రెడ్డి,  నేతలు బాలవర్ధన్ రెడ్డి , రామచంద్ర రెడ్డి, రమేశ్ రెడ్డి పాల్గొన్నారు.