
- మానేరు. హుస్సేన్‌మియా వాగు నుంచి రవాణా
- క్వారీలను మించి తవ్వుకపోతున్నరు
- పట్టించుకోని అధికార యంత్రాంగం
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాల పరిధిలో ఉన్న మానేరు, హుస్సేన్‌మియా వాగుల నుంచి ఇసుక విచ్చల విడిగా తోడుకు పోతున్నరు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటైన తర్వాత ఇసుకను గృహావసరాల కోసం ఫ్రీగా వాడుకోవచ్చని ఆదేశాలిచ్చింది. ఇసుకను అవసరాలకు అనుగుణంగా మాత్రమే తీసుకెళ్లే విధంగా అధికారులు దృష్టి సారించాలని సర్కార్ సూచించింది. కానీ ఆ నిర్ణయాన్ని కొందరు తమ అక్రమార్జనకు వాడుకుంటున్నారు. వేలాది ట్రాక్టర్లతో నిరంతరంగా ఇసుకను జిల్లాలోని ఇతర ప్రాంతాలకు తరలించుకుపోతున్నారు. దీనిపై ఎలాంటి నియంత్రణ కనిపించడం లేదు.
మానేరు, హుస్సేన్‌మియా వాగుల నుంచి వేలాది ట్రాక్టర్ల ఇసుక రవాణా జరుగుతోంది. ట్రాక్టర్ యజమానులు యథేచ్చగా ధరలు నిర్ణయించుకొని అందినకాడికి దోచుకుంటున్నారు. జిల్లాలో విజయవంతమైనసాండ్ ట్యాక్సీ పక్కకు పోయింది. గతంలో క్వారీల మూలంగా నష్టం జరుగుతుందని భావించారు, కానీ దాన్ని మించి ఇసుక ఫ్రీ చేయడంతో భారీ నష్టం జరుగుతున్నట్లు మానేరు పరివాహ గ్రామాల ప్రజలు చెప్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇసుక అక్రమ రవాణపై సంబంధిత శాఖల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
భూగర్బజలాలు తగ్గుతున్నాయి
కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మానేరు, హుస్సేన్‌మియా వాగు నుంచి నిత్యం వందలాది ట్రాక్టర్లతో ఇసుక రవాణా సాగుతోంది. గృహ అవసరాల కోసం అని చెబుతూ ఇతర ప్రాంతాలకు తరలించి అమ్ముకుంటున్నారు. ఇసుకను ఇష్టారీతిలో తవ్వేస్తుండడంతో భూగర్భజలాలు తగ్గిపోతున్నాయని, బోర్లు ఎండిపోతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వాగులు ఎండిపోయాయి. గ్రామాల్లో ఉన్న బోర్లు, చేదబావులు అడుగంటిపోతున్నాయి. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో వందలాది ట్రాక్టర్లు ఇసుక అక్రమ రవాణకే ఉపయోగిస్తున్నారు.
వ్యక్తిగత అవసరాల కోసం ఇసుకను ఉపయోగించుకోవాలని సూచిస్తున్నప్పటికీ, విచ్చలవిడిగా ట్రాక్టర్ యజమానులు మాత్రం పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా సప్లయ్ చేస్తున్నారు. మానేరు నుంచి ఇసుకను ట్రాక్టర్లతో పెద్దపల్లి జిల్లా కేంద్రానికి తరలించి అమ్ముకుంటున్నారు. మానేరు నుంచి మాత్రమే ఇసుకను గృహావసరాలకు తీసుకోవాల్సిందిగా సూచించినప్పటికీ అందుబాటులో ఉన్న హుస్సేన్‌మియా వాగులో కూడా నిత్యం ట్రాక్టర్లతో ఇసుకను తరలించుకుపోతున్నారు.
సాండ్ ట్యాక్సీకి ఆదరణ కరువు...
పెద్దపల్లి జిల్లా ఏర్పాటైన తర్వాత మొదటగా చార్జ్ తీసుకున్న జిల్లా కలెక్టర్ సాండ్ ట్యాక్సీ విధానాన్ని తెచ్చారు. ఇసుక ట్రాక్టర్ లోడ్‌కు సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ధరలు నిర్ణయించి ఇసుకను సప్లయ్ చేశారు. రాను రాను మానేరులో కార్పొరేట్ స్థాయిలో క్వారీలు ఏర్పాటు కావడం ఆనాటి బీఆర్ఎస్ సర్కార్‌లో ఉన్న పెద్దలు వాటికి అండగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్నారనే ఆరోపణలొచ్చాయి.
ఈ క్రమంలో స్థానికంగా ఉన్న నాయకులు గ్రీన్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించడంతో క్వారీలను నిలిపివేయాల్సిందిగా ఆదేశాలచ్చింది. అనంతర కాలంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం, ఇతర గృహావసరాలకు ఇసుక ఫ్రీగా తీసుకునే విధంగా వెసులుబాటు కల్పించారు. కానీ ఫ్రీ అనే దాన్ని ఆసరాగా చేసుకొని కొందరు వేలాది ట్రాక్టర్లతో ఇసుకను తోడుకొనిపోయి అమ్ముకుంటున్నారు.అధికారులు ఇసుక దందాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.