సొరకాయ జ్యూస్ చేదుగా ఉంటే తాగొద్దు .. జ్యూస్ తాగి ఢిల్లీలో ఒకరు, యూపీలో ఇద్దరు మృతి

సొరకాయ జ్యూస్ చేదుగా ఉంటే తాగొద్దు .. జ్యూస్ తాగి ఢిల్లీలో ఒకరు, యూపీలో ఇద్దరు మృతి
  •     చేదు జ్యూస్​లో క్యూకర్బిటాసిన్స్ విషం ఉన్నట్టు గుర్తించిన ఐసీఎంఆర్ 
  •     విరుగుడు లేదని హెచ్చరిక 

హైదరాబాద్, వెలుగు: ఆరోగ్యానికి మంచిదని సొరకాయను జ్యూస్ చేసుకుని తాగుతున్నారా? అయితే, చాలా జాగ్రత్తగా ఉండాల్సిందేనంటోంది ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్). ఎందుకంటే.. బాగా చేదుగా ఉన్న ఆనెంకాయ జ్యూస్ తాగి ఇటీవల ఢిల్లీలో ఒకరు, యూపీలో ఇద్దరు చనిపోయారు. పదుల సంఖ్యలో ఆస్పత్రి పాలయ్యారు. దీంతో ఆనెంకాయ జ్యూస్ ఎందుకు ప్రాణాంతకంగా మారుతున్నదో స్టడీ చేసేందుకు ఐసీఎంఆర్ ఓ ఎక్స్​పర్ట్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ జ్యూస్​పై అధ్యయనం చేసిన ఆ కమిటీ.. బాగా చేదుగా ఉండే జ్యూస్​తోనే సమస్య ఉన్నట్టుగా గుర్తించింది. టెట్రాసైక్లిక్ ట్రైటెర్పినాయిడ్ అనే విష పదార్థాల(కుకుర్బిటాసిన్స్) వల్లే సొరకాయ జ్యూస్​ చేదుగా మారుతున్నదని నిర్ధారించింది. కుకుర్బిటాసిన్స్ విషానికి విరుగుడు కూడా లేదని, ఆ విషం వల్ల కలిగే సింప్టమ్స్ కు మాత్రమే ట్రీట్మెంట్ ఉందని స్పష్టం చేసింది. అందుకే ఆనెంకాయ జ్యూస్ చేదుగా అనిపిస్తే తాగొద్దని ఐసీఎంఆర్ కమిటీ హెచ్చరించింది.  

ఆరోగ్యానికి మంచిదే, కానీ.. 

షుగర్, బీపీ కంట్రోల్, లివర్ సమస్యలు, బరువు తగ్గడం కోసం చాలా మంది సొరకాయను జ్యూస్ చేసుకుని తాగుతుంటారు. కానీ పలు సందర్భాల్లో ఆ సొరకాయ జ్యూస్ చేదుగా మారుతుండడంతో తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. చేదు జ్యూస్​ను అసలు ముట్టుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ తాగిన తర్వాత వికారంగా ఉండడం, వాంతులు, విరేచనాలు వంటివి అయితే వెంటనే హాస్పిటల్​కు వెళ్లాలని ఐసీఎంఆర్ కమిటీ తెలిపింది. ఈ విషంతో కడుపులో బ్లీడింగ్ అయ్యే ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంటుందని, దానిని తెలుసుకునేందుకు అవసరమైతే రైల్స్ ట్యూబ్ టెస్ట్ చేయాలని సూచించింది. అసలు ఆనెంకాయ వల్ల విషం ఎందుకు తయారవుతోందన్న విషయాన్ని తేల్చాలని కమిటీ సిఫారసు చేసింది. చేదు, సాధారణ సొరకాయల్లోని రసాయన మూలకాలపై స్టడీ చేస్తే సమస్య ఏమిటో తెలిసే అవకాశం ఉంటుందని పేర్కొంది.