
- ప్రపంచంలో అతిపెద్ద పీపీపీ ప్రాజెక్ట్ గా బిజినెస్ రివ్యూ జర్నల్‌లో పబ్లిష్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) ప్రాజెక్ట్‌కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో ఒకటైన హార్వర్డ్ యూనివర్సిటీ ఈ ప్రాజెక్ట్‌ను కేస్ స్టడీగా ఎంచుకొని, తమ హార్వర్డ్ బిజినెస్ రివ్యూ అనే జర్నల్‌లో ‘‘హైదరాబాద్ మెట్రో – ఆలోచన నుంచి అమలువరకు: పబ్లిక్ ప్రైవేట్ పార్టర్న్ షిప్‌లో ప్రపంచంలోని అతిపెద్ద మెట్రో రైల్ ప్రాజెక్ట్’’ అనే హెడ్డింగ్ తో రీసెర్చ్ పేపర్ ను పబ్లిష్ చేసింది.
ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచి ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్, మేటాస్ కంపెనీ ఫెయిల్ అవ్వడం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో రాజకీయ అస్థిరత, ప్రజల నిరసనలు, ఆర్థిక ఇబ్బందులు, వివిధ డిపార్ట్‌మెంట్ల నుంచి అప్రూవల్స్ తీసుకోవడంలో ఎదురైన ఆటంకాలు ఇలా అనేక సవాళ్లను ఈ రిపోర్టులో చర్చించారు. అయినప్పటికీ, మెట్రో వ్యూహాత్మక నాయకత్వం, స్ట్రాటజిక్ ప్లానింగ్, బోల్డ్ డెసిషన్స్‌తో 2017 నాటికి ఫస్ట్ ఫేజ్ ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తిచేశారు.
హైదరాబాద్ లో ట్రాఫిక్ రద్దీ భారీగా తగ్గింది
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ మెట్రో ప్రాజెక్ట్‌గా నిలిచి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌లో ఆదర్శంగా నిలిచిందని హార్వర్డ్ రిపోర్ట్ పేర్కొంది. మెట్రో ఎండీ ఎన్వీఎస్ఎస్ రెడ్డి స్ట్రాటజిక్ విజన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని ఉపయోగించి ఈ ప్రాజెక్ట్‌ను అద్భుతంగా నడిపించారని తెలిపింది. ఈ ప్రాజెక్ట్ వల్ల హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గిందని, కాలుష్యం కంట్రోల్ అయ్యిందని, ప్రజలకు సురక్షితమైన, సమర్థవంతమైన ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం లభించిందని చెప్పింది.
అలాగే, స్టేషన్ల చుట్టూ కమర్షియల్ డెవలప్‌మెంట్ జరిగి, ఆర్థిక వృద్ధి కూడా సాధ్యమైందని, ఇంతకు ముందు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బీ), స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలు కూడా హెచ్ఎమ్ఆర్ సక్సెస్ స్టోరీని తమ రివ్యూ రీసెర్చ్ పేపర్లుగా ప్రచురించాయి. తాజాగా, హార్వర్డ్ కూడా ఈ జాబితాలో చేరడంతో, హైదరాబాద్ మెట్రో రైల్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లలో రికార్డ్ క్రియేట్ చేసింది.