రెండో రోజు అయోధ్యకు పోటెత్తిన భక్తులు..

రెండో రోజు అయోధ్యకు పోటెత్తిన భక్తులు..

లక్నో: బాలరాముడిని దర్శించుకునేందుకు అయోధ్యకు భక్తులు పోటెత్తారు.  రెండో రోజు అయోధ్య రామ మందిరానికి భారీగా రామ భక్తులు తరలిస్తున్నారు. జనవరి 24వ తేదీ బుధవారం తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు మెయిన్ గేటు వద్ద బారులు తీరారు.  ఉదయం 7 గంటల నుంచి భక్తులను బాలరాముడిని దర్శించుకునేందుకు నిర్వాహకులు అనుమతిస్తున్నారు. 

ఈరోజు బాలరాముడి దర్శనానికి దాదాపు 3 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు నిర్వాహకులు. ఆలయం బయట అధిక సంఖ్యలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామివారి దర్శన సమయాన్ని పొడిగించాలని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ యోచిస్తోంది.   రామ్‌ లల్లా దర్శనం కోసం రెండు స్లాట్‌లు కేటాయిస్తున్నట్లు నిన్ననే ట్రస్ట్‌ ప్రకటించింది. ఉదయం 7గం. నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 గం. వరకు  రెండు దఫాలుగా భక్తులను అనుమతిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

జనవరి 22వ తేదీ సోమవారం అయోధ్యలో అంగరంగ వైభవంగా ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా వేదపండితులు బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ చేశారు. ఈ కార్యక్రమానికి వేలాది భక్తులు, సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. తర్వాత రోజు నుంచి సామన్య భక్తులకు బాలరాముడిని దర్శించుకునేందుకు అనుమతి ఇస్తున్నారు.దీంతో దేశం నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా సుమారు 8 వేల మంది పోలీస్‌ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొదటి రోజు శ్రీరాములవారిని దర్శించుకునేందుకు  5 లక్షల మంది భక్తులు వచ్చినట్లు నిర్వాహకులు వెల్లడించారు.