పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు సుధాకర్ భార్య

పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు సుధాకర్ భార్య

తెలంగాణలో మరో ఇద్దరు మావోయిస్టులు పోలీసులు ముందు  లొంగిపోయారు . రాష్ట్ర కమిటీ మెంబర్  కాకరాల సునీత అలియాస్ బద్రి (మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడు సుధాకర్ భార్య), చెన్నూరు హరీష్ అలియాస్ శ్రీను రాచకొండ సీపీ సుధీర్ బాబు ఎదుట లొంగిపోయారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లే మావోయిస్టులు లొంగిపోతున్నారని సీపీ తెలిపారు. 

కాకరాల సునీత 

కాకరాల సునీత మావోయిస్టు పార్టీలో కీలకంగా పని చేసింది. సునీత 40 సంవత్సరాలపాటు మావోయిస్టు పార్టీలో వివిధ విభాగాలు పనిచేశారు. 1985లో, రాజమండ్రిలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (RSU) పట్ల ఆకర్షితురాలైంది.  ఆమె తండ్రి కాకరాల సత్యనారాయణ, విప్లవ రచయితల సంఘంలో ముఖ్యమైన నాయకుడు. వరవరరావు, గద్దర్ వంటి విప్లవకారులు తరచుగా వారి ఇంటికి వచ్చేవారు. ఈ ప్రభావం కూడా పార్టీ పట్ల ఆమెకు ఆకర్షణకు దోహదపడింది.

జనవరి 1986లో, ఆమె CPI (ML) పీపుల్స్ వార్ వైపు పూర్తిగా ఆకర్షితురాలై అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. 1986 నుండి 1990 వరకు, ఆమె విజయవాడ పట్టణంలో CPI (ML) PW  సెంట్రల్ ఆర్గనైజర్ (CO)గా పనిచేసింది.  విజయవాడలో CO గా పనిచేస్తున్న సమయంలో, ఆమెకు TLN చలం అలియాస్ గౌతమ్ @ సుధాకర్ తో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారింది. ఆగస్టు 1986 లో వారిద్దరూ వివాహం చేసుకున్నారు.

1990 నుంచి 1992 వరకు ఆమె గుంటూరు పట్టణంలో సెంట్రల్ ఆర్గనైజర్ (CO)గా పనిచేశారు. 1992లో, ఆమె నల్లమల అడవిలోకి వెళ్లి, అక్కడ ఫారెస్ట్ డివిజనల్ కమిటీలో పనిచేసింది.  నల్లమలలో ఉన్న సమయంలో, ఆమె వెలిగొండ ,  భైరవకోన ఎన్‌కౌంటర్లలో పాల్గొంది. ఆమె 2001 వరకు నల్లమలలో పనిచేసింది.  2001లో ఆమెకు DVCM (డివిజనల్ కమిటీ సభ్యురాలు)గా పదోన్నతి లభించింది.

►ALSO READ | తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డునే బురిడీ కొట్టించిన 59 మంది కానిస్టేబుల్స్

2001లో ఆమె భర్త TLN చలం తో కలిసి, ఆమె AOB (ఆంధ్రా-ఒడిశా సరిహద్దు) ప్రాంతానికి బదిలీ చేయబడింది. అక్కడ ఆమె 2006 వరకు పనిచేసింది. AOBలో ఆమె పదవీకాలంలో ఆమె పూజారిగూడ ఎన్‌కౌంటర్‌లో పాల్గొంది. 2006లో ఆమె భర్త టిఎల్ఎన్ చలంతో పాటు, ఆమెను దండకారణ్యం (డికె) కు బదిలీ చేశారు. దండకారణ్యం కార్యకర్తలలో సైద్ధాంతిక, రాజకీయ అవగాహన లేకపోవడంతో  కేడర్ లో సైద్ధాంతిక, రాజకీయ అవగాహనను బలోపేతం చేయడానికి కేంద్ర కమిటీ ప్రత్యేకంగా సునీత ,చలంను డికె కు నియమించింది. 2014లో ఆమె కుతుల్ ఎన్‌కౌంటర్‌లో పాల్గొంది.

జూన్ 5,2025న, ఆమె తన భర్తతో కలిసి అన్నపురం నేషనల్ పార్క్ ఎన్‌కౌంటర్‌లో పాల్గొంది, ఈ EoFలో ఆమె భర్త TLN చలం చనిపోయాడు.  2006 నుంచి  ఇప్పటివరకు, ఆమె తన భర్తతో కలిసి రీజినల్ పొలిటికల్ స్కూల్, ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంటల్ కమిటీ సభ్యురాలిగా పనిచేసింది. మావోయిస్టు పార్టీ  సిద్ధాంతకర్త , మేధావిగా, ఆమె పలు  వ్యూహాలను రూపొందించడంలో గణనీయంగా పని చేసింది. ఇదే కాకుండా  అనేక పత్రాలను తయారు చేయడంలో ,  క్రాంతి వంటి పార్టీ పత్రికలను ప్రచురించడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది.

 హరీశ్ గురించి

చెన్నూరి హరీష్ @ రామన్న @ శ్రీను ఏరియా కమిటీ సభ్యుడిగా పనిచేశాడు . భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రంగయ్యపల్లి గ్రామానికి చెందినవాడు .  2006లో, ఏటూరునాగారంలోని బిసి వెల్ఫేర్ హాస్టల్‌లో 10వ తరగతి చదువుతున్నప్పుడు, ఆయన మావోయిస్టు పార్టకి ఆకర్షితుయ్యాడు . మే-2015 లో, అతను అశ్వినిని వివాహం చేసుకున్నాడు.  2010 నుండి 2017 వరకు, ఆర్థిక సమస్యల కారణంగా హరీష్ వేర్వేరు ప్రదేశాలలో పనిచేశాడు.  2017లో అతను CP బాటాలో చేరి దాదాపు ఒక నెల పాటు పనిచేశాడు. ఆ తర్వాత అతను పార్టీని విడిచిపెట్టాడు. 

నవంబర్ 2018లో తన భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత  హరీష్ CPI (మావోయిస్ట్)లో చేరడానికి ప్రయత్నించాడు.  ఆ సమయంలో  భద్రాచలంలో అరెస్టు చేయబడి, నెల రోజులు వరంగల్ జైలులో ఉన్నాడు.  ఆ సమయంలో జైలులో అతను TPFకి చెందిన మంచు రమేష్‌తో పరిచయం ఏర్పడ్డాడు.  2019లో జైలు నుంచి విడుదలైన తర్వాత మంచు రమేష్ పిలుపు మేరకు అతను టీపీఎఫ్ కార్యాలయంలో పనిచేశాడు.  2020 జూన్‌లో పోలీసులు టీపీఎఫ్ కార్యాలయంపై దాడి చేసి మంచు రమేష్, కృష్ణ, మద్దిలేటిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. డిసెంబర్ 2020లో విజయేందర్ పిలుపు మేరకు  దామోధర్ @ బడే చొక్కా రావు, TSCM బృందంలో చేరారు. 

దామోధర్ బృందంలో కొన్ని రోజులు పనిచేసిన తర్వాత హరీష్ చర్ల LOS (స్థానిక ఆర్గనైజింగ్ స్క్వాడ్) కు బదిలీ చేయబడ్డాడు, అక్కడ అతను ఆరు నెలలు పనిచేశాడు. జూలై - 2021లో ఆయనను KM DVCకి బదిలీ చేసి నేషనల్ పార్క్ ప్రాంతానికి పంపారు,  అక్కడ ఆయన SCMలోని మైలారపు అడెల్లు @ భాస్కర్ బృందం కింద మంగి-ఇంద్రవెల్లి ఏరియా దళంలో చేరారు. అక్కడ ఆయన పార్టీ సభ్యుడిగా పార్టీ సభ్యత్వం పొందారు. భాస్కర్ సూచనల మేరకు, నవంబర్ 2021లో, అతను, మంగి-ఇంద్రవెల్లి ప్రాంత దళంతో కలిసి ఆదిలాబాద్‌కు వచ్చాడు.

డిసెంబర్ 2021 చివరి వారంలో వారు నేషనల్ పార్క్ ప్రాంతానికి తిరిగి వచ్చారు. మళ్ళీ, భాస్కర్ సూచనల మేరకు, అక్టోబర్ 2022లో హరీష్, మంగి-ఇంద్రవెల్లి ప్రాంత దళంతో కలిసి ఆదిలాబాద్‌కు వచ్చాడు.  అక్టోబర్ 2022 చివరి వారంలో వారు నేషనల్ పార్క్ ప్రాంతానికి తిరిగి వచ్చారు.  డిసెంబర్ 23, 2022న హరీష్ నేషనల్ పార్క్ ప్రాంతంలోని టెకమెట్టా వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నాడు.  ఈ సంఘటనలో, భాస్కర్, DCM తో ఉన్న అనిత , అశోక్, PM తో ఉన్నవారు మరణించారు. హరీష్ కుడి కాలుకు బుల్లెట్ గాయం అయింది.  మే 2023 నుండి నవంబర్ 2024 వరకు, అతను నేషనల్ పార్క్ ఏరియా కమిటీ యొక్క టైలరింగ్ బృందంలో పనిచేశాడు.

మే - 2024లో, ఆయనకు ఏరియా కమిటీ సభ్యుడిగా (ACM) పదోన్నతి లభించింది.జూన్ 07,2025న హరీష్ నేషనల్ పార్క్ ప్రాంతంలోని ఇర్పగుట్ట వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నాడు. ఈ సంఘటనలో, భాస్కర్, TSCM మరో ముగ్గురు కార్యకర్తలు మరణించారు.  జనజీవన స్రవంతిలోకి రావాలన్న పోలీసుల విజ్ఞప్తి మేరకు ఇద్దరు మావోయిస్టు లొంగిపోయారు.  

మావోయిస్టులు తమ గ్రామాలకు తిరిగి వస్తే, తెలంగాణ ప్రభుత్వం వారికి పునరావాసం కల్పిస్తుంది.  మావోయిస్టులు స్వతంత్ర జీవితాన్ని గడపడానికి ప్రభుత్వం వారికి అన్ని విధాలుగా మద్దతు ఇస్తుంది.ప్రస్తుత యువతరం మావోయిస్టులకు దూరంగా ఉంది. పార్టీలోకి నియామకాలు దాదాపు పూర్తిగా ఆగిపోయాయి, ఏ విద్యార్థి కూడా మావోయిస్టు పార్టీలో చేరడం లేదు. మావోయిజం  ఒక కాలం చెల్లిన భావజాలం.మావోయిస్టులకు  ఇదే మా విన్నపం "ఆయుధాలు వదిలి రహస్య జీవితాన్ని వదిలివేయండి - ప్రజల ప్రధాన స్రవంతిలో చేరండి" అని సీపీ సుధీర్ బాబు తెలిపారు.